ఆరోగ్యమే అసలైన సంపద
అరవై ఏళ్లు దాటాయి.. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు చిన్నా పెద్దా
తేడా లేదు.. అందరూ ఆరోగ్య పరిరక్షణకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కారణం కాలం మారింది.. మనుషుల జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. దీంతో రకరకాల వ్యాధులు మనిషిని చుట్టుముడుతున్నాయి. చిన్న వ యసులోనే ‘పెద్ద’ జబ్జులు పలకరిస్తున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ‘సాక్షి’ ఓ అవగాహనా సదస్సు నిర్వహిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ పెరిగిపోతున్న కాలుష్యం, మారిన జీవనశైలి ఆరోగ్యం చిరునామాను చెరిపేస్తోంది. ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. వ్యాధులు పట్టణాలనే కాదు.. పల్లెలనూ వదలడం లేదు.
అనారోగ్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్
ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాలూ అధిక సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే అధికసంఖ్యలో ఉంటే.. మన దేశంలో హైదరాబాద్ మధుమేహానికి ‘రాజధాని’గా మారింది. భాగ్యనగరంలో 30 శాతం మంది ఈ వ్యాధితో కుస్తీపడుతున్నారు. ఇక బీపీ బాధితులూ 40 శాతం మంది పైనే ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి చెబుతున్నాయి.
పచ్చని పల్లెసీమల్లోనూ..
ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో సుమారు 20 శాతం మంది బీపీతో, 17శాతం మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. మిగతా జబ్బుల సంఖ్య కూడా పల్లెల్లో తక్కువేమీ లేదు.
రకరకాల ప్రయత్నాలు..
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వాకింగ్, జిమ్‌లో కసరత్తులు, యోగా వంటి వాటితో ఫిట్‌నెస్‌ను పెంచుకుంటున్నారు. ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. జబ్బులొస్తేనే వైద్య పరీక్షలకు వెళ్లే పరిస్థితి నుంచి, ముందుజాగ్రత్తగా మాస్టర్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్‌ల వంటివి చేయించుకుంటున్నారు.
ముందడుగేసిన ‘సాక్షి’
జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పుల గురించి పూర్తిగా తెలిసినవారు చాలా తక్కువమంది. ఈ నేపథ్యంలోనే.. సందేహాలు నివృత్తి చేసేందుకు, ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు, సలహాలు, సూచనలు అందజేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూపు ముందుకొచ్చింది. పేరొందిన వైద్యులు, నిపుణులతో ‘లివ్ వెల్ ఎక్స్‌పో’ పేరిట ఒక సదస్సును ఏర్పాటు చేస్తోంది.
‘లివ్ వెల్ ఎక్స్‌పో’తో అవగాహన
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆగస్టు 8, 9 తేదీల్లో ‘లివ్ వెల్ ఎక్స్‌పో’ పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూపు ఓ సదస్సు నిర్వహిస్తోంది. వైద్య ఆరోగ్య రంగంలోని నిపుణులను ఒకే వేదిక మీదకు తెస్తోంది. జీవనశైలిలో వస్తున్న మార్పులేమిటి? అందువల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలి జబ్బులు రాకుండా ఎలా ముందుకు సాగాలి, జబ్బులకు గురైనవారు వాటిని ఎలా నియంత్రించుకోవాలి? లాంటి ప్రశ్నలు, సందేహాలన్నిటికీ ఇక్కడ సమాధానాలు లభిస్తాయి. డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సోమరాజు, డాక్టర్ వంశీమోహన్, డాక్టర్ మన్నెం గోపీచంద్ వంటి వారితోపాటు పలువురు నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.