ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా.. | Illness to Indians because of no Proteins in food says Eat Lancet Report | Sakshi
Sakshi News home page

ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా..

Published Sat, Jan 19 2019 1:38 AM | Last Updated on Sat, Jan 19 2019 10:31 AM

Illness to Indians because of no Proteins in food says Eat Lancet Report - Sakshi

పప్పన్నం తినమంటే ముఖం అదోలా పెడతాం. అదే బంగాళ దుంపల వేపుడు అయితే ఇష్టంగా లాగించేస్తాం. వేపుళ్లు, అందులోనూ బంగాళాదుంప వినియోగం భారత్‌లో ఎక్కువగా ఉంటోందని ‘ఈట్‌–లాన్సెట్‌ కమిషన్‌’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం దీర్ఘకాల ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా భారత ప్రజలు ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి  ఉన్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. తరచుగా భారతీయులు అనారోగ్యం పాలవడానికి కారణం శరీరానికి అవసరమైన స్థాయిలో ప్రొటీన్లు తీసుకోకపోవడమే కారణమని నివేదికలో పేర్కొంది. భారత్‌ సహా ప్రపంచదేశాలన్నీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఏటా 1.1కోట్ల ముందస్తు మరణాలను అరికట్టవచ్చని లాన్సెట్‌ మెడికల్‌ మ్యాగజైన్‌లో పేర్కొంది.

చేపలు, మాంసం తగ్గిస్తేనే! 
మాంసాహారం, షుగర్‌ వినియోగాన్ని సగానికి సగం తగ్గించాల్సిందేనని నివేదిక పేర్కొంది. పళ్లు, గింజలు, కూరగాయలు తినడాన్ని రెట్టింపు చేయాలని చెబుతోంది. భారతీయులు బంగాళ దుంపలను ఎక్కువగా తింటున్నారని.. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలని సూచించింది. ‘భారత్‌లో అవసరానికంటే 1.5 రెట్లు ఎక్కువగా బంగాళ దుంపలు తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వీటి బదులుగా ప్రొటీన్లను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. పప్పులు, గింజలు, పళ్లు మొదలైన శాకాహార ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, మాంసం వంటివి ఎంత మితంగా తింటే అంత మంచిది’ అని లాన్సెట్‌ కమిషన్‌ సభ్యుడు, న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. భారత్‌లో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగు, వినియోగం విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర వినియోగాన్ని అరికట్టడంపై ప్రపంచదేశాలన్నీ ఏకమై ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

భూమండలమూ సురక్షితం
ఈట్‌–లాన్సెట్‌ కమిషన్‌ పరిశోధనలో భాగంగా.. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కలిసి మూడేళ్ల పాటు ప్రపంచ ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. మొత్తంమీద మాంసాహారం వినియోగాన్ని తగ్గించి శాకాహారాన్ని తినడం వల్ల ఈ భూగోళాన్ని కాపాడుకోగలమని కమిషన్‌కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ జాన్‌ రాక్‌స్టామ్‌ అన్నారు. అదనపు భూమిని వినియోగించుకోకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వాడకాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేవిధంగా ప్రపంచ జనాభా ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సమతుల ఆహారం తీసుకుంటేనే పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిశోధనల
ఆధారంగా వీరు రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 

- మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం అనేదే కాదు, అదెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముఖ్యమే.  
మాంసం, పాల ఉత్పుత్తుల వాడకాన్ని తగ్గించి, శాకాహారాన్ని అధికంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. భూగోళం కూడా పచ్చగా ఉంటుంది. 
మొక్కల నుంచి వచ్చే గింజలు, కూరగాయలు, పండ్ల వినియోగం 100% పెంచాలి. మాంసం, షుగర్‌ వాడకాన్ని 50%తగ్గించాలి. 
మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు పెరుగుతాయి. 
మాంసాహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. 
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే.. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు 200 కోట్ల వరకు ఉన్నారు. 
కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా చనిపోతున్నారు. 
గత ఏభై ఏళ్లుగా ఆహార అలవాట్లలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి.  
కేలరీలు ఎక్కువగా ఉన్న తిండి తింటున్నాం. ప్రతీ రోజూ సగటున 2,500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాలు ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నాయి. 
ఉత్తర అమెరికా వంటి దేశ్లాలో మాంసాన్ని అవసరమైన దాని కంటే 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే దక్షిణాసియా దేశాల్లో తినాల్సిన దానికంటే 50% తక్కువగా మాంసం తింటున్నారు. 
2050కి జనాభా 1000 కోట్లకు చేరుకోవచ్చు నని అంచనా, వారందరి కడుపు నిండాలంటే  ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లను అందరూ తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. 
ఆహారపు అలవాట్లు మారేలా ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాపదార్థాలపై కొత్త పన్నులు విధించాలి. వాటి అమ్మకంలో పరిమితులు విధించాలి. ఇంకా అవసరమైతే వాటిని నిషేధించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement