మీ వంట ఆరోగ్యమేనా..?
సెల్ఫ్‌చెక్
మారిన జీవనశైలి, అందులోనూ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు రకరకాల ఆనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో వంటగదిని, వండే విధానాన్ని సంస్కరించుకుంటే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లున్న ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం.
1. కుటుంబ సభ్యుల వయసు, బరువు దృష్ట్యా వాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలో గమనించి ఆ రకంగా వండుతారు.
ఎ. అవును బి. కాదు
2. ఇంటికి కావలసిన సరుకులు కొనుగోలు చేసేటప్పుడు పిల్లలు ఇష్టపడే రుచికరమైన వాటితోపాటు పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే కాయలు, గింజలకు ప్రాధాన్యం ఇస్తారు.
ఎ. అవును బి. కాదు
3. టైమ్ సరిపోవడం లేదని బయట ఆహారం మీద ఆధారపడితే దేహంలో ఫ్యాట్ నిల్వ చేరుతుందని వాటికి దూరంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
4. శుభ్రత, ఆరోగ్యం దృష్ట్యా ముక్కలు తరిగి ప్యాక్ చేసిన కూరగాయలను కొనడానికి ఇష్టపడరు.
ఎ. అవును బి. కాదు
5. కూరగాయలను తరిగిన తర్వాత కడిగితే పోషకాలు నీటిలో కలిసిపోతాయని, ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాతే ముక్కలుగా తరుగుతారు.
ఎ. అవును బి. కాదు
6. పోషకాహార నిపుణుల సూచనలను వీలయినంత వరకు ఆచరించడానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనన్ని కేలరీలను అందించే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా అవసరమని తెలుసు. అందుకే ఇంటిల్లిపాదినీ వ్యాయామం చేయమని ప్రోత్సహిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. మూత లేకుండా ఉడికిస్తే ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి కాబట్టి, పోషకాలను నష్టపోని విధంగా వండడానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
9. రోజుకు ఒకసారి మొలకలు, పండ్లు వంటి అర్కపక్వాలను (మంట మీద వండని ఆహారం) తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. జీర్ణవ్యవస్థ శుభ్రం అవడానికి వీలుగా వారానికోరోజు ఆహారాన్ని పరిమితంగా తింటారు లేదా పస్తు ఉంటారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాలలో ‘ఎ’లు ఏడు అంతకంటే ఎక్కువ వస్తే ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన ఉన్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువ వస్తే ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం లేదా రుచిగా భోజనం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థం.