నేడు వరల్డ్ స్ట్రోక్ డే
25 ఏళ్లు పైబడ్డ వారికీ రిస్క్
‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ ఈ ఏడాది నినాదం
చాలా మందిలో స్ట్రోక్ అంటే ఇప్పటికీ గుండెపోటు అనే అపోహ ఉంది. పరిభాషలో పలకాలంటే స్ట్రోక్ అంటే మెదడు పోటు. పూర్తిగా మెదడుకి సంబంధించిన అత్యయిక స్థితి. ఈ స్ట్రోక్ ప్రస్తుతం కలవరపెడుతోంది. స్ట్రోక్‌కి గురువుతున్న వారి సగటు వయసు నానాటికీ తక్కువవుతోంది. పదేళ్ల క్రితం కనీసం 40 ఏళ్లు సరాసరిగా ఉన్న బాధితుల వయసు.. ప్రస్తుతం 26కి చేరిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అవగతమవుతోంది.
కాకినాడ క్రైం: ప్రజల్లో ఈ విపత్తుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించి, స్ట్రోక్‌కు స్టాప్ చెప్పడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం.
స్ట్రోక్ అంటే..
స్ట్రోక్‌ను వాడుక భాషలో పక్షవాతం అంటారు. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులో రక్తనాళాలు పూడుకున్నా, పగిలినా, ధమనులు, సిరల్లో ఆటంకాలు ఏర్పడినా, మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. తద్వారా స్ట్రోక్ వస్తుంది. అప్పటివరకు చురుగ్గా ఉన్న మనిషి జీవచ్ఛవమవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవితమంతా నరకప్రాయమవుతుంది.
స్ట్రోక్ సంభవిస్తే..
మెదడుకు ప్రవహించే రక్తంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు పనితీరు క్షీణిస్తుంది. 80 శాతానికి పైగా స్ట్రోక్ బాధితుల్లో మూతి వంకర్లు పోవడం, నత్తి, కాళ్లు చేతులు చచ్చుబడటం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు శాశ్వతంగా కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 15 శాతం మందికి పైగా బాధితుల్లో మెదడులో నరాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ స్థితి మరణానికీ దారితీయవచ్చు.
లక్షణాలివీ..
మాటల్లో తడబాటు, అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు తిమ్మిర్లు, బలహీనంగా లేదా పట్టు వదిలేసినట్లు అనిపించడం. ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడి.. చూడడంలో సమస్య, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, అకారణంగా విపరీతమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణాలు.
రావడానికి కారణాలు
⇒ ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికం.
⇒ ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగం, రక్తపోటు, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలె్రస్టాల్ స్థాయి, ఊబకాయం, జన్యుపర నిర్మాణంతో పాటు, మానసిక సమస్యలు కూడా స్ట్రోక్‌కు కారణమవుతాయి.
గురి కాకూడదంటే..
స్ట్రోక్‌కి గురి కాకూడదంటే జీవన శైలిలో సానుకూల మార్పులను ఆహా్వనించాలి. సమయానుగుణంగా ఆహారం, నిద్ర అవసరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో మంచి మార్పుల వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, వ్యాయామం, నడక, ధ్యానం దోహదం చేస్తాయి.
ఫాస్ట్ ఫార్ములాతో సేఫ్
స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగి వయసు, హెల్త్ హిస్టరీకి అనుగుణంగానే స్ట్రోక్ నుంచి తేరుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. రక్తనాళాల్లో బలహీన ప్రాంతాన్ని అన్యూరిజం అంటారు. బయటికి ఉబికిన ఈ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడితే మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. ‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ అన్న నినాదాన్ని ఈ ఏడాది థీమ్‌గా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. స్ట్రోక్‌కు మించిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని, ముందుకు వెళ్లాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. డాక్టర్ ఆర్.గౌతమ్ ప్రవీణ్, న్యూరో ఫిజీషియన్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment