న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్‌ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్‌వర్క్ ఇండియా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్‌లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్‌ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్‌ఫామ్‌లకు ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్‌ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది.
అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్‌కార్ట్‌కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్‌కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్‌వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment