World Stroke Day: సమయం లేదు మిత్రమా! | World Stroke Day: Warning signs of stroke everyone should know | Sakshi
Sakshi News home page

World Stroke Day: సమయం లేదు మిత్రమా!

Published Sat, Oct 29 2022 10:23 AM | Last Updated on Sat, Oct 29 2022 11:15 AM

World Stroke Day: Warning signs of stroke everyone should know - Sakshi

సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు రెండు పదుల వయస్సులోనే దాని బారిన పడుతున్నట్టు వైద్యులు చెపుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల  20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్‌కు గురై చికిత్సకోసం వస్తున్నారు. తొమ్మిదేళ్ల హెచ్‌ఐవీ బాధిత బాలుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. మధ్య వయస్సు వారు పక్షవాతం బారిన పడటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకే స్ట్రోక్‌కు గురైన తర్వాత ప్రతి నిమిషం విలువైనది అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా అవగాహన కలిగిస్తున్నారు.  

బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే... 
ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా వచ్చేదే బ్రెయిన్‌ స్ట్రోక్‌. రక్త ప్రసరణలో అవరోధం కలగడం, నరాలు చిట్లడం ప్రధాన కారణాలు. మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడటం వలన, మెదడలోని ఆ భాగం కణ మరణానికి దారి తీసి స్ట్రోక్‌కు గురవుతారు.  

పక్షవాతానికి కారణాలివే... 
►యువత ఎక్కువుగా స్ట్రోక్‌కు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, ఆల్కహాల్‌గా వైద్యులు చెపుతున్నారు. 
►జీవన విధానంలో మార్పులు, మధుమేహం , రక్తపోటు, కొలస్ట్రాల్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండటం, ఒబెసిటీ వారిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 
►మహిళల్లో కంటే పురుషులకు స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువ. 
►ఈస్ట్రోజెన్‌ కలిగి ఉన్న హార్మోన్‌ థెరఫీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశాల ఎక్కువ. 
►గుండె జబ్బులు ఉన్న వారికి బ్రెయిన్‌స్ట్రోక్‌ రావచ్చు.  
►అన్యూరిజం వంటి శరీర నిర్మాణ లోపాల(రక్తనాళాల గోడలు బలహీనమై ఉబ్బడం) వలన స్ట్రోక్‌ రావచ్చు.  
►రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన వారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువ.  
►పుట్టుకతోనే జన్యుపరమైన లోపాల కారణంగా రక్తం గడ్డకట్టే గుణం వున్న వారికి స్ట్రోక్‌ రావచ్చు.  

స్ట్రోక్‌లో రకాలు 
బ్రెయిన్‌స్ట్రోక్‌  ఇస్కిమిక్, హెమరైజ్డ్‌ అనే రెండు రకాలుగా వస్తుంది.  

ఇస్కీమిక్‌ 
ధమనిలో అడ్డంకుల కారణంగా స్ట్రోక్‌ వస్తుంది. మెదడు రక్తనాళం సన్నబడటం, అవరోధం ఏర్పడటం వలన వస్తుంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మంది ఈ రకం స్ట్రోక్‌కు గురవుతుంటారు.  
►కొందరిలో తాత్కాలిక ఇస్కీమిక్‌ ఎటాక్‌ ఉంటుంది. ఐదు నిమిషాల లోపు  లక్షణాలు కనిపించి ఎలాంటి నష్టాన్ని కలిగించదు.  

హెమరైజ్డ్‌ స్ట్రోక్‌ 
రక్తనాళం లోపలి నుంచి లీకేజీ, ధమని చిట్లడం వలన ఈ రకం  స్ట్రోక్‌ వస్తుంది. మెదడు రక్తస్రావం రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక పరిస్థితుల ఫలితంగా వస్తంది.  

స్ట్రోక్‌ లక్షణాలు 
►మాట్లాడటం, మాట అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది 
►ముఖం వేలాడి పోవడం 
►చేతులు బలహీనత 
►సమతుల్యత కోల్పోవడం 
►తీవ్రమైన తలనొప్పి 
►జ్ఞాపకశక్తి కోల్పోవడం 
►దృష్టిలో ఇబ్బంది 
►కళ్లు తిరగడం  
ఈ లక్షణాలు గుర్తించిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 

24 గంటల తర్వాతే వస్తున్నారు 
ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో స్ట్రోక్‌కు గురైన 24 గంటలు దాటి కాలు,చేయి చచ్చుపడిన తర్వాతే వస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్‌ కారణంగా యువత స్ట్రోక్‌కు గురవుతున్నారు. స్ట్రోక్‌ లక్షణాలు గుర్తించి నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే  నష్టతీవ్రతను తగ్గించవచ్చు. ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సేవలు అందుబాటలో ఉన్నాయి.  
–డాక్టర్‌ డి.వి.మాధవికుమారి, న్యూరాలజిస్టు ప్రభుత్వాస్పత్రి  

అందుబాటలో ఆధునిక చికిత్సలు 
బ్రెయిన్‌ స్ట్రోక్‌ రకాన్ని బట్టి అత్యవసర చికిత్సలు చేస్తాం. తీవ్రమైన ఇస్కీమిక్‌ స్ట్రోక్‌కు గురైన వారికి థ్రాంబోలైటిక్‌ థెరపీ చేస్తాం. మెదడుకు రక్తప్రవాహాన్ని నిరోధించే గడ్డను విచ్ఛిన్నం చేయడానికి సిర ద్వారా ఔషధాన్ని ఇస్తాం. స్ట్రోక్‌కు గురైన ఐదు గంటల్లోపు ఈ థెరపీ చేయాలి. మరో విధానం మెకానికల్‌ థ్రాంబెక్టమీ, స్టెంట్‌ రిట్రీవర్‌ పరికరం ద్వారా మూసుకుపోయిన రక్తనాళాల్లో నుంచి క్లాట్స్‌ను మెదడు నుంచి తొలగించడం. హెమరైజ్డ్‌ స్ట్రోక్‌కు గురైన వారిలో రక్తస్రావం వలన మెదడు దెబ్బతినడం తగ్గించడం,  రక్తపోటు ఉంటే కంట్రోల్‌చేస్తాం. 
– డాక్టర్‌ డి.అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement