సంకల్పమే బలం
నాడీ వ్యవస్థ అదుపు తప్పితే... ఆ పరిస్థితే అనూహ్యం. పెరాలిసిస్ (పక్షవాతం).. జీవితాన్ని శాశ్వత వైకల్యంలోకి నెట్టేసే వ్యాధి ఇది. రకరకాల ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దుర్వ్యసనాలు వంటివి నగరజీవిని కుదేలు చేస్తున్నాయి. మెదడు నుంచి కీలక అవయవాలకు నాడీ వ్యవస్థ ద్వారా వెళ్లే సంకేతాలు దారి తప్పుతున్నాయి. సంకేతాల చేరవేత ప్రక్రియలో మోత తట్టుకోలేక నరాలు చిట్లిపోతున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పక్షవాతం బాధితులు ఎక్కువగా ఉన్నారు. దృఢ సంకల్పం ఉంటే దుర్వ్యసనాలను మానేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు.
పక్షవాతానికి ఇవే కారణాలు...
- పొగతాగే వారి సంఖ్య బాగా పెరిగినందునే పక్షవాతం కేసులు ఎక్కువవుతున్నాయి.
- ఆకు కూరలు, కూరగాయల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది. అదనంగా ఉప్పు వేసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి అనర్థాలకు గురవుతున్నారు.
- ఆల్కహాల్ కారణంగా నరాలు బలహీనంగా మారుతున్నాయి.
- నగరంలో ఎక్కువ మంది టెన్షన్ హెడేక్ (ఒత్తిడి కారణంగా తలనొప్పి) బాధితులుగా మారుతున్నారు. ఇది నరాల మీద ఒత్తిడి పెంచి పెరాలసిస్‌కు గురిచేస్తోంది.
- చాలామంది అనవసరంగా నెగిటివ్ థింకింగ్ వల్ల ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్, అల్జీమర్, పెరాలసిస్‌కు గురవుతున్నారు.
- గతంలో 50-55 ఏళ్ల వయసు దాటితే గానీ పెరాలిసిస్ వచ్చేది కాదు. నగరంలో పలు కారణాల వల్ల 40 ఏళ్లకే పెరాలిసిస్ బారిన పడుతున్నారు.
నివారణకు ఈ జాగ్రత్తలు కీలకం...
- తక్షణమే ఉప్పు తగ్గించాలి. ఉప్పు తగ్గిస్తే లో-బీపీ వస్తుందనేది అపోహ. రోజుకు ఐదు గ్రాములకు మించి వాడటం మంచిది కాదు.
- రోజూ కనీసం 45 నిమిషాలు, వారానికి 5 రోజులు తప్పనిసరిగా నడవాలి. సాధారణంగా మణికట్టు వద్ద పల్స్‌రేటు 60 ఉంటే, నడిచేటప్పుడు 140 ఉండాలి. నెమ్మదిగా నడవడం వల్ల ఫలితం ఉండదు.
- నడక బదులు సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడటం కూడా మంచిదే.
- రోజువారీ ఆహారంలో 30 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 30 శాతం పిండి పదార్థాలు (బియ్యం, గోధుమలు వంటివి), 20 శాతం ప్రొటీన్స్ (పప్పులు, పెరుగు, పాలు వంటివి) విధిగా ఉండాలి. మాంసాహారులు మటన్ తినడం తగ్గించి, చేపలు ఎక్కువగా తీసుకోవాలి.
- రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ మంచిదే. డార్క్ చాక్లెట్, ఆల్మండ్, వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం కూడా మంచిదే. వీటి వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
- రోజూ కొత్తగా ఆలోచించడం, కొత్త రూట్‌లో ప్రయాణిస్తే జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తుంది.
- రోగం వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకొనేకంటే, చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే జీవితకాలం పెంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రెజెంటేషన్: జి.రామచంద్రారెడ్డి
డాక్టర్స్ కాలమ్
-డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి,
న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్,
మెడిసిటీ హాస్పిటల్, సెక్రటేరియట్ రోడ్