
అభిప్రాయం
ప్రధాని మోదీ ఆ మధ్య తన ‘మన్ కీ బాత్’ ప్రసారంలో ఒక ప్రధానమైన ప్రజారోగ్య సవాలు గురించి నొక్కి చెప్పారు. అదేమిటంటే... అధిక బరువు లేదా ఊబకాయం సమస్య. ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించని మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు (ఎన్‌సీడీలు) పెరగడా నికి దారితీసే కారకాల్లో ఊబకాయం ఒకటి. వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్న ప్రయత్నాలతో దేశం ఊబకాయం సవాలును పరిష్కరించగలదని ప్రధాని అన్నారు. ‘ప్రతి నెలా 10 శాతం తక్కువ నూనె వాడితే సరి. అది ఊబ కాయాన్ని తగ్గించే ముందడుగు అవుతుంది’ అన్నారాయన.
ఆహారంలో తక్కువ నూనె వాడటం, ఊబకాయాన్ని ఎదు ర్కోవడం కుటుంబం పట్ల బాధ్యత కూడా అని ప్రధాని అన్నారు. ప్రధాని ఇచ్చిన ప్రజారోగ్య సందేశం ముఖ్యమైనదే. కానీ అది మొత్తం కథలో ఒక భాగం మాత్రమే. కొవ్వుల అధిక వినియోగం, ప్రధానంగా ఆహారంలో ఉండే ఒక రకమైన ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా అసంతృప్త కొవ్వు (ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్) లేదా అనేది ఎన్‌సీడీ వ్యాధులకు కారణమయ్యే వాటిల్లో ఒకటి మాత్రమే. అసంతృప్త కొవ్వు మూలాలలో పాల ఉత్పత్తులు, నెయ్యి, మాంసం, వనస్పతి ఉన్నాయి.
ఇతర కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జారీ చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం... కొబ్బరి నూనె, నెయ్యి, పామోలిన్ నూనెలో సంతృప్త కొవ్వుల నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది. ప్రధాని సూచించినట్లుగా, వంట చేసేటప్పుడు లేదా డ్రెస్సింగ్ చేసేట ప్పుడు ఆహారానికి జోడించే కొవ్వుల వినియోగాన్ని తగ్గించడం అనేది మనం వేసే ముందడుగులో సగం మాత్రమే. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, వేయించిన స్నాక్స్, కుకీలు వంటి వాటిద్వారా మనం అసంతృప్త కొవ్వులను తీసుకుంటాం.
సంతృప్త, అసంతృప్త కొవ్వుల వనరులు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వంట నూనెలూ ఉంటాయి. ప్రజారోగ్యంపై ఆరోగ్యకర ప్రభావం కోసం... నూనెలు మాత్రమే కాక నెయ్యి, వనస్పతి అలాగే అల్ట్రా–ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం అవసరం. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చుని పనిచేసే జీవనశైలికి వ్యతిరేకంగా కూడా ఊబకాయంపై జాతీయ ప్రచారాన్ని విస్తరించాలి.
వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని కోరడం ద్వారా ఊబకాయ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను వ్యక్తులపై పెట్టారు ప్రధాని. ఆరోగ్యకర ఆహారపుట లవాట్లను అవలంబించడం అనేది వ్యక్తుల బాధ్యతతోపాటు, సామాజిక బాధ్యత కూడా అంటూ దశాబ్దాలుగా సాగించిన ప్రచారానికి ఇది విరుద్ధం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు తినడానికి వీలు కల్పించే, ప్రోత్సహించే వాతావరణ పరికల్పనకు తగిన విధానాలను రూపొందించడం ప్రభుత్వ విధి.
ఊబకాయాన్ని పరిష్కరించడానికి వ్యక్తిగతమైన చర్యలతో పాటు ఇతర చర్యలూ అవసరం. ఉదాహరణకు, భారతదేశం వంటనూనె దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పైగా ప్రభుత్వ విధానాలు పామాయిల్ దిగుమతిని ప్రోత్సహిస్తాయి. దిగుమతి చేసుకున్న అన్ని నూనెలలో ఇది దాదాపు 60 శాతం ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమకు పామాయిల్ చాలా ఇష్టమై నది. అయినా అనేక అధ్యయనాలు పామాయిల్ వినియోగంతో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపాయి. వంట నూనెల ఉత్పత్తినీ, దిగుమతినీ నియంత్రించే ప్రభుత్వ విధానాలను ప్రజలకు తక్కువ హానికరమైన వంట నూనెలను అందించే విధంగా రూపొందించాలి.
గత కొన్ని దశాబ్దాలుగా... పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, ఆహార ఉత్పత్తుల ప్రపంచీకరణ పెరగడంతో దేశంలో ఆహారపుటలవాట్లు మారాయి. ఫలితంగా ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్పత్తులు ఆహార పర్యావరణాన్ని మార్చాయి. ప్రతి చోటా జంక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఈ మార్పుకు ప్రభుత్వ విధానాలు పెద్ద ఎత్తున దోహదపడ్డాయి. ప్రభుత్వాలు చిప్స్, కోలాస్, కుకీలు, నమ్‌కీన్ వంటి వాటిని తయారు చేసే, ప్రాసెస్ చేసే ఫుడ్ కంపెనీలకు సబ్సిడీలను అందిస్తాయి.
ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి తాజా పండ్లు, కూరగా యలు అందుబాటులో ఉండేలా ప్రోత్సహించాలి. కానీ మన విధానాలు పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసే కంపెనీలను ప్రోత్సహిస్తాయి. మరోవైపు, జంక్ ఫుడ్‌ను నియంత్రించే ఏ చర్య నైనా ఆహార నియంత్రణ సంస్థలు, పరిశ్రమ ఆదేశం మేరకు నిలిపివేస్తున్నాయి. హాస్యాస్పదం ఏమిటంటే, ఆహార భద్రతా రెగ్యులేటర్, సుప్రసిద్ధ జంక్ ఫుడ్ కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని సంవత్సరాలుగా ’ఈట్ రైట్’ ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
జంక్ ఫుడ్‌పై కఠిన నియంత్రణకు మద్దతు పొందే బదులుగా, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ అది నియంత్రించాల్సిన వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2022 నాటికి ఆహార గొలుసు నుండి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన అసంతృప్త కొవ్వులను తొలగించడానికి ‘ఇండియా:75: ఫ్రీడమ్ ఫ్రమ్ ట్రాన్స్ ఫ్యాట్స్’ కార్యక్రమాన్ని ఆహార నియంత్రణ సంస్థ 2019లో ప్రారంభించింది. కానీ జంక్ ఫుడ్ పరిశ్రమ నుండి తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ లక్ష్యసాధన సాధ్యం కాలేదు.
‘కూర్చుని పనిచేసే’ జీవనశైలి, అసలు వ్యాయామం చేసే అవకాశం లేనిస్థితులు కూడా గమనార్హం. శారీరకంగా చురుకుగా ఉండటం, వ్యాయామం చేయడం వ్యక్తిగత ఎంపికే అయినా, సమాజ స్థాయిలో శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే చురుకైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, నడక, వ్యాయామానికి అనుకూల మైన బహిరంగ ప్రదేశాలను అందించడం; ప్రజా రవాణా, పాద చారులకు ప్రత్యేక కాలిబాటలు, సైక్లింగ్ మార్గాలు ఏర్పాటు ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకం. వంటనూనె వినియోగాన్ని తగ్గించడం వంటి వ్యక్తిగత చర్యలు ఊబకాయపు చక్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment