World Stroke Day
-
‘స్ట్రోక్’ను దెబ్బతీద్దాం
చాలా మందిలో స్ట్రోక్ అంటే ఇప్పటికీ గుండెపోటు అనే అపోహ ఉంది. పరిభాషలో పలకాలంటే స్ట్రోక్ అంటే మెదడు పోటు. పూర్తిగా మెదడుకి సంబంధించిన అత్యయిక స్థితి. ఈ స్ట్రోక్ ప్రస్తుతం కలవరపెడుతోంది. స్ట్రోక్‌కి గురువుతున్న వారి సగటు వయసు నానాటికీ తక్కువవుతోంది. పదేళ్ల క్రితం కనీసం 40 ఏళ్లు సరాసరిగా ఉన్న బాధితుల వయసు.. ప్రస్తుతం 26కి చేరిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అవగతమవుతోంది.కాకినాడ క్రైం: ప్రజల్లో ఈ విపత్తుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించి, స్ట్రోక్‌కు స్టాప్ చెప్పడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం. స్ట్రోక్ అంటే.. స్ట్రోక్‌ను వాడుక భాషలో పక్షవాతం అంటారు. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులో రక్తనాళాలు పూడుకున్నా, పగిలినా, ధమనులు, సిరల్లో ఆటంకాలు ఏర్పడినా, మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. తద్వారా స్ట్రోక్ వస్తుంది. అప్పటివరకు చురుగ్గా ఉన్న మనిషి జీవచ్ఛవమవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవితమంతా నరకప్రాయమవుతుంది. స్ట్రోక్ సంభవిస్తే.. మెదడుకు ప్రవహించే రక్తంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు పనితీరు క్షీణిస్తుంది. 80 శాతానికి పైగా స్ట్రోక్ బాధితుల్లో మూతి వంకర్లు పోవడం, నత్తి, కాళ్లు చేతులు చచ్చుబడటం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు శాశ్వతంగా కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 15 శాతం మందికి పైగా బాధితుల్లో మెదడులో నరాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ స్థితి మరణానికీ దారితీయవచ్చు. లక్షణాలివీ.. మాటల్లో తడబాటు, అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు తిమ్మిర్లు, బలహీనంగా లేదా పట్టు వదిలేసినట్లు అనిపించడం. ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడి.. చూడడంలో సమస్య, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, అకారణంగా విపరీతమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణాలు. రావడానికి కారణాలు ⇒ ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికం. ⇒ ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగం, రక్తపోటు, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలె్రస్టాల్ స్థాయి, ఊబకాయం, జన్యుపర నిర్మాణంతో పాటు, మానసిక సమస్యలు కూడా స్ట్రోక్‌కు కారణమవుతాయి. గురి కాకూడదంటే.. స్ట్రోక్‌కి గురి కాకూడదంటే జీవన శైలిలో సానుకూల మార్పులను ఆహా్వనించాలి. సమయానుగుణంగా ఆహారం, నిద్ర అవసరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో మంచి మార్పుల వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, వ్యాయామం, నడక, ధ్యానం దోహదం చేస్తాయి.ఫాస్ట్ ఫార్ములాతో సేఫ్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగి వయసు, హెల్త్ హిస్టరీకి అనుగుణంగానే స్ట్రోక్ నుంచి తేరుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. రక్తనాళాల్లో బలహీన ప్రాంతాన్ని అన్యూరిజం అంటారు. బయటికి ఉబికిన ఈ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడితే మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. ‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ అన్న నినాదాన్ని ఈ ఏడాది థీమ్‌గా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. స్ట్రోక్‌కు మించిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని, ముందుకు వెళ్లాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. డాక్టర్ ఆర్.గౌతమ్ ప్రవీణ్, న్యూరో ఫిజీషియన్, కాకినాడ -
వరల్డ్ స్ట్రోక్ డే 2022: ఈ రెండూ తెలిస్తే చాలు! గండం గడిచినట్టే!
ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. పక్షవాతానికి కారణాలు, నివారణపై అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును పాటిస్తారు. ఈ వ్యాధి తీవ్ర స్వభావాన్ని, మానవాళిపై చూస్తున్న ప్రభావాన్ని నొక్కి చెప్పడానికే ఈ డేని జరుపుతారు. అలాగే బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉండటం కూడా ఒక లక్క్ష్యం. అయితే ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ముందస్తుగా గుర్తించడం, సరైన సమయంలో అత్యవసర చికిత్స అందించడం అనే రెండు విషయాలు చాలా కీలకం. ప్రపంచ స్ట్రోక్ డే 2022: చరిత్ర 2006లో వార్షిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎస్వో), 2010లో స్ట్రోక్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2004లో అక్టోబర్ 29న డబ్ల్యుఎస్వో వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రపంచ స్ట్రోక్ డే 2022: థీమ్ స్ట్రోక్ సంకేతాలు, నాణ్యమైన చికిత్స సకాలంలో అందించేలా అవగాహన పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఇలాంటి డేలను జరుపుకునే క్రమంలో ప్రతీ ఏడాది ఒక థీమ్ ఉంటుంది. అలా వరల్డ్ స్ట్రోక్ డే 2022 కి గాను 'మినిట్స్ కెన్ సేవ్ లైఫ్స్.. సమయం చాలా విలువైనది అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తున్నారు. పక్షవాతం లేదా స్ట్రోక్ అంటే ఏంటి? మెదడుకు రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయినా స్ట్రోక్ వస్తుంది.ఈ సమయంలో మెదడు కణాలు కణజాలు దెబ్బతింటాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే మెదడు తీవ్రంగా దెబ్బ తినడం, లేదా ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ప్రధానంగా జన్యపరమైన మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. స్ట్రోక్ ప్రస్తుత మరణాలకు రెండవ అతిపెద్ద కారణం. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణం అయినప్పటికీ, దాదాపు అన్ని స్ట్రోక్‌లను ముందే గుర్తిస్తే నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. వీరిలో కొంతమందిలో తీవ్రమైన శారీరక వైకల్యం, కమ్యూనికేషన్ ఇబ్బందులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, 25 ఏళ్లు పైబడిన నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి 3 సెకన్లకు ఒకరు స్ట్రోక్‌తో బాధపడుతున్నారు, అంతేకాదు ఏడాదికి 12.2 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. 55 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో యువకులలో ఇది సర్వసాధారణంగా మారుతోంది. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైనఆహారం, కొన్ని మందులు ప్రభావంస్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి గోల్డెన్ అవర్ 60 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఆసుపత్రికి చేర్చితే బెటర్. అయితే పక్షవాతానికి సంబంధించి 4.5 గంటల పరిధిని‘‘ గోల్డెన్ అవర్”గా పిలుస్తారు. ఈ గోల్డెన్ అవర్‌లో క్లాట్-బస్టింగ్ డ్రగ్ tPA దీర్ఘకాల మెదడు దెబ్బతినకుండా నివారిస్తుంది. ప్రతి నిమిషం స్ట్రోక్‌కు గురైన వారికి చికిత్స చేయకపోతే; సగటు రోగి 1.9 మిలియన్ న్యూరాన్లు, 13.8 బిలియన్ సినాప్సెస్ ,ఏడు మిలియన్ల ఫైబర్లను కోల్పోతారు అని ప్రముఖ న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ లక్షణాలు: ఎవరైనా స్ట్రోక్‌తో బాధపడుతున్నారని ఎలా గుర్తించాలి ♦ తీవ్రమైన తలనొప్పి ♦ శరీరంలో ఒక వైపు తిమ్మిరి ముఖ్యంగా ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి ♦ మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో సమస్య ♦ దృష్టి కోల్పోవడం; కొన్నిసార్లు దృష్టి మసకగా అస్పష్టంగా మారిపోవడం ♦ వికారం ,వాంతులు ♦ అస్థిర నడక; సరిగ్గా నిలబడలేకపోవడం ♦ మైకం ఏమి చేయాలి ♦ రోగిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ముఖ్యంగా పక్షవాతానికి సరైన చికిత్స అందించే సామర్థ్యమున్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ♦ మొదటి కొన్ని గంటల్లో సీటీ స్కాన్, కొన్ని పరీక్షల ద్వారా సరైన రోగ నిర్ధారణ చాలా అవసరం. ♦ అత్యంత ఖచ్చితమైన చికిత్స ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ. రక్తం గడ్డకట్టడాన్ని నివారించేలా మెకానికల్ థ్రోంబెక్టమీ చేయాలి. 2015 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చిక్సితలో క్యాథ్ ల్యాబ్‌కి తీసుళ్లి, యాంజియో ద్వారా బ్లాక్ అయిన ధమనిని సరిచేస్తామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ♦ రోగి వయసు, తీవ్రతను బట్టి ఎలాంటి చికిత్స, లేదా ఆపరేషన్ చేయాలి అనేది వైద్యులు నిర్ధారిస్తారు. -
World Stroke Day: సమయం లేదు మిత్రమా!
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు రెండు పదుల వయస్సులోనే దాని బారిన పడుతున్నట్టు వైద్యులు చెపుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్‌కు గురై చికిత్సకోసం వస్తున్నారు. తొమ్మిదేళ్ల హెచ్ఐవీ బాధిత బాలుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. మధ్య వయస్సు వారు పక్షవాతం బారిన పడటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకే స్ట్రోక్‌కు గురైన తర్వాత ప్రతి నిమిషం విలువైనది అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవగాహన కలిగిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే... ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా వచ్చేదే బ్రెయిన్ స్ట్రోక్. రక్త ప్రసరణలో అవరోధం కలగడం, నరాలు చిట్లడం ప్రధాన కారణాలు. మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడటం వలన, మెదడలోని ఆ భాగం కణ మరణానికి దారి తీసి స్ట్రోక్‌కు గురవుతారు. పక్షవాతానికి కారణాలివే... ►యువత ఎక్కువుగా స్ట్రోక్‌కు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, ఆల్కహాల్‌గా వైద్యులు చెపుతున్నారు. ►జీవన విధానంలో మార్పులు, మధుమేహం , రక్తపోటు, కొలస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, ఒబెసిటీ వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ►మహిళల్లో కంటే పురుషులకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. ►ఈస్ట్రోజెన్ కలిగి ఉన్న హార్మోన్ థెరఫీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాల ఎక్కువ. ►గుండె జబ్బులు ఉన్న వారికి బ్రెయిన్‌స్ట్రోక్ రావచ్చు. ►అన్యూరిజం వంటి శరీర నిర్మాణ లోపాల(రక్తనాళాల గోడలు బలహీనమై ఉబ్బడం) వలన స్ట్రోక్ రావచ్చు. ►రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. ►పుట్టుకతోనే జన్యుపరమైన లోపాల కారణంగా రక్తం గడ్డకట్టే గుణం వున్న వారికి స్ట్రోక్ రావచ్చు. స్ట్రోక్‌లో రకాలు బ్రెయిన్‌స్ట్రోక్ ఇస్కిమిక్, హెమరైజ్డ్ అనే రెండు రకాలుగా వస్తుంది. ఇస్కీమిక్ ధమనిలో అడ్డంకుల కారణంగా స్ట్రోక్ వస్తుంది. మెదడు రక్తనాళం సన్నబడటం, అవరోధం ఏర్పడటం వలన వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మంది ఈ రకం స్ట్రోక్‌కు గురవుతుంటారు. ►కొందరిలో తాత్కాలిక ఇస్కీమిక్ ఎటాక్ ఉంటుంది. ఐదు నిమిషాల లోపు లక్షణాలు కనిపించి ఎలాంటి నష్టాన్ని కలిగించదు. హెమరైజ్డ్ స్ట్రోక్ రక్తనాళం లోపలి నుంచి లీకేజీ, ధమని చిట్లడం వలన ఈ రకం స్ట్రోక్ వస్తుంది. మెదడు రక్తస్రావం రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక పరిస్థితుల ఫలితంగా వస్తంది. స్ట్రోక్ లక్షణాలు ►మాట్లాడటం, మాట అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది ►ముఖం వేలాడి పోవడం ►చేతులు బలహీనత ►సమతుల్యత కోల్పోవడం ►తీవ్రమైన తలనొప్పి ►జ్ఞాపకశక్తి కోల్పోవడం ►దృష్టిలో ఇబ్బంది ►కళ్లు తిరగడం ఈ లక్షణాలు గుర్తించిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 24 గంటల తర్వాతే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో స్ట్రోక్‌కు గురైన 24 గంటలు దాటి కాలు,చేయి చచ్చుపడిన తర్వాతే వస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ కారణంగా యువత స్ట్రోక్‌కు గురవుతున్నారు. స్ట్రోక్ లక్షణాలు గుర్తించి నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే నష్టతీవ్రతను తగ్గించవచ్చు. ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సేవలు అందుబాటలో ఉన్నాయి. –డాక్టర్ డి.వి.మాధవికుమారి, న్యూరాలజిస్టు ప్రభుత్వాస్పత్రి అందుబాటలో ఆధునిక చికిత్సలు బ్రెయిన్ స్ట్రోక్ రకాన్ని బట్టి అత్యవసర చికిత్సలు చేస్తాం. తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురైన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ చేస్తాం. మెదడుకు రక్తప్రవాహాన్ని నిరోధించే గడ్డను విచ్ఛిన్నం చేయడానికి సిర ద్వారా ఔషధాన్ని ఇస్తాం. స్ట్రోక్‌కు గురైన ఐదు గంటల్లోపు ఈ థెరపీ చేయాలి. మరో విధానం మెకానికల్ థ్రాంబెక్టమీ, స్టెంట్ రిట్రీవర్ పరికరం ద్వారా మూసుకుపోయిన రక్తనాళాల్లో నుంచి క్లాట్స్‌ను మెదడు నుంచి తొలగించడం. హెమరైజ్డ్ స్ట్రోక్‌కు గురైన వారిలో రక్తస్రావం వలన మెదడు దెబ్బతినడం తగ్గించడం, రక్తపోటు ఉంటే కంట్రోల్చేస్తాం. – డాక్టర్ డి.అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
ఆఫీస్‌లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి
ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సంగీతంతో సాంత్వన సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. పజిల్ గేమ్స్ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. ఇష్టమైన వారితో గడపండి కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్ గేమ్స్ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది. చదవండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ -
World Stroke Day 2021: ఆ.. 60 నిమిషాలు విలువైనవి
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిని తొలి గంట సమయంలోపు ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాపాయం తప్పినట్లే. కనీసం నాలుగున్నర గంటల్లోపు వస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు మూడు పదుల వయసు వారిలోనూ కనిపిస్తోంది. పోస్ట్ కోవిడ్ రోగులు ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో అవగాహన కలిగించనున్నారు. శుక్రవారం ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. విజయవాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేన్నాడు. అతను కోవిడ్ నుంచి కోలుకున్న ఇరవై రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వెంటనే అతనికి రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్ ఇవ్వడంతో స్ట్రోక్ ముప్పు నుంచి బయట పడ్డాడు. కోవిడ్ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఓ 25 ఏళ్ల యువకుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఆ ఫంగస్ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడటంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. వీళ్లిద్దరే కాదు ఈ ఏడాది ఎంతో మంది పోస్టు కోవిడ్ రోగులు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. చదవండి: (Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..) స్ట్రోక్ లక్షణాలు ఇవీ.. మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, నియంత్రణ తప్పడం, మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోలేక పోవడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఒకటి రెండుగా కనిపించడం, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 80 శాతం మందికి క్లాట్స్ కారణం సాధారణంగా మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తంలో గడ్డ (క్లాట్)లు కట్టే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండె సంబంధిత వ్యాధులు వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టు కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులు కూడా స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటమే, మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్‌కు గురయ్యే వారు సకాలంలో ఆస్పత్రికి చేరితే మంచి ఫలితం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా స్ట్రోక్ ద్వారా వచ్చే వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంది. ప్రతి నిమిషమూ విలువైనదే.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషమూ విలువైనదే. స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడ వచ్చు. 80 శాతం మందికి రక్తనాళాల్లో గడ్డలు కారణంగా బ్రెయిన్‌స్ట్రోక్ వస్తుంది. అలాంటి వారికి థ్రోంబలైసిస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రక్తనాళాల్లో గడ్డలు కరిగించి, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – డాక్టర్ డి.వి.మాధవీకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వాస్పత్రి, విజయవాడ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగాయి పోస్టు కోవిడ్ రోగులు కొందరు లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నారు. కోవిడ్ వైరస్ కారణంగా రక్తనాళాలు దెబ్బతిని, వాటిలో గడ్డలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురవుతున్న వారిని చూస్తున్నాం. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారికి మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి వారు మధుమేహం, రక్తపోటు, కోలస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ డి.అనీల్‌కుమార్, న్యూరాలజిస్ట్