
‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టికరణ
దేశంలో స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళనకరం
ఒబేసిటీపై మనమంతా యుద్ధం చేయాల్సిందే
వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలి
పది మందికి సవాలు విసురుతున్నా.. ఆ పది మందిలో ఒక్కొక్కరు
మరో పది మందికి సవాలు విసరాలి
వచ్చే నెల 8న నా సోషల్ మీడియా ఖాతాలను మహిళలకే అప్పగిస్తా
వారు తమ విజయాలను అందులో పంచుకోవచ్చు
న్యూఢిల్లీ: దేశంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఒబేసిటీ నేడు అతిపెద్ద సమస్యగా మారిందని అన్నారు. దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలిందని గుర్తుచేశారు. ఇండియాలో గత కొన్నేళ్లలో స్థూలకాయుల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని చెప్పారు.
ప్రధానంగా చిన్నారుల్లో స్థూలకాయ సమస్య విపరీతంగా పెరగడం నిజంగా ఆందోళనకరమేనని తెలిపారు. ఇండియా చక్కటి ఆరోగ్యకరమైన, దృఢమైన దేశంగా మారడం అత్యావశ్యకం అని ఉద్ఘాటించారు. ఆరోగ్య భారతం కోసం స్థూలకాయ సమస్యపై పోరాటం చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. ఈ సూచన పాటించాలంటూ 10 మందికి తాను సవాల్ విసురుతున్నానని, ఆ 10 మందిలో ఒక్కొక్కరు మరో 10 మందికి ఇదే సవాల్ విసరాలని స్పష్టంచేశారు.
ఈ శృంఖలాన్ని కొనసాగించాలని, అంతిమంగా ప్రజలంతా వంటనూనెల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని, తద్వారా ఆరోగ్యానికి ఎనలేని మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా సహా పలువురు ప్రముఖులు ఆడియో సందేశాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వినిపించారు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇందులో ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన ఏం మాట్లాడారంటే...
మహిళల స్ఫూర్తిని గౌరవించుకోవాలి
‘‘వేర్వేరు రంగాల్లో మన మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. వారిచ్చిన స్ఫూర్తిని మనం గౌరవించుకోవాలి. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా భారతదేశ నారీశక్తికి నా సెల్యూట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన నా సోషల్ మీడియా ఖాతాలను మహిళా విజేతలకే అప్పగిస్తా. వారు తమ కార్యాచరణ, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, అనుభవాలను అందులో పంచుకోవచ్చు. ప్రజలకు సందేశం ఇవ్వొచ్చు. ఇందులో మీరు పాల్గొనాలంటే నమో యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోండి. నేడు ఎన్నో కీలక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘ఒక్కరోజు సైంటిస్టు’గా మారడానికి విద్యార్థులు, యువత ప్రయత్నించాలి. ఈ నెల 28వ తేదీన నేషనల్ సైన్స్ డే సందర్భంగా రీసెర్చ్ ల్యాబ్‌లు లేదా ప్లానిటోరియమ్స్‌ను సందర్శించాలని కోరుతున్నా.
‘ఇస్రో’ సెంచరీ హర్షణీయం
ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ క్రికెట్ మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఎక్కడ చూసినా క్రికెట్ వాతావరణం, అభిమానుల సందడి కనిపిస్తోంది. క్రికెట్‌లో మన జట్టు సెంచరీ సాధిస్తే కలిగే ఆనందం అందరికీ తెలిసిందే. అంతరిక్ష రంగంలో మన దేశం ఇటీవలే సెంచరీ సాధించింది. గత నెలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 100వ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. స్పేస్‌సైన్స్‌లో నిత్యం కొత్త శిఖరాలను అధిరోహించాలన్న మన పట్టుదల, అంకితభావానికి ఇదొక ప్రతీక’’.
జింక మహిళ అనూరాధ రావు
అనూరాధ రావు గురించి మీకు చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో జంతువుల సంరక్షణ కోసం ఆమె ఎంతగానో శ్రమిస్తున్నారు. చిన్నప్పటి నుంచే జంతువుల సేవలో నిమగ్నమయ్యారు. జంతుజాలం సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలు ఆమెను ‘జింక మహిళ’ అని పిలుస్తుంటారు. వచ్చే నెలలో ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే’ నిర్వహించుకుంటాం. జంతుజాలం పరిరక్షణ కోసం శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించండి’’ అని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment