Eating Habits
-
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
ఆ ఊళ్లో వందేళ్లకు పైగా జీవిస్తున్నారు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఆశ్చర్యకరంగా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. ఈ కోవలోకే వస్తుంది ఇటలీలోని అబ్రుజోలో ఉన్న ఎల్'అక్విలా అనే ప్రాంతం. ఇక్కడి ప్రజలు వందేళ్లకు పైగా జీవిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇంత ఆరోగ్యంగా ఉండటానికి వీళ్లు ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతానికి చెందిన ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారని రీసెర్చ్‌లో తేలింది. ఇక్కడి ప్రజల ఆయుష్షు ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణం వాళ్ల ఆహార నియమాలని తేలింది. వీళ్లు ముఖ్యంగా రాత్రి భోజనాన్ని 7గంటల లోపలే ముగిస్తారని, దీనివల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లోని రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి భోజనం నుంచి మరుసటి రోజు భోజనం చేసే సమయం సుమారు 17.5 గంటల పాటు వ్యవధి ఉండేలా పక్కాగా పాటిస్తారట.ప్రాసెస్ చేసిన మాంసం, స్వీట్లకు ఎల్'అక్విలా ప్రజలు దూరంగా ఉంటారట. వీళ్లు తీసుకునే ఆహారంలో తక్కువ కెలరీలు ఉండేలా చూసుకుంటారని, దీనివల్ల దీర్ఘాయువు పెరుగుతుందని అధ్యయనంలొ వెల్లడైంది. రాత్రి త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల జీర్ణ క్రియ రేటు కూడా పెరుగుతుంది. బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. త్వరగా తినడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. రాత్రి త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది త్వరగా భోజనం చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పనిచేస్తుంది -
ఆహారపు అలవాట్లను నియంత్రించకపోతే..ఆ సమస్యలు తప్పవు!
మనం తీసుకునే ఆహారం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ నిర్ణయిస్తుంది. ఆహరం అనేది రుచి కోసమో బలం కోసమో మాత్రమే కాదు, సరైన సంపూర్ణ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. ఆహారం తక్కువగా తింటే పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా తింటే అది ఊబకాయం వంటి ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకని ఆహారాన్ని ఎప్పుడు కంట్రోల్‌గానే తినాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఒక డైలీ డైట్ అనేది నిర్ణయించుకొని సరైన ఆహారాన్నే తినాలి. ఒక వేళ ఆహారాన్ని నియంత్రించకపోతే సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు నవీన్ నడిమింటి. ఇంతకీ ఎలాంటి సమస్యలు వస్తాయి? తక్కువగా తినాంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి తదితరాలు నవీన్ నడిమింటిగారి మాటల్లో చూద్దాం. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..? ఊబకాయం: ఊబకాయం అనేది అధిక బరువు లేదా అధిక కొవ్వు కలిగి ఉండటం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం మరియు క్యాన్సర్ ఉన్నాయి. గుండె జబ్బులు: గుండె జబ్బులు అనేవి గుండెను ప్రభావితం చేసే అనేక రకాల పరిస్థితులను సూచిస్తాయి. అవి అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు ఊబకాయం వంటి ఆహారపు అలవాట్ల ద్వారా ప్రభావితమవుతాయి. మధుమేహం: మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేకపోవడం. ఇది అధిక కొవ్వు, అధిక చక్కెర మరియు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ప్రభావితమవుతుంది. క్యాన్సర్: క్యాన్సర్ అనేది కణాలు అసాధారణంగా పెరిగే పరిస్థితి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తాయి. వీటిలో కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఉన్నాయి. పాటించాల్సి టిప్స్: తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. గోధుమ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తినండి తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలను ఎంచుకోండి. ఆహారాన్ని మితంగా తినండి. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉండటానికి తప్పక సహాయపడతాయి. -- నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్‌లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్‌ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ -
పామును చూస్తే నోరూరుతుంది అతనికి!... పచ్చిగానే లాగించేస్తాడు!
పుట్లూరు: పామును చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఆ వృద్ధుడికి మాత్రం నోరూరుతుంది. కాకపోతే అతను పామును చంపడు. ఎవరైనా చంపి పడేస్తే దాన్ని ఇష్టంగా ఆరగిస్తాడు. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న అనే వృద్ధుడు ఆదివారం పామును ఆరగించాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్‌గా మారింది. ఇతనికి కొంత కాలంగా పాములను తినే అలవాటు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
బంతి భోజనం వద్దు.. బఫేనే ముద్దు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఉరుకుల పరుగుల యుగంలో జనం ఆహరపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయానికి విలువ పెరగడంతో వేచి ఉండే ధోరణిని మానుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలలో టేబుళ్లు వేసి కూర్చుని తినే ఏర్పాట్లు చేసేవారు. హోటళ్లలోనూ అలాంటి సదుపాయాలే ఉండేవి. కాలక్రమంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూర్చుని తినడానికి బదులు నిల్చుని తినే సంస్కృతి విస్తృతమైంది. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్లు, వేడుకల్లో బఫే (నిల్చుని తినడం) భోజనాలే సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు ఈ బఫే సంస్కృతి ఉన్నత వర్గాల కుటుంబాల్లోనే ఉండేది. కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనూ సర్వసాధారణమైంది. కోవిడ్ నేర్పిన కల్చర్.. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి బఫే కల్చర్‌కు ప్రాధాన్యత పెరిగింది. భౌతిక దూరం పాటించాల్సి రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, నైట్‌ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ జంక్షన్లలో కుర్చీల విధానానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల పంక్తి భోజనాల్లోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ బఫే టిఫిన్లు, భోజనాలకు వీలుగా టేబుళ్లు ఏర్పాటవుతున్నాయి. విజయవాడ నగరంలో ఇలాంటివి అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి. వీటిలో నచ్చిన వాటికి ఆర్డరిచ్చి నిల్చునే తింటున్నారు. గతానికి భిన్నంగా వేచి ఉండే అలవాటుకు స్వస్తి పలుకుతున్నారు. విజయవాడలో ఇలా.. విజయవాడలో కొత్తగా ప్రారంభించే రెస్టారెంట్లలో వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాక రోడ్డు పక్కన, చిన్న చిన్న షాపుల్లోనూ ఏర్పాటు చేస్తున్న టిఫిన్ దుకాణాల బయట ఇలాంటివే ఉంటున్నాయి. కనీసం నాలుగైదు టేబుళ్లు వేస్తున్నారు. నగరంలో ఇలాంటి వాటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. యువతీ యువకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగులు వీటివైపు ఆకర్షితులవుతున్నారు. మారిన ధోరణికిది దర్పణం పడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్ల వారికి ఇలాంటి స్టాండింగ్ టేబుళ్ల ఏర్పాటు వల్ల జాగా బాగా కలిసొస్తోంది. పైగా పెట్టుబడి, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోంది. ఆరోగ్యదాయకం కాకపోయినా.. నిల్చుని తినడం, మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తలెత్తుతాయని, ద్రవాల సమతుల్యత దెబ్బతింటుందని యోగ, ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అదే కూర్చుని తిన్నా, తాగినా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని, నాడీ వ్యవస్థ మెరుగు పడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
అప్పుడు దూరాన్ని తరిమేద్దాం
‘‘కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాకు ఉండే దృష్టి కోణాన్ని మార్చివేశాయి’’ అంటున్నారు కత్రినా కైఫ్. ఈ విషయం గురించి కత్రినా వివరంగా చెబుతూ– ‘‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టేసింది. కరోనాకు ముందు మన జీవితాలు ఎలా సాగాయి? అని ఆలోచిస్తే.. ఇకముందు అప్పటి పరిస్థితులు ఉంటాయా? అనే సందేహం కలుగుతోంది. మన సాధారణ జీవితం మనకు తిరిగి ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం. దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవిగా ఉండటమే ఉత్తమం. నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు. కానీ ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిది. కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం’’ అని అన్నారు. -
రోగ నిరోధక శక్తే కరోనాకు మందు
ప్రపంచంలోని తెలుగువారు గర్వపడేలా దాదాపు 100కు పైగా అమెరికా, ఇతర దేశాల ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న డాక్టర్ ఎం. శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో జన్మించారు. వైరాలజీలో ఆయన పీహెచ్డీ చేశారు. 2012లో నోబెల్ బహుమతికి కూడా ఆయన పేరును నామినేట్ చేశారంటే, బయో టెక్నాలజీలోనూ, వైరాలజీ లోనూ ఆయనకు ఉన్న అవగాహన, పట్టు ఏమిటో అర్థమవుతుంది. అమెరికాలోని డెన్వర్‌లో ఉంటున్న ఆయన కరోనా వైరస్ గురించి వివరంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే... డిసెంబర్ 2019 – జనవరి 2020లోనే వూహాన్లో కరోనా వైరస్ బయటపడగానే, నన్ను కొందరు చైనా వారు కాంటాక్ట్ చేశారు. అప్పుడే నేను ఈ వైరస్ మీద ఒక ఆర్టికల్ రాశాను. భారతీయులం, ముఖ్యంగా తెలుగువాళ్ళం ఈ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అనేది చిన్న వైరస్ కణం... బ్యాక్టీరియా కన్నా చిన్నకణం. వైరస్ కంటే బ్యాక్టీరియా కొన్ని వేల రెట్లు పెద్దది. అంటే కరోనా వైరస్ కణం ఎంత చిన్నదో అర్థం అవుతుంది. వందలో 80 మంది దగ్గర అది చచ్చిపోతుంది. అంటే కరోనా పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిన వాళ్ళు, కరోనా పరీక్ష చేయించుకోకపోయినా కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు 80 శాతం మంది ఉంటారు. వారి దగ్గర ఈ కరోనా చచ్చిపోతుంది. మిగిలిన వారిలో దాదాపు 15 శాతం మందికి ట్రీట్మెంట్ ద్వారా లోపల ఉన్న కరోనా కణాలను చంపేస్తారు కనుక వారు మళ్ళీ మామూలు మనుషులవుతారు. ఇంకా మిగిలిన 5 శాతం మనుషులలో వెంటిలేటర్ వరకు వెళ్ళి కరోనా మరణాన్ని తప్పించుకున్న వాళ్ళ శాతం 2.5 అంటే కరోనా వలన చనిపోయేవారు కేవలం 2.5 శాతం మంది మాత్రమే. అయితే కరోనా సోకిన వారు, కరోనా వలన చనిపోయిన వారిని జాగ్రత్తగా పరిశీలిస్తే వారికి అనేక ఇతర వ్యాధులు ఉండడం, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం కారణమని తెలుస్తోంది. అంటే కరోనాకు మందు మన శరీరాల్లో మంచి రోగ నిరోధకశక్తి ఉండటమే. మనిషిలో రోగ నిరోధకశక్తి ఉంటే యాంటీ వైరస్ కణాలు కొత్తగా వచ్చిన వైరస్ కణాల్ని చంపేస్తాయి. అమెరికాలో నేను డెయిరీ బిజినెస్‌లో ఉన్నాను. అనేక డెయిరీ ప్రొడక్ట్ తయా రుచేసే కంపెనీలకు నేను అడ్వయిజర్‌గా ఉన్నాను. అమెరికాలో డెయిరీ ప్రొడక్ట్స్‌లో రోగ నిరోధకశక్తిని పెంచే పదార్థాలు లేవు. అమెరికాలో ప్రభుత్వ విధానం ప్రకారం బ్యాక్టీరియా రహిత వస్తువులనే అమ్ముతారు. అవే ప్రజలు వాడతారు. అందువల్ల వారిలో రోగ నిరోధకశక్తి తక్కువ. భారతీయులకు రోగ నిరోధకశక్తి బాగా ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో పాల నుంచి పెరుగు చేసుకుతింటాం. అందులో రోగ నిరోధకశక్తి పెంచే బ్యాక్టీరియా ఉంటుంది. ఇదివరకు రాత్రి పూట పాలలో అన్నం ఉంచి, ఆ పాలను తోడుపెట్టి ఉదయమే ఆ పెరుగు అన్నం పెట్టేవారు. దీనికి మించిన రోగ నిరోధకశక్తిని పెంచే మందు లేదు. భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు తినే తిండిలో నిమ్మకాయ, పసుపు, లవంగం, వెల్లుల్లి, అల్లం లాంటి అనేక యాంటీబయాటిక్ పదార్థాలను వాడతారు. అవి తినేవారిలో రోగ నిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని కరోనా వైరస్ ఏమీ చేయలేదు. మన ఆహారపు అలవాట్లే మనల్ని రక్షిస్తాయి అన్నమాట. అంటే కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రతి వ్యక్తి రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అలా చేస్తే కరోనా ఉందా, పోయిందా? వ్యాక్సిన్ వచ్చిందా, రాలేదా? లాక్డౌన్ ఉంటుందా, తీసేస్తారా? లాంటి భయాందోళనలు ఉండవు. చెన్నూరి వేంకట సుబ్బారావు, అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ పత్రిక సంపాదకులు -
ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా..
పప్పన్నం తినమంటే ముఖం అదోలా పెడతాం. అదే బంగాళ దుంపల వేపుడు అయితే ఇష్టంగా లాగించేస్తాం. వేపుళ్లు, అందులోనూ బంగాళాదుంప వినియోగం భారత్‌లో ఎక్కువగా ఉంటోందని ‘ఈట్–లాన్సెట్ కమిషన్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం దీర్ఘకాల ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా భారత ప్రజలు ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. తరచుగా భారతీయులు అనారోగ్యం పాలవడానికి కారణం శరీరానికి అవసరమైన స్థాయిలో ప్రొటీన్లు తీసుకోకపోవడమే కారణమని నివేదికలో పేర్కొంది. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఏటా 1.1కోట్ల ముందస్తు మరణాలను అరికట్టవచ్చని లాన్సెట్ మెడికల్ మ్యాగజైన్లో పేర్కొంది. చేపలు, మాంసం తగ్గిస్తేనే! మాంసాహారం, షుగర్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించాల్సిందేనని నివేదిక పేర్కొంది. పళ్లు, గింజలు, కూరగాయలు తినడాన్ని రెట్టింపు చేయాలని చెబుతోంది. భారతీయులు బంగాళ దుంపలను ఎక్కువగా తింటున్నారని.. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలని సూచించింది. ‘భారత్‌లో అవసరానికంటే 1.5 రెట్లు ఎక్కువగా బంగాళ దుంపలు తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వీటి బదులుగా ప్రొటీన్లను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. పప్పులు, గింజలు, పళ్లు మొదలైన శాకాహార ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, మాంసం వంటివి ఎంత మితంగా తింటే అంత మంచిది’ అని లాన్సెట్ కమిషన్ సభ్యుడు, న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. భారత్‌లో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగు, వినియోగం విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర వినియోగాన్ని అరికట్టడంపై ప్రపంచదేశాలన్నీ ఏకమై ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూమండలమూ సురక్షితం ఈట్–లాన్సెట్ కమిషన్ పరిశోధనలో భాగంగా.. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కలిసి మూడేళ్ల పాటు ప్రపంచ ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. మొత్తంమీద మాంసాహారం వినియోగాన్ని తగ్గించి శాకాహారాన్ని తినడం వల్ల ఈ భూగోళాన్ని కాపాడుకోగలమని కమిషన్‌కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ రాక్స్టామ్ అన్నారు. అదనపు భూమిని వినియోగించుకోకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వాడకాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేవిధంగా ప్రపంచ జనాభా ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సమతుల ఆహారం తీసుకుంటేనే పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా వీరు రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. - మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం అనేదే కాదు, అదెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముఖ్యమే. - మాంసం, పాల ఉత్పుత్తుల వాడకాన్ని తగ్గించి, శాకాహారాన్ని అధికంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. భూగోళం కూడా పచ్చగా ఉంటుంది. - మొక్కల నుంచి వచ్చే గింజలు, కూరగాయలు, పండ్ల వినియోగం 100% పెంచాలి. మాంసం, షుగర్ వాడకాన్ని 50%తగ్గించాలి. - మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతాయి. - మాంసాహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. - ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే.. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు 200 కోట్ల వరకు ఉన్నారు. - కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా చనిపోతున్నారు. - గత ఏభై ఏళ్లుగా ఆహార అలవాట్లలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. - కేలరీలు ఎక్కువగా ఉన్న తిండి తింటున్నాం. ప్రతీ రోజూ సగటున 2,500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాలు ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నాయి. - ఉత్తర అమెరికా వంటి దేశ్లాలో మాంసాన్ని అవసరమైన దాని కంటే 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే దక్షిణాసియా దేశాల్లో తినాల్సిన దానికంటే 50% తక్కువగా మాంసం తింటున్నారు. - 2050కి జనాభా 1000 కోట్లకు చేరుకోవచ్చు నని అంచనా, వారందరి కడుపు నిండాలంటే ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లను అందరూ తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. - ఆహారపు అలవాట్లు మారేలా ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాపదార్థాలపై కొత్త పన్నులు విధించాలి. వాటి అమ్మకంలో పరిమితులు విధించాలి. ఇంకా అవసరమైతే వాటిని నిషేధించాలి. -
ఒంటరిగా తింటే..
లండన్ : ఒంటరిగా భోజనం చేసేవారు విచారంగా ఉంటారని, ఇది ఆర్థిక ఇబ్బందులు, శారీరక వైకల్యం కంటే ఎక్కువ బాధించే అంశమని తాజా అథ్యయనం వెల్లడించింది. పెద్దల్లో నాలుగోవంతు మంది పనిఒత్తిడి, ఒంటరితనం వల్ల కుటుంబసభ్యులతో కలిసి తినలేకపోతున్నారని పేర్కొంది. అథ్యయనంలో భాగంగా 8000 మందిని ప్రశ్నించగా అందరితో కలిసి భోంచేసే వారితో పోలిస్తే ఎప్పుడూ ఒంటరిగా ఆహారం తీసుకునేవారు మెరుగైన జీవన సూచీలో తక్కువ పాయింట్లు పొందినట్టు వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఒకరు తాము తరచూ ఒంటరిగానే భోజనం చేస్తామని చెప్పుకొచ్చారు. వీరిలో అత్యధికులు పనిభారంతో సతమతమయ్యేవారు, అవివాహితులు, విడాకులు తీసుకున్న వారే కావడం గమనార్హం. మరోవైపు పదవీవిరమణ చేసిన వారిలో అతితక్కువ మంది మాత్రమే తాము అరుదుగా ఒంటరిగా భోజనం చేస్తామని చెప్పారు. కుటుంబం, స్నేహితులతో మెరుగైన సంబంధాలు కలిగిఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇతరులతో సానుకూల సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కలిసి భోంచేయడం కీలకమని సామాజిక సంబంధాల కౌన్సెలర్ క్రిస్ షెర్వుడ్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా తినడం ప్రజల మెరుగైన ఆరోగ్యానికి అవరోధమని అథ్యయనం చేపట్టిన ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ పేర్కొంది. ఒంటరితనం, వ్యక్తిగత సంబంధాలు కొరవడటం మూలంగా కొందరికి వైఫల్యాలు ఎదురవుతాయని, మరికొందరు తీవ్ర పనిఒత్తిళ్లతో సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోతున్నారని అథ్యయనం పేర్కొంది. ఒంటరిగా భోజనం చేసే వారిలో లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది. -
చేపా.. చేపా.. ఎప్పుడు తినాలి?
మనలో చాలా మందికి చేపల కూర అంటే నోరూరుతుంది.. అయితే మీరు తినే చేప గురించి మీకు తెలుసా..? ఏ నెలలో ఏ ఫిష్ కర్రీ తింటే మంచిది..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనంపై ఓ లుక్కేయండి.. మత్స్య సంపద ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం ఏడో స్థానంలో ఉంది. చేపల పెంపకంలో అధునాతన పద్ధతులను అమలు చేయడం ద్వారా గత 50 ఏళ్లుగా మనదేశం ఈ స్థానాన్ని నిలుపుకుంటోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం.. 2014లో మనదేశం సుమారు 3.4 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్ర జీవులను ఉత్పత్తి చేసింది. ఇది పార్శా్వనికి ఒక వైపు మాత్రమే. కొన్ని అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే.. దేశంలో మత్స్య రంగం విస్తరణ ప్రస్తుతం అత్యున్నత దశకు చేరిందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చేపలు దొరికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలకు నీళ్లు.. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటంటే.. సముద్ర తీర ప్రాంతాల్లో సీజనల్ ఫిషింగ్(కాలానుగుణ చేపల వేట)పై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. గుడ్లు పెట్టే, పిల్లలను పొదిగే దశలో చేపలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ నిబంధనలు సక్రమంగా అమలవుతున్న దాఖలాలు ఎక్కడా లేవని కర్ణాటక మైసురులోని ఇండియాస్ నేచుర్ కన్సర్వేషన్ ఫౌండేషన్‌కు చెందిన సముద్ర జీవశాస్త్రవేత్త మయురేష్ గంగల్ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌ను అందుకునేందుకు మత్స్యకారులు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ‘నో యువర్ ఫిష్’ క్యాంపెయిన్ ఈ పరిస్థితులను మార్చేందుకు మరో ఇద్దరు సహచరులతో కలసి గంగల్ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తరఫున పోరాడటం.. మత్స్యకారుల చేపల వేట పద్ధతుల్లో మార్పులు చేయడం కాకుండా.. చేపల వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వీరి ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టీమ్ ‘నో యువర్ ఫిష్’(మీ చేప గురించి తెలుసుకోండి) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో సరైన చేపల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాక ఈ టీమ్ చేపల సంతానోత్పత్తి, గుడ్లు పెట్టే దశలను వివరిస్తూ ఏ నెలలో ఏ చేపను తినాలో సూచిస్తూ ఓ క్యాలెండర్‌ను సైతం రూపొందించింది. ఆహారపు అలవాట్లలో మార్పులు కొన్ని చేపలు కొన్ని సీజన్లలో సంతానోత్పత్తి చేస్తాయని, అయితే ఆ సమయంలో సంతానోత్ప త్తికి భంగం కలిగిస్తే వాటికి కొత్త తరం ఉండ బోదని గంగల్ చెప్పారు. భారతీయుల ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల చేపల వేట, వివిధ రకాల చేపల డిమాండ్‌లో మార్పు వస్తుందని ఈ బృందం భావిస్తోంది. సాధారణంగా ఎక్కువగా వంటలకు ఉపయో గించే 25 రకాల చేపలు, రొయ్యలను పరిశీలకులు గుర్తించారు. ఇందులో టైగర్ రొయ్య లాంటి కొన్ని రకాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటే.. బాంబే డక్(వనమట్టాలు లేదా కోకాముట్ట) చేపలను స్థానికంగా వంటలకు ఉపయోగిస్తుంటారు. ఈ వివరాలను ఓ వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. తొమ్మిది ముఖ్యమైన రకాల సముద్ర జీవులకు సంబంధించి ఒక క్యాలెండర్‌ను రూపొందించారు. దీనిని పాఠశాలలు, యూనివర్సిటీలు, సామాజిక సంస్థలకు అందజేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఈ కేలండర్ ఆధారంగా తమ మెనూలను మార్చుకునేందుకు సిద్ధపడ్డాయి కూడా. అలాగే ఏ నెలలో ఏ చేపను తినాలనే దానికి సంబంధించి ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వెబ్సైట్ ఇంగ్లిష్‌లో ఉంది. చేపల పేర్లను మరాఠీలో అందిస్తున్నారు. మరిన్ని భాషల్లో ఈ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చేందుకు ఈ బృందం సన్నాహాలు చేస్తోంది. -
మీ వంట ఆరోగ్యమేనా..?
సెల్ఫ్‌చెక్ మారిన జీవనశైలి, అందులోనూ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు రకరకాల ఆనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో వంటగదిని, వండే విధానాన్ని సంస్కరించుకుంటే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లున్న ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. 1. కుటుంబ సభ్యుల వయసు, బరువు దృష్ట్యా వాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలో గమనించి ఆ రకంగా వండుతారు. ఎ. అవును బి. కాదు 2. ఇంటికి కావలసిన సరుకులు కొనుగోలు చేసేటప్పుడు పిల్లలు ఇష్టపడే రుచికరమైన వాటితోపాటు పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే కాయలు, గింజలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎ. అవును బి. కాదు 3. టైమ్ సరిపోవడం లేదని బయట ఆహారం మీద ఆధారపడితే దేహంలో ఫ్యాట్ నిల్వ చేరుతుందని వాటికి దూరంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 4. శుభ్రత, ఆరోగ్యం దృష్ట్యా ముక్కలు తరిగి ప్యాక్ చేసిన కూరగాయలను కొనడానికి ఇష్టపడరు. ఎ. అవును బి. కాదు 5. కూరగాయలను తరిగిన తర్వాత కడిగితే పోషకాలు నీటిలో కలిసిపోతాయని, ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాతే ముక్కలుగా తరుగుతారు. ఎ. అవును బి. కాదు 6. పోషకాహార నిపుణుల సూచనలను వీలయినంత వరకు ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనన్ని కేలరీలను అందించే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా అవసరమని తెలుసు. అందుకే ఇంటిల్లిపాదినీ వ్యాయామం చేయమని ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 8. మూత లేకుండా ఉడికిస్తే ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి కాబట్టి, పోషకాలను నష్టపోని విధంగా వండడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. రోజుకు ఒకసారి మొలకలు, పండ్లు వంటి అర్కపక్వాలను (మంట మీద వండని ఆహారం) తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. జీర్ణవ్యవస్థ శుభ్రం అవడానికి వీలుగా వారానికోరోజు ఆహారాన్ని పరిమితంగా తింటారు లేదా పస్తు ఉంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాలలో ‘ఎ’లు ఏడు అంతకంటే ఎక్కువ వస్తే ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన ఉన్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువ వస్తే ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం లేదా రుచిగా భోజనం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థం. -
ఆరోగ్యమే అసలైన సంపద
అరవై ఏళ్లు దాటాయి.. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేదు.. అందరూ ఆరోగ్య పరిరక్షణకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కారణం కాలం మారింది.. మనుషుల జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. దీంతో రకరకాల వ్యాధులు మనిషిని చుట్టుముడుతున్నాయి. చిన్న వ యసులోనే ‘పెద్ద’ జబ్జులు పలకరిస్తున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ‘సాక్షి’ ఓ అవగాహనా సదస్సు నిర్వహిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ పెరిగిపోతున్న కాలుష్యం, మారిన జీవనశైలి ఆరోగ్యం చిరునామాను చెరిపేస్తోంది. ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. వ్యాధులు పట్టణాలనే కాదు.. పల్లెలనూ వదలడం లేదు. అనారోగ్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్ ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాలూ అధిక సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే అధికసంఖ్యలో ఉంటే.. మన దేశంలో హైదరాబాద్ మధుమేహానికి ‘రాజధాని’గా మారింది. భాగ్యనగరంలో 30 శాతం మంది ఈ వ్యాధితో కుస్తీపడుతున్నారు. ఇక బీపీ బాధితులూ 40 శాతం మంది పైనే ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి చెబుతున్నాయి. పచ్చని పల్లెసీమల్లోనూ.. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో సుమారు 20 శాతం మంది బీపీతో, 17శాతం మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. మిగతా జబ్బుల సంఖ్య కూడా పల్లెల్లో తక్కువేమీ లేదు. రకరకాల ప్రయత్నాలు.. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వాకింగ్, జిమ్‌లో కసరత్తులు, యోగా వంటి వాటితో ఫిట్నెస్ను పెంచుకుంటున్నారు. ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జబ్బులొస్తేనే వైద్య పరీక్షలకు వెళ్లే పరిస్థితి నుంచి, ముందుజాగ్రత్తగా మాస్టర్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్‌ల వంటివి చేయించుకుంటున్నారు. ముందడుగేసిన ‘సాక్షి’ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పుల గురించి పూర్తిగా తెలిసినవారు చాలా తక్కువమంది. ఈ నేపథ్యంలోనే.. సందేహాలు నివృత్తి చేసేందుకు, ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు, సలహాలు, సూచనలు అందజేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూపు ముందుకొచ్చింది. పేరొందిన వైద్యులు, నిపుణులతో ‘లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట ఒక సదస్సును ఏర్పాటు చేస్తోంది. ‘లివ్ వెల్ ఎక్స్పో’తో అవగాహన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆగస్టు 8, 9 తేదీల్లో ‘లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూపు ఓ సదస్సు నిర్వహిస్తోంది. వైద్య ఆరోగ్య రంగంలోని నిపుణులను ఒకే వేదిక మీదకు తెస్తోంది. జీవనశైలిలో వస్తున్న మార్పులేమిటి? అందువల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలి జబ్బులు రాకుండా ఎలా ముందుకు సాగాలి, జబ్బులకు గురైనవారు వాటిని ఎలా నియంత్రించుకోవాలి? లాంటి ప్రశ్నలు, సందేహాలన్నిటికీ ఇక్కడ సమాధానాలు లభిస్తాయి. డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సోమరాజు, డాక్టర్ వంశీమోహన్, డాక్టర్ మన్నెం గోపీచంద్ వంటి వారితోపాటు పలువురు నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. -
అవేక్.. వాక్
కూర్చుని చేసే ఉద్యోగం, బయటకు అడుగుపెడితే వెహికిల్, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లు. ఈ లగ్జరీయస్ లైఫ్‌స్టైల్‌కు సిటీ పొల్యూషన్ తోడై.. హైదరాబాదీల ప్రాణాలకే ప్రమాదం తెస్తోంది. ఇది కొత్త విషయం కాకపోయినా.. ఈ మధ్యకాలంలో ఎక్కువైన ఈ ట్రెండ్ సిటీ వాసులను డయాబె టిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, మతిమరుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) బారిన పడేట్టు చేస్తోంది. కలవరానికి గురిచేస్తున్న ఈ విషయాలను వెల్లడించింది ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోని నిపుణుల బృందం! ఇటీవల సిటీలో సర్వే నిర్వహించిన ఈ టీమ్... 53.6 శాతం మంది నగరవాసులు కదలకుండా ఉండే లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నట్లు తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 700 మందిలో సగటున 375 మంది నడక, ఎక్సర్‌సెజైస్, యోగాలాంటివేవీ చేయకుండా జీవితాన్ని వెళ్లదీస్తున్నట్లు పేర్కొంది. రోగాలెన్నింటినో దూరం చేసే శారీరక వ్యాయామాలను నగరవాసులు దూరం పెడుతున్నారని దీనివల్ల భవిష్యత్‌లో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. సిటీ సిటిజన్స్ శరీరానికి సరైన పోషకాలనందించే పళ్లు, కూరగాయలను సక్రమంగా తీసుకోవడం లేదని తేల్చింది. ఇక 15 శాతం మంది తినాల్సినదానికంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తింటున్నారని, మరో 20 శాతం మందికి పొగాకు, ఆల్కహాల్ వంటి వి వ్యసనంగా మారాయని తెలిపింది. బ్రిస్క్‌వాక్ చాలు... ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినట్లుగా రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడమంటే కచ్చితంగా ఏ జిమ్‌లోనో జాయినవ్వాల్సిన అవసరం లేదని ఈ రిస్కీ లైఫ్‌స్టైల్‌ను ఎదుర్కోవడానికి బ్రిస్క్‌వాక్ చాలని చెబుతున్నారు. శరీరం మొత్తం కదిలే విధంగా చురుకైన నడక, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకు వెళ్లాలనుకున్నప్పుడు బైకో, కారో వాడకుండా సైకిల్‌పై వెళ్లడం వంటివి చేస్తే చాలని సలహా ఇస్తున్నారు! సిటీప్లస్ -
జబ్బుల్లోనూ మహిళలే టాప్..
మధుమేహం, ఊబకాయంలో వారే ఎక్కువ తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్లే సమస్యలు సిటీబ్యూరో: మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వెరసి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పురుషుల్లో ఎక్కువగా కన్పించే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్, ఎండోక్రైనాలజీ అండ్ యాడిపాసిటీ (ఒబెసిటీ), ఆస్లర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హోటల్ తాజ్ డెక్కన్‌లో మధుమేహం, ఊబకాయం, ఎండోక్రైనాలజీపై సదస్సు నిర్వహించారు. దీనిని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 200 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొని ప్రసంగించారు. ప్రతి పది మందిలో ఒకరు మధుమేహం, అధిక బరువు, థైరాయిడ్, గుండె జబ్బుల్లో ఏదో ఒక దానితో బాధపడుతున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మధుమేహం దేశ మధుమేహ రాజధాని హైదరాబాద్‌గా చెప్పుకునే వాళ్లం. కానీ హైదరాబాద్ కన్నా అత్యధికంగా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో మధుమేహులు ఎక్కువ ఉన్నట్టు తేలింది. నగరంలో పదేళ్లలోపు ఏడువేల మంది చిన్నారులు మధుమేహంతో బాధపడుతుంటే, వీరిలో 3000 పైగా మంది నెలవారి ఇన్సులిన్ ఖర్చులకు నోచుకోలేని దుస్థితిలో ఉన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, ముడి బియ్యం వంటకాలు తినడం ఉత్తమం. - డాక్టర్ పీవీరావు, నిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం పొట్టపై కొవ్వు ప్రమాదం భారతీయుల్లో పొట్ట, మూత్రపిండాలు, కాలేయం, గుండె, కిడ్నీల చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు చాలా ప్రమాదం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. పరోక్షంగా ఇది గుండె, మోకాళ్లు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మిత ఆహారం, విధిగా వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. - డాక్టర్ శ్యామ్ కల్వలపల్లి, ఐడియా సెంటర్ ఆరోగ్య స్పృహ పెరగాలి యూకేలో 5 శాతం మంది మధుమేహంతో బాధపడుతుంటే, భారతదేశంలో మాత్రం 15 శాతం మంది మధుమేహులు ఉన్నారు. సెలైంట్ కిల్లర్‌గా చెప్పుకునే ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై ఎవరికి వారు నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - డాక్టర్ జెఫ్రీ స్టీఫెన్, లండన్ -
సయాటిక
ప్రస్తుతం మానవ జీవితం యాంత్రికంగా మారింది. ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్నవిపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాల్లో మార్పులు రావటం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలతో వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యమైంది కటిశూల (నడుమునొప్పి). 90 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుశ్రుత, బాగ్బటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటిక)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. సాధారణ కారణాలు పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవటం, స్థూలకా యం, అధిక శ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయడం, అధిక బరువులను మోయటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్దత, నొప్పి కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే సయాటిక (గుద్రసీవాతము) అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుముకు సంబంధించిన ఎల్4, ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూస మధ్యగల సయాటిక అనే నరంపై ఒత్తిడి పడటంవల్ల నొప్పి వస్తుంది. డిస్క్‌లో మార్పులు: ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో మార్పులొస్తాయి. డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగి పోవటం వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దాన్లో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనదైతే స్పర్శ హాని కూడా కలగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుం టారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స, 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధచికిత్స ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: దీనివల్ల ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. జాగ్రత్తలు: సరైన పోషకాహారం తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. డాక్టర్ మనోహర్. ఎం.డీ ఆయర్వేద. స్టార్ ఆయుర్వేద ఫోన్.7416102102 www.starayurveda.com -
సంకల్పమే బలం
నాడీ వ్యవస్థ అదుపు తప్పితే... ఆ పరిస్థితే అనూహ్యం. పెరాలిసిస్ (పక్షవాతం).. జీవితాన్ని శాశ్వత వైకల్యంలోకి నెట్టేసే వ్యాధి ఇది. రకరకాల ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దుర్వ్యసనాలు వంటివి నగరజీవిని కుదేలు చేస్తున్నాయి. మెదడు నుంచి కీలక అవయవాలకు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లే సంకేతాలు దారి తప్పుతున్నాయి. సంకేతాల చేరవేత ప్రక్రియలో మోత తట్టుకోలేక నరాలు చిట్లిపోతున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పక్షవాతం బాధితులు ఎక్కువగా ఉన్నారు. దృఢ సంకల్పం ఉంటే దుర్వ్యసనాలను మానేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. పక్షవాతానికి ఇవే కారణాలు... - పొగతాగే వారి సంఖ్య బాగా పెరిగినందునే పక్షవాతం కేసులు ఎక్కువవుతున్నాయి. - ఆకు కూరలు, కూరగాయల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది. అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి అనర్థాలకు గురవుతున్నారు. - ఆల్కహాల్ కారణంగా నరాలు బలహీనంగా మారుతున్నాయి. - నగరంలో ఎక్కువ మంది టెన్షన్ హెడేక్ (ఒత్తిడి కారణంగా తలనొప్పి) బాధితులుగా మారుతున్నారు. ఇది నరాల మీద ఒత్తిడి పెంచి పెరాలసిస్‌కు గురిచేస్తోంది. - చాలామంది అనవసరంగా నెగిటివ్ థింకింగ్ వల్ల ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్, అల్జీమర్, పెరాలసిస్‌కు గురవుతున్నారు. - గతంలో 50-55 ఏళ్ల వయసు దాటితే గానీ పెరాలిసిస్ వచ్చేది కాదు. నగరంలో పలు కారణాల వల్ల 40 ఏళ్లకే పెరాలిసిస్ బారిన పడుతున్నారు. నివారణకు ఈ జాగ్రత్తలు కీలకం... - తక్షణమే ఉప్పు తగ్గించాలి. ఉప్పు తగ్గిస్తే లో-బీపీ వస్తుందనేది అపోహ. రోజుకు ఐదు గ్రాములకు మించి వాడటం మంచిది కాదు. - రోజూ కనీసం 45 నిమిషాలు, వారానికి 5 రోజులు తప్పనిసరిగా నడవాలి. సాధారణంగా మణికట్టు వద్ద పల్స్‌రేటు 60 ఉంటే, నడిచేటప్పుడు 140 ఉండాలి. నెమ్మదిగా నడవడం వల్ల ఫలితం ఉండదు. - నడక బదులు సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడటం కూడా మంచిదే. - రోజువారీ ఆహారంలో 30 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 30 శాతం పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు వంటివి), 20 శాతం ప్రొటీన్స్ (పప్పులు, పెరుగు, పాలు వంటివి) విధిగా ఉండాలి. మాంసాహారులు మటన్ తినడం తగ్గించి, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. - రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ మంచిదే. డార్క్ చాక్లెట్, ఆల్మండ్, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం కూడా మంచిదే. వీటి వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. - రోజూ కొత్తగా ఆలోచించడం, కొత్త రూట్లో ప్రయాణిస్తే జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తుంది. - రోగం వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకొనేకంటే, చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే జీవితకాలం పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రెజెంటేషన్: జి.రామచంద్రారెడ్డి డాక్టర్స్ కాలమ్ -డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్, సెక్రటేరియట్ రోడ్ -
మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) - హోమియో చికిత్స
ఈమధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్యక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. లక్షణాలు: మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది. వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది. చేయి పైకిఎత్తడం కష్టమవుతుంది. జాగ్రత్తలు సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండేవిధంగా సరైన భంగిమలో కూర్చోవాలి బరువులు ఎక్కువగా లేపకూడదు పడుకునేటప్పుడు తలకింద ఎత్తై దిండ్లు వాడకూడదు మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చేయాలి సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. హోమియో చికిత్సా విధానం హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు కారణాలను, వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని వైద్యులుసూచిస్తుంటారు. సాధారణంగా వాడే మందులు... బ్రయోనియా: మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతితో నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకరం. స్పైజీలియం: నొప్పి మెడ నుంచి మొదలై ఎడమభుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది. కాల్మియా: కుడిభుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి. కోనియం: మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఉపయోగం. ఇవేకాకుండా హైపరికం, రాస్టాక్ మొదలైన మందులను వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచనమేరకు వాడితే మెడనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, ఫోన్: 7416 107107 / 7416 102 102 -
మానసిక రోగులను సాధారణ స్థితికి చేర్చండి
సాక్షి, బళ్లారి : మానసిక రోగులను సాధారణ స్థాయికి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అసవరం ఉందని జిల్లా న్యాయమూర్తి విశ్వేశ్వర్ భట్ అన్నారు. ఆయన గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానసిక రోగులను ఆరోగ్యవంతులుగా చేయడంతో వారి తల్లిదండ్రులే కాక సమాజం కూడా కాస్త చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాట్లాడుతూ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొందరు తెలిసీ తెలియక తప్పులు చేస్తారని, అలాంటి వారిని శిక్షించకూడదని చట్టం కూడా చెబుతున్నట్లు గుర్తు చేశారు. మానసిక రోగులను వీలైనంతగా మామూలు స్థితికి తీసుకుని వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. మానసిక రోగుల పట్ల వైద్యులతోపాటు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వారికి చేయూతనిస్తూ ఆరోగ్యవంతులను చేయాలన్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనప్పుడు ఎన్నో నేరాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితి బాగు చేయాలి కాని శిక్షించేందుకు ప్రయత్నించకూడదన్నారు. మానసిక వైద్య నిపుణులు కొట్రేష్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయధీశులు, న్యాయవాదులు, వార్తాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మా వాడి బరువు తగ్గడం ఎలా..?
మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 68 కిలోలు. కొంతకాలంగా వాడి బరువు 62 కిలోల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదేమోనని, బరువు ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - సూర్యారావు, హైదరాబాద్ ప్రస్తుతం టీనేజ్‌లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్