CM YS Jagan Review Meeting Highlights With Education Department, Details Inside - Sakshi
Sakshi News home page

CM Jagan Review Meeting Highlights: డిజిటల్‌ విద్యతో దీటుగా.. 

Published Wed, Jun 29 2022 3:21 AM | Last Updated on Wed, Jun 29 2022 9:41 AM

CM YS Jagan Review Meeting On Education Department - Sakshi

విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిజిటల్‌ టెక్నాలజీ విద్యతో మరింత రాణించేలా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక పద్ధతులను అనుసరించి బోధన చేపట్టడం ద్వారా మన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే డిజిటల్‌ విద్యా బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేస్తూ వీటిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖలో ’మనబడి నాడు – నేడు’  డిజిటల్‌ లెర్నింగ్‌పై సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 

తరగతి గదుల్లో టీవీలు, డిజిటల్‌ బోర్డులు
తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, టీవీల ఏర్పాటుపై జూలై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్నారు. వీటి వల్ల సైన్స్, మేథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు సులభంగా, చక్కగా అర్థం అవుతాయన్నారు.  వీటి వినియోగం ద్వారా టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. డిజిటల్‌ స్క్రీన్‌పై కంటెంట్‌ను హైలెట్, ఎన్‌లార్జ్‌ చేస్తే బాగుంటుందని సూచించారు. డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. 

బోధనకు అనువుగా డిజిటల్‌ స్క్రీన్లు
తరగతి గదిలో బోధనా కార్యక్రమాలకు అనువుగా డిజిటల్‌ బోర్డులు, స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి మెరుగైన పద్ధతిలో అమర్చాలన్నారు. నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతుల్లో టీవీ స్క్రీన్లు అమర్చేలా ప్రతిపాదనలు  రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు.

సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన ట్యాబ్‌లు..
‘సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్‌లో బైజూస్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. అందుకు అనుగుణంగా స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. అవి నిర్దారించాకే ట్యాబ్‌ల  కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఎం జగన్‌ సూచించారు. 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్‌లు తరువాత 9, 10వ తరగతుల్లో కూడా వినియోగించుకొనేలా ఉండాలని స్పష్టం చేశారు.

మూడేళ్లపాటు ట్యాబ్‌లు నాణ్యతతో పని చేసేలా ఉండాలన్నారు. వాటి నిర్వహణ కూడా అత్యంత ప్రధానమన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టటాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ట్యాబ్‌ల కొనుగోలులో మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా అందించాలని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement