ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ఒంటరిగా భోజనం చేసేవారు విచారంగా ఉంటారని, ఇది ఆర్థిక ఇబ్బందులు, శారీరక వైకల్యం కంటే ఎక్కువ బాధించే అంశమని తాజా అథ్యయనం వెల్లడించింది. పెద్దల్లో నాలుగోవంతు మంది పనిఒత్తిడి, ఒంటరితనం వల్ల కుటుంబసభ్యులతో కలిసి తినలేకపోతున్నారని పేర్కొంది. అథ్యయనంలో భాగంగా 8000 మందిని ప్రశ్నించగా అందరితో కలిసి భోంచేసే వారితో పోలిస్తే ఎప్పుడూ ఒంటరిగా ఆహారం తీసుకునేవారు మెరుగైన జీవన సూచీలో తక్కువ పాయింట్లు పొందినట్టు వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఒకరు తాము తరచూ ఒంటరిగానే భోజనం చేస్తామని చెప్పుకొచ్చారు.
వీరిలో అత్యధికులు పనిభారంతో సతమతమయ్యేవారు, అవివాహితులు, విడాకులు తీసుకున్న వారే కావడం గమనార్హం. మరోవైపు పదవీవిరమణ చేసిన వారిలో అతితక్కువ మంది మాత్రమే తాము అరుదుగా ఒంటరిగా భోజనం చేస్తామని చెప్పారు. కుటుంబం, స్నేహితులతో మెరుగైన సంబంధాలు కలిగిఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇతరులతో సానుకూల సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కలిసి భోంచేయడం కీలకమని సామాజిక సంబంధాల కౌన్సెలర్ క్రిస్ షెర్‌వుడ్ చెప్పుకొచ్చారు.
ఒంటరిగా తినడం ప్రజల మెరుగైన ఆరోగ్యానికి అవరోధమని అథ్యయనం చేపట్టిన ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ పేర్కొంది. ఒంటరితనం, వ్యక్తిగత సంబంధాలు కొరవడటం మూలంగా కొందరికి వైఫల్యాలు ఎదురవుతాయని, మరికొందరు తీవ్ర పనిఒత్తిళ్లతో సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోతున్నారని అథ్యయనం పేర్కొంది. ఒంటరిగా భోజనం చేసే వారిలో లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment