సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్ స్థాయి వరకు స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది.
ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ వరకు...
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యావిధానం లేకపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు సరైన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందడం లేదు. నేరుగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్ధులు స్కూలు వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల ఒకటో తరగతి వయసుకు అలవడాల్సిన అక్షర, సంఖ్యా పరిజ్ఙానం కొరవడుతోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్లే కొద్దీ వెనుకబాటుకు గురవుతున్నారు.
ప్రథమ్ సంస్థ, న్యాస్, రాష్ట్ర స్థాయి సర్వేల్లో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. దీన్ని సరిదిద్దేందుకు పూర్వ ప్రాథమిక విద్యకు వీలుగా ఫౌండేషనల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచే చిన్నారులకు డిజిటల్ సాంకేతికతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసక్తికరంగా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఫౌండేషనల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతుల బోధనను అందుబాటులోకి తెస్తోంది.
ప్రభుత్వ టీచర్లకు శిక్షణ
డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. డిజిటల్ డివైస్‌లను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా 50 శాతం మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి..
మూడు దశల్లో 45,328 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద 15,694 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. రెండో దశ కింద 2023–24లో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను సిద్ధం చేస్తారు. తొలిదశ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు.
పాఠశాలలకు ఇంటర్నెట్
డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాడ్ బ్యాండ్/లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్‌బీ మోడెమ్/డాంగిల్/పోర్టబుల్ హాట్‌స్పాట్, వీఎస్‌ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే 2,658 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉండగా మూడు నెలల్లో మిగతా స్కూళ్లలోనూ అందుబాటులోకి తేనున్నారు.
డిజిటల్ బోధన ఇలా..
తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ విద్యాబోధన నిర్వహిస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.511.28 కోట్లు వ్యయం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment