జగనన్న విద్యా కానుకకు పరిపాలన అనుమతి | Administrative approval for Jagananna Vidya Kanuka | Sakshi
Sakshi News home page

జగనన్న విద్యా కానుకకు పరిపాలన అనుమతి

Jan 21 2024 6:04 AM | Updated on Jan 21 2024 6:04 AM

Administrative approval for Jagananna Vidya Kanuka - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో (2024–25) జగనన్న విద్యా కానుక–5 పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ప్రతీ ఏడాదీ స్కూళ్లు తెరవకముందే ఈ విద్యా కానుకను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. వచ్చే జూన్‌ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జగనన్న విద్యా కానుక–5లో భాగంగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం, బెల్ట్, బూట్లు, డిక్షనరీ, బ్యాగ్‌లు వంటి వాటిని 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఉచితంగా అందించేందుకు వీలుగా రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతులను విద్యాశాఖ మంజూరు చేసింది.

పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ మినహా మిగతా వాటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు.. 1వ తరగతి నుంచి టెన్త్‌ వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ ముద్రించి సరఫరా చేసేందుకు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. 

టెండర్ల ఆహ్వానం వీటికే..
ఇదిలా ఉంటే.. 4,73,37,549 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ సరఫరాకు, అలాగే.. 4,65,268 పదో తరగతి ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాల సరఫరాకు రూ.253.75 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్‌ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ టెక్స్‌ ్టబుక్‌ ప్రెస్‌ శుక్రవారం జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపించింది. ద్విభాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సిందిగా అందులో పేర్కొంది. తెలుగు–ఇంగ్లీష్, ఉర్దూ–ఇంగ్లీష్, కన్నడ–ఇంగ్లీష్, ఒడియా–ఇంగ్లీష్, తమిళం–ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో పుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది.

26 జిల్లాల్లోని 670 మండల కేంద్రాల్లో ఉన్న విద్యాశాఖాధికారి కార్యాలయాలకు ఈ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ను నిర్ధేశించిన గడువులోగా సరఫరా చేయాలని వివరించింది. అలాగే, ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పేపర్‌ నాణ్యత, కలర్స్‌తో పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుందని అందులో స్పష్టంచేసింది. ఈ టెండర్‌లో ఎల్‌–1గా ఎంపికైన తరువాత రివర్స్‌ టెండర్‌ నిర్వహించి బిడ్డర్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన 50 రోజుల్లో 50 శాతం, 60 రోజుల్లో 75 శాతం, ఆ తరువాత వంద శాతం పుస్తకాల సరఫరా చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. 

నిబంధనలు ఇవే..
► ఇక టెండర్‌లో పాల్గొనే బిడ్డర్లకు 2020–21, 2021–22, 22–23 సంవత్సరాల్లో కనీసం పది కోట్ల పుస్తకాలు ముద్రించి, సరఫరా చేసిన టర్నోవర్‌ కలిగి ఉండాలనే నిబంధన విధించారు. 
► అలాగే, పుస్తకాల ముద్రణ, సరఫరా కార్యకలాపాల్లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. ​​​​​​​
► పుస్తకాల కాగితం దగ్గర     నుంచి ముద్రణ దశ వరకు నాలుగు దశల్లో నాణ్యతను తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 
​​​​​​​► పుస్తకాల్లో లోపాలుంటే భారీ జరిమానా విధించనున్నట్లు విద్యాశాఖ ఆ టెండర్‌ డాక్యుమెంట్‌లో పేర్కొంది. 
​​​​​​​► దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేసేందుకు ఈనెల 29 చివరి తేదీగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement