Butchers
-
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్ ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. #BJP MP and former minister #MenakaGandhi telling what #ISKCON is doing at #Gaushalas #Bhakts and @IskconInc should react on this.. pic.twitter.com/RdpLMBsZP1 — manishbpl (@manishbpl1) September 26, 2023 అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా అనే సంగతి తెలిసిందే. Response to the unsubstantiated and false statements of Smt Maneka Gandhi. ISKCON has been at the forefront of cow and bull protection and care not just in India but globally. The cows and bulls are served for their life not sold to butchers as alleged. pic.twitter.com/GRLAe5B2n6 — Yudhistir Govinda Das (@yudhistirGD) September 26, 2023 -
ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా..
పప్పన్నం తినమంటే ముఖం అదోలా పెడతాం. అదే బంగాళ దుంపల వేపుడు అయితే ఇష్టంగా లాగించేస్తాం. వేపుళ్లు, అందులోనూ బంగాళాదుంప వినియోగం భారత్‌లో ఎక్కువగా ఉంటోందని ‘ఈట్–లాన్సెట్ కమిషన్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం దీర్ఘకాల ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా భారత ప్రజలు ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. తరచుగా భారతీయులు అనారోగ్యం పాలవడానికి కారణం శరీరానికి అవసరమైన స్థాయిలో ప్రొటీన్లు తీసుకోకపోవడమే కారణమని నివేదికలో పేర్కొంది. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఏటా 1.1కోట్ల ముందస్తు మరణాలను అరికట్టవచ్చని లాన్సెట్ మెడికల్ మ్యాగజైన్లో పేర్కొంది. చేపలు, మాంసం తగ్గిస్తేనే! మాంసాహారం, షుగర్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించాల్సిందేనని నివేదిక పేర్కొంది. పళ్లు, గింజలు, కూరగాయలు తినడాన్ని రెట్టింపు చేయాలని చెబుతోంది. భారతీయులు బంగాళ దుంపలను ఎక్కువగా తింటున్నారని.. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలని సూచించింది. ‘భారత్‌లో అవసరానికంటే 1.5 రెట్లు ఎక్కువగా బంగాళ దుంపలు తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వీటి బదులుగా ప్రొటీన్లను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. పప్పులు, గింజలు, పళ్లు మొదలైన శాకాహార ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, మాంసం వంటివి ఎంత మితంగా తింటే అంత మంచిది’ అని లాన్సెట్ కమిషన్ సభ్యుడు, న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. భారత్‌లో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగు, వినియోగం విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర వినియోగాన్ని అరికట్టడంపై ప్రపంచదేశాలన్నీ ఏకమై ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూమండలమూ సురక్షితం ఈట్–లాన్సెట్ కమిషన్ పరిశోధనలో భాగంగా.. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కలిసి మూడేళ్ల పాటు ప్రపంచ ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. మొత్తంమీద మాంసాహారం వినియోగాన్ని తగ్గించి శాకాహారాన్ని తినడం వల్ల ఈ భూగోళాన్ని కాపాడుకోగలమని కమిషన్‌కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ రాక్స్టామ్ అన్నారు. అదనపు భూమిని వినియోగించుకోకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వాడకాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేవిధంగా ప్రపంచ జనాభా ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సమతుల ఆహారం తీసుకుంటేనే పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా వీరు రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. - మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం అనేదే కాదు, అదెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముఖ్యమే. - మాంసం, పాల ఉత్పుత్తుల వాడకాన్ని తగ్గించి, శాకాహారాన్ని అధికంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. భూగోళం కూడా పచ్చగా ఉంటుంది. - మొక్కల నుంచి వచ్చే గింజలు, కూరగాయలు, పండ్ల వినియోగం 100% పెంచాలి. మాంసం, షుగర్ వాడకాన్ని 50%తగ్గించాలి. - మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతాయి. - మాంసాహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. - ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే.. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు 200 కోట్ల వరకు ఉన్నారు. - కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా చనిపోతున్నారు. - గత ఏభై ఏళ్లుగా ఆహార అలవాట్లలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. - కేలరీలు ఎక్కువగా ఉన్న తిండి తింటున్నాం. ప్రతీ రోజూ సగటున 2,500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాలు ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నాయి. - ఉత్తర అమెరికా వంటి దేశ్లాలో మాంసాన్ని అవసరమైన దాని కంటే 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే దక్షిణాసియా దేశాల్లో తినాల్సిన దానికంటే 50% తక్కువగా మాంసం తింటున్నారు. - 2050కి జనాభా 1000 కోట్లకు చేరుకోవచ్చు నని అంచనా, వారందరి కడుపు నిండాలంటే ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లను అందరూ తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. - ఆహారపు అలవాట్లు మారేలా ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాపదార్థాలపై కొత్త పన్నులు విధించాలి. వాటి అమ్మకంలో పరిమితులు విధించాలి. ఇంకా అవసరమైతే వాటిని నిషేధించాలి. -
క్యాన్సర్ ని వండకండి
ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే గ్యాస్ స్టౌ మీదున్న బాండీలో క్యాన్సర్ డీప్ ఫ్రై అవుతోందంటే ఎవరైనా దాన్నలాగే వండుకుంటారా? రుచిగా ఉందని చెప్పి వేడి వేడిగా దాన్ని ప్లేట్లోకి ఒంచుకుంటారా? నోరూరుతోందంటూ లొట్టలేసుకుంటూ మరోమారు మారు వడ్డించుకోగలరా? మీకు తెలిసో తెలియకో కొన్ని సార్లు క్యాన్సర్ మీ స్టౌ మీద ఉడుకుతుంటుంది. కొన్నిసార్లు మీకు తెలియక మీ ఫ్రిజ్‌లోనూ నక్కి ఉంటుంది. అప్పుడప్పుడూ మీరు బయట తినే పదార్థాల్లో దాగి ఉంటుంది. పంటికింది రాయిలాగో... కూరలోని నిమ్మగింజలాగో తెలియక వచ్చినప్పుడు ముద్దను ఊసేసినట్లుగానే దాన్ని ఊసేయండి. తెలిసి తీసుకునే పదార్థాల్లో దాని ఊసే లేకుండా చేసుకోండి. అదెలాగో తెలుసుకోండి. తెలుసుకొని జాగ్రత్త పడండి. క్యాన్సర్ నిర్దిష్టంగా ఫలానా కారణంగానే వస్తుందని తెలియకపోయినా కొన్నిసార్లు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల ద్వారా వస్తుందని కచ్చితంగా తెలుసు. అదెలాగంటారా? ఒకసారి వాడిన నూనెను మళ్లీ మరోసారి వేడి చేయడం అంటే... పొయ్యి మీద ‘క్యాన్సర్ వేపుడు’ను వేడివేడిగా వండుతున్నట్టే! ప్రాసెస్ చేసే వంటకాలు... అందునా రెడ్‌మీట్ (వేటమాంసం)తో వండేవి తయారు చేస్తున్నారంటే మీరు కూర తాలింపు గాక క్యాన్సర్ కోసం తిరగమోత పెడుతున్నట్టే. కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని వండుతుంటే... ఉప్పు, కారం, మసాలాలు కలిపినట్టుగానే... ఆ కూరను క్యాన్సర్పొడులతో గార్నిష్ చేస్తున్నట్టే. తెలిసో, తెలియకో మీరు క్యాన్సర్‌ను వండకండి... వడ్డించకండి... తినకండి. ఈ మూడు చేయకూడదనుకుంటే కొన్ని ఆహారాల విషయంలో అవగాహన పెంచుకోండి. బాగా ప్రాసెస్ చేసిన రెడ్మీట్ను మితిమీరి తింటున్నారంటే కోరి కోరి పెద్ద పేగుకు క్యాన్సర్‌ను అంటించుకుంటున్నారన్నమాట. ముడిసరుకును ఎంతగా ప్రాసెస్ చేస్తుంటే ఆ ఆహారానికి క్యాన్సర్‌ను అంతగా పట్టేలా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారి కంటే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం 17% చొప్పున పెరుగుతుంటుంది. అలా తినడం ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పొట్ట క్యాన్సర్లను పెంచవచ్చు. మీకు మాంసమే తినాలని ఉందా...? మాంసాహారం మీద జిహ్వను చంపుకోలేకపోతున్నారా? అయితే చికెన్ లేదా చేపలు తినండి. వాటితో క్యాన్సర్ వచ్చిన దాఖలాలున్నట్లు పరిశోధనల్లో పెద్దగా తేలలేదు. కాబట్టి మీ జిహ్వచాపల్యాన్ని కాస్తంత ఆరోగ్యకరమైన పక్కదారి పట్టించండి. అదే రుచి దారిలో మీ ప్రయాణం సాగుతుంది. కాకపోతే కాస్తంత మరో సమాంతర మార్గంలో. మాంసాహారం తినాలనే కోరికా తీరుతుంది. ఆ మార్గంలో పొంచిఉన్న క్యాన్సర్ యాక్సిడెంట్ ప్రమాదమూ తప్పుతుంది. నో.... నో... బతికి ఉన్నన్నాళ్లూ ఇష్టమైన మాంసాహారం తిందాం. ఎప్పుడో చచ్చిపోతామనే భయంతో ఇప్పుడు మాంసాహారం తినకపోవడం మహాపాపం కదా... అని గునుస్తూ ఉండే ఆహారప్రియులైన ఎపిక్యూరియన్లకు మరో షార్ట్‌కట్ దారి కూడా ఉంది. రెడ్‌మీట్ వంటకాలను ఎంత తక్కువ వీలయితే అంత తక్కువకు పరిమితం చేసుకోండి. పూర్తిగా కాకపోయినా... గుడ్డిలో మెల్ల అన్నట్లుగా... కొంతలో కొంత నయం. ఏం వండామన్నది కాదు... ఎలా వండామన్నదీ ముఖ్యం... ఏదైనా పదార్థాన్ని వండుతున్నామంటే దాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికేలా చేస్తున్నామన్నదీ క్యాన్సర్ నివారణలో ఒక కీలకమైన అంశం. మీరు ఒక వంటకాన్ని (రెసిపీని) మరింత ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుతున్నారంటే... అందులోంచి క్యాన్సర్ కారకమైన రసాయనాలు వెలువడేలా చేస్తున్నారేమో అన్నది గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. మనం మాంసాన్ని మితిమీరిన ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నామంటే... అనగా గ్రిల్డ్ పదార్థంగానూ వేపుడుగానూ చేస్తున్నామంటే, ఆ మాంసాహారంలోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ (హెచ్ఏఏ) అనే రసాయన రూపాలుగా మారుతున్నాయని అర్థం. అవి క్యాన్సర్ కారకాలు. ఇక ఆ ఆహార పదార్థాలను స్మోకింగ్ అనే వంటప్రక్రియకు గురిచేయడం గానీ, నేరుగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న మంట తగిలేలా చేశారనుకోండి... అప్పుడా తీరు వంట వల్ల పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ అనే (పీఏహెచ్‌స్) రసాయనాలు ఏర్పడతాయి. అవి కూడా ప్రమాదకారకాలే. క్యాన్సర్‌ను ఎందుకు నిల్వ పెట్టుకోవడం? తినే పదార్థాలు పాడైపోతే మనసు ఉసూరుమంటుంది. ఉసూరంటుంది కదా అని ఉసురుతీసుకుంటామా? అందుకే ఆహార పదార్థాలను నిల్వ పెట్టుకోవడం అంటే క్యాన్సర్‌ను నిల్వ పెట్టుకోకుండా ఆ పని చేయాలన్నమాట. అది సరైన నిల్వ... సబబైన నిల్వ. చాలామంది ఆహారపదార్థాలను పాడైపోకుండా ఉంచడానికి ‘ఉప్పు’లో చాలాకాలం ఊరబెడుతుంటారు. ఇలా చాలా కాలం ఉప్పులో ఊరిన పదార్థాల వల్ల పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దెబ్బతిని అది ఇన్ఫ్లమేషన్కు (వాపు, నొప్పి, ఎర్రబారడం) గురయ్యే అవకాశం ఉంది. అలా పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోతూనే ఉండటం జరుగుతుంటే అక్కడ అలా ఒరుసుకుపోయిన లైనింగ్‌లలో నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల పాలబడటానికి అవకాశం ఎక్కువ. ఇక అలాంటి చోట్ల హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి గనక నివసిస్తూ ఉంటే... మనం తినే ఉప్పు దాంతో కయ్యం పెట్టుకొని అక్కడ పుండ్లు పడేలా చేస్తుంది. వీటినే స్టమక్ అల్సర్స్ అంటారు. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే క్యాన్సర్ ముప్పునకు ఉప్పు కూడా ఓ పర్యాయపదం అని అర్థం చేసుకుని దానికి దూరంగా ఉండటం మంచిది. క్యాన్సర్ మాట అటుంచినా... పైగా ఉప్పు పరిమాణం పెరుగుతున్న కొద్దీ హైబీపీ కొలత కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ 6 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదు. పండు... క్యాన్సర్ పాలిట మందుగుండు తాజాపండ్లు క్యాన్సర్‌కు నేరుగా గురిపెట్టిన మందుగుండు అని గుర్తించండి. కొన్ని పండ్లకు పైన ఉండే తొక్క క్యాన్సర్‌ను తొక్కిపెడుతుంది. పెకిలించివేస్తుంది. తొక్కతో తినగలిగే పండ్లను కాస్త కడిగి తొక్కతోనే తినడం మేలనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఒక ఆపిల్‌ను తొక్కతో తింటే... అందులో మొత్తం పండులో లభ్యమయ్యే దానికంటే... కేవలం ఆ తొక్కలోనే 75% క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడే ఒక జీవరసాయనం. జీవామృతరసాయనం. అంటే... మొత్తం పండుకంటే కేవలం పొరలా ఉండే తొక్కలో 75 శాతం ఎక్కువ సారం, విషాన్ని హరించే విషయం ఉందన్నమాట. విటమిన్–సి, ఫోలేట్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్లలో కరుగుతాయి. అలా విటమిన్లు ఊరిన నీటితో వంట చేస్తున్నప్పుడు... ఆ నీటిని చాలాసేపు వేడిచేస్తుంటే... విటమిన్లు ఇగిరిపోతాయి. మనం ఆకుకూరలతో వంట చేసే సమయంలో ఎక్కువ సేపు వండుతూ ఉంటే మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, ఫైటోకెమికల్స్ తరిగిపోతాయి. (మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, జీవరసాయనాలను ఫైటోకెమికల్స్ అంటారు). ఇవి క్యాన్సర్లతో ఫైట్ చేస్తాయి. అందుకే వంట కార్యక్రమం అన్నది అవి ఆవిరయ్యేలా ఉండకూడదు. అలాగే నీళ్లలో కరిగిఉండే వీటిని వార్చి పారబోయడం అంత మంచిది కాదు. కాబట్టి పోషకాలు కోల్పోకుండా... తగుమోతాదులో కూరలను ఉడికించాలి. ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలను ఆలివ్ నూనెలో వండటం మేలు. దీనివల్ల నూనెలో కరిగే విటమిన్లు ఒంటికి సమర్థంగా అందుతాయి. క్యాన్సర్ల పాలిటా ఘాటైనవి అవి... ఉల్లి, వెల్లుల్లి ఘాటుగా ఉంటాయి. అవి మనకు మాత్రమే కాదు... క్యాన్సర్ల పాలిటా ఘాటుగా వ్యవహరిస్తాయి. వెల్లుల్లిని అలా నిండుగా వంటల్లో వేసేయడం కంటే కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా కొద్దిగా నలగ్గొట్టి వేస్తే... రుచికి రుచీ పెరుగుతుంది. క్యాన్సర్‌తో ఫైట్ చేసే పోషకం అయిన అలిసిన్ తయారయ్యేందుకు దోహదపడుతుంది. ఎర్రగా ఉండే టొమాటోలలో, ఎర్రటి రంగులో ఉండే ద్రాక్షల్లో... ఇలా ఎరుపు రంగులో ఉండే అనేక పండ్లలో లైకోపిన్ అనే క్యాన్సర్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. నేరుగా టొమాటోను తినడం కంటే కాస్తంత ఉడికించాక దాన్ని తింటే... అలా ఉడికించడం ద్వారా వెలువడ్డ లైకోపిన్‌ను మన జీర్ణకణాలు చాలా తేలిగ్గా స్వీకరిస్తాయి. ఆరోగ్యకరంగా వండటానికీ, వడ్డించడానికి ఇది ఒక అద్భుత ఉదాహరణ. ఇలాంటి అనేక దృష్టాంతాలను గుర్తుంచుకొని క్యాన్సర్‌ను ఎలా వండుకోకూడదో తెలుసుకోవచ్చు. ఎలా వండితే క్యాన్సర్‌ను వడ్డించడం సాధ్యం కాదో కూడా గ్రహించవచ్చు. ఈ తెలుసుకోవడమూ, గ్రహింపూ ఎంత ఎక్కువగా ఉంటే... క్యాన్సర్‌ను కాల్చి బూడిద చేయడం అంత తేలిక! ఆహారంలోని పీచుతో క్యాన్సర్‌ను కడిగేయవచ్చు... పీచుతో గిన్నెల్లో మురికిని శుభ్రం చేయడమన్నది మన దేశవాసులకు తెలియని విద్య కాదు. ఎవరో వచ్చి దాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. ఆహారంలో పీచు ఉంటే అది పేగులలోపలి భాగాన్ని శుభ్రంగా చేసేస్తుంది. క్యాన్సర్‌ను అక్కడ కుదురుకోనివ్వకుండా చూస్తుంది. అయితే ఇటీవల మనం పీచు లేని పదార్థాలను ఎక్కువ తింటున్నాం. గతంలో అది పాశ్చాత్యుల అలవాటు. ఇప్పుడు మనం దాన్ని అలవాటు చేసుకున్నాం. అంటే... మనదైన పీచుతో శుభ్రం చేసే పేటెంటును మనం దూరం చేసుకొని క్యాన్సర్‌కు టెంటు వేస్తున్నామా అని ఆలోచించాలి. అందుకే క్యాన్సర్ పేగుల్లో నిలువ ఠికానా లేకుండా చేయాలంటే పీచు పుష్కలంగా ఉండేలా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే ముడిధాన్యాలు (హోల్ గ్రెయిన్స్) వాడాలి. దాంతో పెద్దపేగు క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని పరిశోధనలు నమ్మకంగా చెబుతున్న మాట. ఒక్క పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక... అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం. ఈ పీచు పదార్థాలను తక్కువగా తినడంవల్లే అమెరికా, యూరప్ దేశాలను పెద్దపేగు క్యాన్సన్ పీల్చిపిప్పి చేస్తోంది. అందుకే పీచు క్యాన్సర్ పీచమణుచుతుందని గుర్తుంచుకోవడం శుభప్రదం. డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డి, డైరెక్టర్, అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
స్థూలకాయులకు మాంసాహారం ముప్పే!
పరిపరి శోధన మధుమేహవ్యాధిగ్రస్థులు స్వీట్సు తినడం వల్ల ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుందో, స్థూలకాయులు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అదేవిధమైన హాని కలుగుతుందట. మాంసాహారం లేనిదే ముద్ద గొంతు దిగని వారికి ఈ విషయం మింగుడు పడదేమో మరి! ఎందుకంటే స్థూలకాయం ఉన్నవారికి మాంసాహారం తినడం వల్ల ముప్పు తప్పదంటున్నాయి కొత్త పరిశోధనలు. మన శరీరానికి కొవ్వులు, ప్రొటీన్లు అవసరమే. అయితే అవసరమైనదానికన్నా ఎక్కువ తీసుకుంటేనే చిక్కొచ్చిపడుతుంది. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఫరవాలేదు కానీ, తరచు మాంసాహారం తీసుకోవడం వల్ల ముప్పే. ముఖ్యంగా స్థూలకాయులకైతే మరింత ఇబ్బంది తప్పదని అంటున్నారు అడిలైడ్స్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ శాఖ పరిశోధకులు. -
మాంసాహారం తింటే గుండెజబ్బు..?
ఆయుర్వేద కౌన్సెలింగ్ వేరికోజ్ వీన్స్‌కు సర్వాంగధార చికిత్స నా వయసు 38. నాకు కొన్నేళ్లుగా కాళ్లనొప్పులున్నాయి. అప్పుడప్పుడు మోకాళ్ల నొప్పి, పాదాల వాపు వస్తోంది. మోకాలు కిందిభాగం నుండి చర్మం నల్లగా మారి, దురద వస్తోంది. గోకితే పుండు పడుతోంది. డాక్టర్ వెరికోజ్ వీన్స్ అని చెప్పారు. వెరికోజ్ అల్సర్స్ కూడా వచ్చిందన్నారు. మందులు వాడుతున్నాను కానీ ఫలితం కనిపించడం లేదు. ఆయుర్వేద వైద్యంలో దీనికి చికిత్స ఉందా? - డి.ఆర్.వి; భీమవరం వెరికోజ్ వీన్స్ అనేది చెడురక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. వెరికోజ్ అనే రక్తనాళం పైకి ఉబ్బినట్లుగా ఉండి, మెలికలు తిరిగి, ముడిపడినట్లుగా కనిపిస్తుంది. ఈ లక్షణం మీకు కాలి భాగంలో ఉండవచ్చు. దీనిని ఆయుర్వేదంలో రక్తగత వాతం లేదా సిరాజాల గ్రంథి అని చెప్పారు. ఈ వెరికోజ్ వెయిన్స్ ఎక్కువ సమయం నిల్చుని ఉన్న వాళ్లకి వస్తుంది. ఉదాహరణకు కండక్టర్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, వ్యవసాయం చేసేవారిలోనూ, మధ్యవయస్కులలోనూ, ఎక్కువసేపు పరిగెత్తేవారిలోనూ, రిక్షా తొక్కేవారిలోనూ; స్త్రీలలో అయితే గర్భధారణ సమయంలో వస్తుంది. చికిత్స: ఇది వాతానికి సంబంధించింది కాబట్టి ఆయుర్వేదంలో దీనికి వాతహర చికిత్స చేయవలసి ఉంటుంది. రక్తనాళాల పటుత్వం పెంచడానికి ఆమలకి (ఉసిరికాయ), లశునం (వెల్లుల్లి)తో తయారు చేసిన తైలాన్ని, ముళ్లగోరింట చెట్టుతో తయారు చేసిన తైలాన్నీ వాడుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. పైన చెప్పిన తైలాన్ని రోజుకు 5 నుంచి 6 లీటర్లు తీసుకుని గోరువెచ్చగా చేసి ఒక క్రమపద్ధతిలో శరీరంలో ఎక్కడైతే వెరికోస్ వైన్స్ ఉంటాయో, ఆ భాగంలో పోస్తూ ఉన్నట్లయితే ఆ రక్తనాళం గోడలు పటుత్వంగా ఉండేటట్లు చేయవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో దీన్ని సర్వాంగధార అని అంటారు. పై పద్ధతిలో తైలాన్ని తయారు చేసే ముందు ముళ్లగోరింటచెట్టు; ఉసిరి, వెల్లుల్లి, మునగ ఆకులతో మినుములు, ఉలవలతో తయారు చేసిన పొడితో అపసవ్య మార్గంలో మర్దన చేయాలి. ఇది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే జరగాలి పిల్లిపీచర (శతావరీ చూర్ణం)ను వ్యాధి అవస్థను బట్టి తీసుకోవాలి సహచరాది తైలం, స్వర్ణ మాక్షిక భస్మాన్ని, లశూనాది వటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది వెరికోజ్ అల్సర్స్‌కు వ్రణశోధన తైలాన్ని, రసోత్తమాది లేపం, జాత్యాదిఘృతాన్ని వాడాల్సి ఉంటుంది. జాగ్రత్తలు: ఎక్కువ సమయం నిలబడటం మంచిది కాదు. మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలను, ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి బియ్యపు పిండి, బియ్యం, చక్కెర చాలా తక్కువగా తినడం మంచిది రైస్ స్థానంలో గోధుమలు, ఓట్స్, రూటిన్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా వాడవలసి ఉంటుంది శీర్షాసనం, కపాల భాతి వంటి ఆసనాలు సాధన చేయడం మంచిది. డాక్టర్ చిట్టేటి వేణుగోపాల్ ఎం.డి. ఆయుర్వేద, రుషి ప్రోక్త మన ఆయుర్వేద చికిత్సాలయం కే.పి.హెచ్.బి, రోడ్ నం.1, హెదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మాంసాహారం తింటే గుండెజబ్బు..? నా వయసు 48. నేను తరచూ మాంసాహారం తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల గుండె దెబ్బతింటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది నిజమేనా? సలహా ఇవ్వండి. - శరభయ్య, ఆదిలాబాద్ గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ తీవ్రమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్లో ఇది ఎక్కువ. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్డీఎల్ అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ అనీ అంటారు. మన రక్తంలో ఎల్డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చేవరకు కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి లో తేడాలు వస్తుంటాయి. మాంసాహారంతోబాటు... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితికి మించి తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం మానేయనక్కరలేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరికాస్త మేలైనవి. నా వయసు 38. ఇటీవల మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాకు గుండెపోటు రాకుండా నివారించుకునే మార్గాలు చెప్పండి. - సుదీప్, హైదరాబాద్ గుండెజబ్బులు రాకుండా చూసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు ఇవి... 1. బీపీ 120 / 80 దాటకుండా చూసుకోవాలి. 2. మొత్తం కొలెస్ట్రాల్ 150 కంటే తక్కువగా ఉండాలి. 3. ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) 100 కంటే తక్కువగా ఉండాలి. 4. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) 40 కంటే ఎక్కువగా ఉండాలి. 5. బీఎమ్ఐ (బరువు కొలమానం సూచిక) 23 కంటే తక్కువగా ఉండాలి. 6. సిగరెట్లు, పొగతాగే అలవాటు పూర్తిగా వదిలేయాలి. 7. వ్యాయామం రోజూ తప్పక 30 నిమిషాల పాటు చేయాలి. 8. కూరగాయలు, తాజాపండ్లు రోజుకు కనీసం మూడుసార్లు (సాధ్యమైనంత ఎక్కువగా) భుజించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితకాలం కూడా పొడిగించుకోవచ్చు. పల్మునాలజీ కౌన్సెలింగ్ వ్యాయామం చేస్తుంటే ఆయాసం..? నా వయసు 40. గతంలో నాకు దుమ్ము అంటే సరిపడేది కాదు. (డస్ట్ అలర్జీ ఉండేది). ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - యాదగిరి, నల్గొండ వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడిదగ్గు ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 - 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితోపాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత తగ్గుతుంది. డర్మటాలజీ కౌన్సెలింగ్ కళ్లజోడు ఆనేచోట ముక్కుపై మచ్చలు... నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. నా కళ్లజోడు ఆనే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయితే ఫలితం తాత్కాలికమే. నా ముక్కుకు ఇరువైపుల ఉన్న మచ్చలు తొలగిపోయేదెలా? - సుబ్రహ్మణ్యం, విజయవాడ కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది ఆనే చోట ఏర్పడే ఘర్షణ (ఫ్రిక్షన్) వల్ల ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి.వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి.కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి.అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. నేను గత పదేళ్లుగా కుడి చేతి వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తున్నాను. కానీ గత మూడు నెలల నుంచి ఉంగరం ధరించే చోట చర్మం నల్లబడుతోంది. ఆ ప్రాంతంలో కాస్త దురదగా, మంటగా కూడా ఉంటోంది. దయచేసి ఉంగరం పెట్టుకోవడం మానేయమని సలహా ఇవ్వకుండా, నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - పూర్ణిమ, కొత్తగూడెం ఏదైనా వస్తువుతో మన చర్మం ఆనుకుంటున్నప్పుడు ఏ సమయంలోనైనా అక్కడ ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య ఎదురుకావచ్చు. బహుశా మీకు కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి తగులుతుంటుంది. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటర్జెంట్ తగిలి ఉండేచోట అలర్జీ కనిపిస్తోంది. లేదా మీ ఉంగరంలోని ఇతర లోహాలు (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా అందించవచ్చు. మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. మీ ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ నాలుగు జాగ్రత్తల తర్వాత కూడా మీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. -
ఆహారం... ఆరోగ్యం...
ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే థీమ్... ‘సురక్షితమైన ఆహారం’. మనం రోజూ ఎన్నో ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. సదరు ఆహారాల పట్ల మరెన్నో నమ్మకాలతో ఉంటాం. శాస్త్రీయంగా చూసినప్పుడు వాటిలో చాలావరకు అపోహలు... మూఢనమ్మకాలే. అందుకే ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా మనం ఆహారంగా స్వీకరించే అనేక అంశాల గురించి శాస్త్రీయమైన వాస్తవాలేమిటో తెలుసుకుందాం. అలా వాటి పట్ల నిజమైన అవగాహన కల్పించుకుంటే మంచి ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. అపోహలూ, మన సమాజంలో కొనసాగుతున్న అనేక నమ్మకాల వెనక ఉన్న శాస్త్రీయ అంశాలను తెలుసుకుందాం. అలా తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. పచ్చికూరలు ఆరోగ్యానికి మేలేనా? వాస్తవానికి పచ్చిగానే తినదగ్గ కూరగాయలూ, పచ్చికూరల రసాలు (క్యారట్, బీట్రూట్ వంటివి) ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఇటీవలికాలంలో ప్రతి పంటలోనూ రసాయన ఎరువులూ, పురుగుమందులూ వేయకుండా పండించడం లేదు. దాంతో పచ్చికూరగాయలు తినడం వల్ల లభించే పీచు (డయటరీ ఫైబర్), విటమిన్లు వంటి పోషకాల కంటే... వాటిపై ఉండే క్రిమిసంహారక మందుల వల్ల చేకూరే నష్టాలే ఎక్కువ. అందుకే ఒకవేళ పచ్చిగానే తినదగ్గ కూరగాయలు, వాటి రసాలతో ఆరోగ్య ప్రయోజనం పొందాలనుకునేవారు విధిగా వాటిని కొద్దిపాటి సోడా ఉప్పు (సోడియం బై కార్బొనేట్, మామూలు ఉప్పు (సోడియం క్లోరైడ్)లతో దాదాపు 5 - 10 నిమిషాలు కడగాలి. దాంతో క్రిమిసంహారక మందులు చాలావరకు తొలగిపోతాయి. ఇలా కడిగి తినడం వల్ల పచ్చిగానే తినదగ్గ కూరగాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేపాకు డయాబెటిస్‌కు మందు కాదు... చేదుగా ఉన్న ప్రతి ఒక్కటీ చక్కెర వ్యాధికి మందు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ అది ఎంతమాత్రమూ వాస్తవం కాదు. నిజానికి వేపలో చాలా ఔషధగుణాలు ఉన్న మాట వాస్తవం. కానీ వైద్యులు, పరిశోధకులు సరిగ్గా ఏ రసాయనం, ఏరకమైన ఔషధగుణాన్ని కలిగి ఉందో గుర్తించి, ఆ మందు కోసమే ఆ రసాయనాన్ని వాడుతుంటారు. అంతేగానీ... మనం ఎలాంటి విచక్షణ లేకుండా వేపాకులు నమలడం, వేప రసం తాగడం వల్ల... అందులోని ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలు మనలోని మేలు చేసే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే మనం క్రమం తప్పకుండా వేపాకును నములుతూ ఉంటే కీడు చేసే బ్యాక్టీరియా కూడా వేపలోని ఇన్సెక్టిసైడ్ గుణాలకు అలవాటు పడి, దాని పట్ల నిరోధాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇలా వేపను వాడటం వల్ల రెండురకాలుగా నష్టం చేకూరే ప్రమాదం ఉంది. కాకపోతే వేపను సమర్థంగా ఉపయోగించుకోవాలంటే ఒకపని చేయవచ్చు. కొన్ని చర్మరోగాలకు వేపాకును నూరి లేపనంగా (టాపికల్ మెడిసిన్‌లా) వాడుకోవచ్చు. కొన్నిసార్లు తలనొప్పులు వచ్చినప్పుడు వేపాకును కణతలకు రుద్దుకొని ఉపశమనం పొందడం మన పల్లెల్లో చూస్తూనే ఉంటాం. ఇలా వేపను పైపూతగా వాడుకోవడం ప్రమాదకరం కాదు. మాంసాహారం మంచిది కాదా? మతపరమైన, సామాజికపరమైన నమ్మకాల ఆధారంగా కాకుండా కేవలం సశాస్త్రీయంగా చూడాల్సిన అంశమిది. మాంసాహారం మంచిది కాదంటూ, చాలామంది శాకాహారంవైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వీరిలో అత్యధికులు విటమిన్-డి, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాలు ఏర్పడి, అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే పైన పేర్కొన్న పోషకాలు మాంసాహారంలోనే సమృద్ధిగా ఉంటాయి. ఇక విటమిన్ బి12 అయితే చాలావరకు మాంసాహారంతోనూ, కొంతవరకు పాలు, గుడ్లలో లభ్యమవుతుంది. మన మెదడునుంచి నరాల ద్వారా అన్ని అవయవాలకూ అందే ఆదేశాలన్నీ విటమిన్ బి12 ద్వారానే అందుతాయి. అందుకే విటమిన్ బి12 లోపం ఉన్నవారు మెదడునుంచి ఆయా అవయవాలకు ఆదేశాలు అందక ఒక్కోసారి స్పృహతప్పి పడిపోయే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలోనో, ఈతకొట్టే సమయంలోనో ఈ తరహా ప్రమాదం ఎదురైతే అది ప్రాణాంతకం కావచ్చు. ఒకవేళ ఇతర జీవులకు ప్రాణహాని తలపెడుతున్నామనే భావనతో ఉండేవారు, అన్ని ప్రాణులకూ జీవించే అవకాశం ఉందనీ అందువల్ల ఆహారం కోసం ఇతర ప్రాణులను చంపడం తప్పని భావించి శాకాహారం వైపు మళ్లిన వారు పై పోషకాల లోపాలను భర్తీ చేసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది అవిశగింజలను ఎక్కువగా వాడటం. వాటిని తప్పనిసరిగా రోజుకు ఒక చెంచాకు తక్కువ కాకుండా తినాలి. ఇవి ‘ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్’ను సమృద్ధిగా సమకూరుస్తాయి. మాంసాహార లోపాన్ని అవిశగింజలు (ఫ్లాక్స్సీడ్స్) చాలావరకు భర్తీ చేస్తాయి. కాఫీ నిజంగానే ఉత్తేజపరుస్తుందా, బరువు తగ్గిస్తుందా? మనలో చాలామందికి కాఫీ అలవాటే. కొందరికి అది లేనిదే రోజు గడవదు. కాఫీలోని కెఫిన్ వల్ల కొంత ఉత్తేజం కలిగే మాట వాస్తవమే. కెఫిన్లోని బీటా ఆక్సిడేషన్ క్రియ వల్ల కొంత కొవ్వు కూడా తగ్గే విషయమూ నిజమే. అందుకే పరుగుపందేలలో పాల్గొనాలనుకునేవారు కొవ్వు, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఇది చాలా అనారోగ్యకరమైన ప్రక్రియ. దీని వల్ల గుండె స్పందనల్లో లయ తప్పే (అరిథ్మియాసిస్ వచ్చే) అవకాశం ఉంది. శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయడం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. దీర్ఘకాలంలో దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉత్తేజం పొందడానికి, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఆశ్రయించడం సరైన పద్ధతి కానే కాదు. కాఫీలోని కెఫిన్ కంటే టీ లోని ఎల్-థయనైన్ కొంతవరకు మంచిది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. అయితే అది కాఫీ అయినా లేదా టీ అయినా రోజుకు రెండు నుంచి మూడు చిన్న కప్పులకు మించి తాగకపోవడమే మంచిది. తులసి ఆరోగ్యానికి మేలు అయితే... తులసీదళాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆసిమమ్ సాంక్టమ్ అనే పేరున్న తులసిలోని కొన్ని రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా, ద్రవరూపంలోనే ఉంచేలా చూస్తాయి. తులసిలోని ఈ గుణమే పరిశోధకులను తనవైపు ఆకర్షించేలా చేసింది. తులసిదళాలు వేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడవు. ఫలితంగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడటం వల్ల గుండెపోటు నివారితమవుతుంది. అలాగే మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షవాతం లాంటి జబ్బులనూ నివారించవచ్చు. పరిమితులివి... అయితే తులసీదళాలకు ఉన్న రక్తాన్ని పలచబార్చే గుణమే ఒక్కోసారి కొందరిలో ప్రాణాంతకం కావచ్చు. ఉదాహరణకు ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘థ్రాంబోసైటోపీనియా’ అంటారు. ఇలాంటి కండిషన్ ఉన్నవారు తులసిదళాలు తమకు మేలు చేస్తాయనే భావనతోనో, లేదా భక్తి కొద్దో తులసిని మిగతా ఆరోగ్యవంతుల్లాగా వాడటం సరికాదు. ఇక శస్త్రచికిత్స చేయించుకోబోయే వాళ్లు సైతం ఆపరేషన్‌కు ముందు తులసినీళ్లు తాగడం, తులసి ఆకులు తినడం మంచిది కాదు. దీనివల్ల ఆపరేషన్ సమయంలో ఆగకుండా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులు వాడేవారు తులసిని ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఔషధాలు రక్తాన్ని పలచబార్చే మందులు. వాటికి తులసి కూడా తోడైతే... ఏదైనా దెబ్బతగిలినప్పుడు రక్తస్రావం ఆగకుండా జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. అందుకే తులసి ఆకులను ఆరోగ్యం కోసం వాడేవారు జాగ్రత్తగా అప్పుడప్పుడూ ఒకటి, రెండు ఆకులకు మాత్రమే పరిమితం కావడం మేలు. వరి అన్నంతో డయాబెటిస్ వస్తుందా? వరి అన్నం తినడం వల్ల అందులోని పిండి పదార్థాల వల్ల డయాబెటిస్ త్వరగా వస్తుందని మన సమాజంలోని చాలా మందికి ఒక నమ్మకం. అందుకే డయాబెటిస్ లేని వాళ్లలో చాలామంది దాన్ని నివారించుకుంటున్నామనే భావనతో రాత్రివేళ గోధుమరొట్టెలు తింటుంటారు. అలా తినమంటూ తోటివారికి హితబోధ కూడా చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. తృణధాన్యాలన్నింటిట్లోనూ తక్షణం ఉపయోగించడానికి వీలైనది కాబట్టి జపాన్, కొరియా, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా, కొన్ని ఆఫ్రికా దేశాలు వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటాయి. ప్రపంచంలో 60 శాతం మంది వరిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నిజానికి వరి అన్నం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందా అన్న అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలిద్దాం. మనం ఏైవైనా ఆహారపదార్థాలను తిన్న తర్వాత వాటివల్ల రక్తంలో పెరిగే చక్కెర ప్రమాణాలను కొలతను గ్లైసీమిక్స్ ఇండెక్స్ (జీఐ) అంటారు. అంటే... దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర పాళ్లు అంత ఎక్కువన్నమాట. ఇలా కొలిచే సమయంలో జీఐ విలువ 70 కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువనీ, జీఐ విలువ 56 నుంచి 69 మధ్య ఉంటే అది మీడియం అనీ, జీఐ విలువ 55 లేదా అంతకంటే తక్కువ ఉంటే అది తక్కువనీ వర్గీకరిస్తారు. (జీఐ విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలు డయాబెటిస్ పేషంట్లకు అంత మంచిది కాదు). అయితే వేర్వేరు రకాల వరి, గోధుమల తాలూకు జీఐ విలువలివి... బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) 55 తెల్ల రైస్ (పొట్టుతీసిన బియ్యం) 64 ముడి గోధుమతో చేసిన రోటీలు 58 తెల్ల గోధుమపిండితో చేసిన బ్రెడ్ 71 దీన్నిబట్టి చూస్తే వరి, గోధుమల గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంచుమించూ సమానమే. ఇక కొన్ని రకాల గోధుమల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా వరి కంటే కూడా కాస్తంత ఎక్కువే. వరితో పోలిస్తే గోధుమలో పీచుపదార్థాలు ఎక్కువ. (అయితే అవి వరి, గోధుమల్లో వేర్వేరు రకాల మీద కూడా ఆధారపడి ఉంటాయి). కాబట్టి గోధుమలే తినాలని, డయాబెటిస్ వంటి రోగులు అవి తింటేనే మంచిదనే అపోహలు అవసరం లేదు. తమకు అలవాటైనదే సౌకర్యంగా తినవచ్చు. కాకపోతే వరి అన్నం తినే సమయంలో దాన్ని కూరలు, పప్పు, పులుసు, పెరుగు వంటి వేర్వేరు వాటితో కలిపి తింటున్నారనుకోండి. ఆ సమయంలో ఆహారం రుచిగా ఉంటే మనం ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామో మనకే తెలియకుండా కాస్త ఎక్కువగానూ తినే అవకాశం ఉంది. కానీ గోధుమతో చేసిన రోటీలు తినేసమయంలో వాటి సంఖ్యను బట్టి మనం ఎక్కువగా తింటున్నామా లేదా అన్న విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ పరిమితంగా తీసుకోగల నియంత్రణ శక్తి ఉంటే డయాబెటిస్ రోగులు సైతం తమకు అలవాటైన వరి అన్నాన్నే తినవచ్చు. ఇక వరి అన్నం దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశాలను కలగజేస్తుందన్న మాటలో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. జపాన్ దేశస్తులు వరి అన్నంతో పాటు చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఆయుఃప్రమాణం విషయంలో జపాన్ దేశస్తులే ఎక్కువ కాలం బతుకుతారన్న విషయం తెలిసిందే. (జపాన్ దేశస్తుల సగటు ఆయుఃప్రమాణం 87.6 ఏళ్లు). వరి అన్నంతో మనం చెప్పుకుంటున్నంత ప్రమాదమే ఉంటే జపాన్ దేశస్తుల ఆయుఃప్రమాణం అంత ఎక్కువగా ఉండేది కాదు కదా. కాబట్టి డయాబెటిస్‌కూ, వరి అన్నానికీ సంబంధం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మీరెంత సమర్థంగా డయాబెటిస్‌ను నివారించుకుంటున్నారు అన్న విషయం ప్రధానం. ఒకవేళ డయాబెటిస్ వచ్చి ఉంటే నడక, వ్యాయామం, వేళకు మందులు తీసుకోవడం, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ చక్కెరను ఎలా నియంత్రణలో ఉంచుకుంటున్నారన్నదే ముఖ్యం. మద్యం గుండెజబ్బులను రాకుండా ఆపుతుందా? పరిమితమైన మద్యం లేదా రెడ్‌వైన్ గుండెజబ్బులను నివారిస్తుందని ఇటీవల కొందరు వాదిస్తుండటం మనకు తెలిసిన విషయమే. నిజానికి మద్యంలో ఆ గుణమే ఉంటే డాక్టర్లందరూ దాన్ని సిఫార్సు చేసే వారే కదా. కానీ మద్యంలో అలాంటి గుణమేదీ లేకపోగా... అది మెదడు, నాడీవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలుఇలా ఎన్నో అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఆ అవయవాలతో నడిచే వ్యవస్థలను నాశనం చేస్తుంది. శరీరబరువు పెంచుతుంది. పైగా మద్యానికి ఉన్న అలవాటుపడే (అడిక్షన్) గుణం కారణంగా అది అన్ని విధాలా చేటే చేస్తుంది తప్ప... ఏ విధంగానూ ఆరోగ్యానికి దోహదం చేయదు. మద్యం గుండెజబ్బులను ఎంతమాత్రమూ నివారించలేదు సరికదా... ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు దోహదం చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. కోడిగుడ్డు పచ్చసొన వల్ల హాని తప్పదా? ఇటీవల చాలామంది కోడిగుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అందుకే అది ఆరోగ్యానికి హానికరం అని నమ్ముతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ అనేది ఒక రకం కొవ్వు. అందరిలోనూ కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం సరికాదు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే కోడిగుడ్డు పచ్చసొనను పరిహరించాలి. మిగతావాళ్లు నిరభ్యంతరంగా పచ్చసొనను వాడాలి. ఎందుకంటే ఈ కారణం వల్ల పచ్చసొనను పారవేస్తే... అందులోనే ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. అందుకే రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు మినహాయించి... చిన్నపిల్లలూ, యుక్తవయసులోకి వస్తున్న కౌమార బాలబాలికలు (అడాలసెంట్ యూత్), యువతీయువకులు, వృద్ధులు వారానికి నాలుగైదు గుడ్లు పూర్తిగా (పచ్చసొనతో) తినాలి. నిజానికి పచ్చసొనలో ఉండే ‘కొలైన్’ అనే పోషకం కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దాంతోపాటు ఐరన్, ఫాస్పరస్, ఐయోడిన్, సెలీనియమ్ వంటి ఖనిజలవణాలు, అన్నిరకాల విటమిన్లు... ఈ పచ్చసొనలోనే ఉంటాయి. ఎన్ని నీళ్లు తాగితే అంత ఆరోగ్యమా? నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యమంటూ చాలామంది చెబుతుంటారు. పైగా ఇలా నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు కడుక్కుపోతాయంటూ వివరణ కూడా ఇస్తుంటారు. ఇందులోని వాస్తవాలను శాస్త్రీయంగా పరిశీలిద్దాం. శరీరం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని వాడుకుంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా చేయడానికి, రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి, మలమూత్రాలతో పాటు, చెమట విసర్జన వంటి అంశాలకు నీరు చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు అది తాను నిర్వహించాల్సిన కార్యకలాపాలను మరచి... మూత్రరూపంలో త్వరగా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటుంది. (అందుకే ఎక్కువగా నీరు తాగినప్పుడు మూత్రం త్వరగా వచ్చేస్తుంటుంది). ఇలా బయటకు పోతూపోతూ శరీరంలోని సోడియం లవణాలను కూడా బయటకు తీసుకెళ్తుంటుంది. కాబట్టి శరీరంలో సోడియం లవణాలు తగ్గి ‘హైపోనేట్రీమియా’ అనే లవణాలు తగ్గిన కండిషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇది చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించి, ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితినీ కల్పించవచ్చు. వయసు పైబడ్డవారిలో తరచూ ఈ ‘హైపోనైట్రీమిక్ కార్డియోమయోపతి’ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఇక బీపీ మాత్రలూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీటిని ఎక్కువగా తాగినప్పుడు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ఏసీఎస్ఎమ్), కెనెడియన్ న్యూట్రిషన్ సొసైటీ వంటి ఎన్నో ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ఇక ఒక్కోసారి శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే అది కణాల్లోకి చొచ్చుకుపోయి కణాలను నాశనం చేయగలదు. దీన్నే ‘వాటర్ ఇంటాక్సికేషన్’ అంటారు. బరువు తక్కువగా ఉండే పిల్లలు, ఎండలో స్పోర్ట్స్ ఆడేవారు, నీళ్లు తాగడం వంటి పోటీలలో పాల్గొనేవారు, సైకోజెనిక్ పాలీడిప్పియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు)... అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కడుక్కుపోయి/కొట్టుకుపోయి మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మన సామెతను గుర్తుపెట్టుకుని అవసరమైనంత మేరకే నీళ్లు తాగాలి. మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి? కేవలం దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి మూత్రం మరీ తెల్లగా అంటే డిస్టిల్డ్ వాటర్లా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మూత్రం మరీ పచ్చగా వస్తోందంటే శరీరంలో నీరు తగ్గిందని అర్థం. కాబట్టి మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేలాగే నీరే తాగాలి ఒకసారి తాగినప్పుడు 100 ఎం.ఎల్. తాగడమే మంచిది వారి వారి శరీర బరువును బట్టి ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిది కాదు మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు, నీళ్ల విరేచనాలు అయ్యేవారు డాక్టరు సూచించిన మేరకే నీళ్లు తాగాలి. ఈ జబ్బులున్న వాళ్లు నీళ్లు తాగే విషయంలో డాక్టర్ సలహా తప్పక పాటించాలి. మీ సేవాభావం... కావాలి ఇతరులక ఆదర్శం! వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలే ప్రాతిపదిక. మీ ఎంట్రీలను పంపండి. మీ సేవా కార్యకలాపాల దృష్టాంతాలకు ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను పంపండి. చిరునామా: సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. డాక్టర్ భక్తియార్ చౌదురి, ఫిట్నెస్ నిపుణులు, హైదరాబాద్