చదువే ఆయుధం | CM YS Jagan Comments At Chintapalli Public Meeting | Sakshi
Sakshi News home page

చదువే ఆయుధం

Published Fri, Dec 22 2023 4:24 AM | Last Updated on Fri, Dec 22 2023 5:10 AM

CM YS Jagan Comments At Chintapalli Public Meeting - Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘‘మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే సదుద్దేశంతో బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తున్నాం. రూ.620 కోట్లతో 4,34,185 మంది పిల్లలకు మామగా ఈ కానుక అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ 8వ తరగతి నుంచి బోధన ప్రారంభిస్తున్నాం. 55 నెలలుగా ప్రతి అడుగూ విప్లవాత్మక మార్పు దిశగానే వేస్తున్నాం. పిల్లలకు మనం ఇవ్వగలిగే విలువైన ఆస్తి చదువులే’’ 
– ట్యాబ్‌ల పంపిణీలో సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుల పట్ల దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ తీసుకోనంత శ్రద్ధ వహిస్తూ తరతరాల తలరాతలను మారుస్తున్న మనందరి ప్రభుత్వంపై కొందరు పెత్తందారులు దుర్బుద్ధితో, దురుద్దేశాలతో బురద చల్లుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్‌ ఆరాట పడుతుంటే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని విప్లవాత్మక సంస్కరణలు చేపడితే విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తప్పుడు రాతలతో పేద విద్యార్థులపై విషం కక్కొద్దని సూచించారు. పిల్లలు మరింత మెరుగ్గా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునేలా ట్యాబ్‌లు అందిస్తుంటే వారిని చెడగొడుతున్నారంటూ, పాడు చేస్తున్నారంటూ దుర్మార్గమైన కథనాలు ప్రచురిస్తున్నారని, మరి మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండవచ్చా? అని పెత్తందారులను నిలదీశారు. అసలు అది పేపరా?.. పేపర్‌కు పట్టిన పీడా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు ల్యాబ్‌లు, ఐఎఫ్‌పీలు, డిజిటల్‌ బోధనతో తీర్చిదిద్ది బైజూస్‌ కంటెంట్‌తో ఖరీదైన ట్యాబ్‌లను పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని, ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్‌ శిక్షణతోపాటు సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా అడుగులు వేయడంతో ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పించామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. తొలుత విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో చింతపల్లి వచ్చారు. ఆశ్రమ పాఠశాలలో డిజిటల్‌ లెర్నింగ్‌ స్టాల్‌ని పరిశీలించి విద్యార్థులతో కలసి క్లాస్‌ రూమ్‌లో కూర్చొని ఆప్యాయంగా ముచ్చటించారు.

క్లాస్‌లు ఎలా జరుగుతున్నాయి? భోజనం ఎలా ఉంది? చదువులు బాగా చెబుతున్నారా చిన్నా? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం చింతపల్లి మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకుని బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ ట్యాబ్స్‌ రాష్ట్రవ్యాప్తంగా 9,424 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. 

పేద బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం.. 
గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య, పేద బిడ్డల బంగారు భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ నా పుట్టిన రోజున ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం దేవుడిచి్చన అదృష్టం. రాష్ట్రంలోని పిల్లలే మన భవిష్యత్తు, మన వెలుగులు. మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా రాష్ట్ర భవిష్యత్తును నిలిపే వారసులు వారంతా. వరుసగా రెండో ఏడాది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ 4,34,185 మంది పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు పెడుతున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శిస్తూ 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్‌ విప్లవంలో భాగంగా గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, టీచర్లకు పంపిణీ చేశాం. ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేలా బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి మరీ ఇస్తున్నాం. ట్యాబ్‌ల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆందోళన చెందొద్దు. వాటిని హెడ్‌ మాస్టార్‌కు లేదా గ్రామ సచివాలయంలో అందచేస్తే రసీదు ఇచ్చి మరమ్మతులకు పంపిస్తారు.

వారం రోజుల్లోనే ట్యాబ్‌ రిపేరు చేసి ఇస్తారు. లేదంటే మరో ట్యాబ్‌ మీ చేతిలో పెడతారు. వాటిలో సెక్యూర్డ్‌ మొబైల్‌ డివైస్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ లోడ్‌ చేయడం వల్ల పిల్లలు పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలను మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు? ఏం చదివారు? అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.  

ఉచితంగా రూ.33 వేల ట్యాబ్, కంటెంట్‌.. 
ఒక్కో పిల్లాడి చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్‌ మార్కె­ట్‌ విలువ రూ.17,500. దీనికి తోడు బైజూస్‌ కంటెంట్‌ ఇస్తున్నాం. రూ.33 వేలు విలువ చేసే ట్యాబ్, కంటెంట్‌ ఉచితంగా ఇస్తున్నాం. శ్రీమంతుల పిల్లలు బైజూస్‌ కంటెంట్‌ కొనుగోలు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.15 వేలు చెల్లించాలి. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలవాలన్న తలంపుతో ఇంత ఖర్చు పెడుతున్నాం.  

డిజిటల్‌ గదులు.. ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు 
నాడు – నేడు తొలిదశ పూర్తైనస్కూళ్లలో 6వ తరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్‌ రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పీలు అమర్చి డిజిటలైజ్‌ చేశాం. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన పాఠాలను తరగతి గదిలో నేర్పుతారు. అవే పాఠాలు ట్యాబ్స్‌లో కూడా ఉంటాయి. దీనివల్ల మెరుగ్గా నేర్చుకుంటారు. 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్‌లు తెచ్చి 10,038 స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశాం. ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటలైజేషన్‌ కోసం మొదటి దఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు.  నాడు–నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. 62,097 తరగతి గదులన్నీ పూర్తిగా డిజిటలైజ్‌ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని అధికారులు చెప్పారు. 

సందేహాల నివృత్తికి యాప్‌..
ఫిజిక్స్, మేథ్స్, బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టుల్లో పిల్లల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసారి ట్యాబ్‌లలో డౌట్‌ క్లియరెన్స్‌ బాట్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి అందించాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబ్‌లలో ఏం ఉండాలి? పిల్లలకు మరింత మెరుగ్గా ఎలా ఉపయోగపడాలి? సులభంగా అర్ధమయ్యేందుకు ఏం చేయాలి? అనే ఆలోచన చేస్తూ తాపత్రయపడుతున్నాం. సందేహాల నివృత్తికి ఆర్టి­ఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తెచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. పిల్లలు విదేశీ భాషలను నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్‌ను కూడా చేర్చాం. ఇలా ట్యాబ్‌లు పిల్లలకు ఒక ట్యూటర్‌లా తోడుంటాయి. 

కొత్త టెక్నాలజీకి అనుగుణంగా..  
మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే 3వ తరగతి నుంచే టోఫెల్‌ పరీక్షకు సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్‌ నిర్వాహణ సంస్ధ ఈటీఎస్‌(ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌)తో ఒప్పందం చేసుకున్నాం. టోఫెల్‌ శిక్షణ కోసం ఒక పీరియడ్‌ కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. రానున్న 20 ఏళ్లలో చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని చెబుతున్నారు.మన జీవితాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ప్రభావం పెరుగుతుంది.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలను సిద్ధం చేస్తూ వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, వర్చువల్‌ రియాలటీ, అగ్‌మెంటెడ్‌ రియాలటీ, ఫైనాన్షియల్‌ లిటరసీ లాంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టు తెస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి  వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) సిలబస్‌ను కూడా రాబోయే రోజుల్లో తెస్తున్నాం. దీని­కో­సం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

గిరికోనల్లో గొప్ప మార్పులు
నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి (పాడేరు ఎమ్మెల్యే) నియోజకవర్గానికి బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కావాలని అడిగింది. వాటిని యుద్ధప్రాతిపదికన వేగంగా మంజూరు చేస్తాం. ఇవాళ గిరిజన ప్రాంతాన్ని చూస్తుంటే గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. గిరిజన ప్రాంతాల్లో గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో  మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయి.

దుబారా కాదు.. రేపటి భవిష్యత్తు కోసమే
గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి? ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి? ఈ 55 నెలల కాలంలో మన ప్రభుత్వ స్కూళ్లు ఎలా మారిపోయాయో చూడాలని కోరుతున్నా. ప్రైవేట్‌ స్కూళ్లు మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి ఇవాళ అవన్నీ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్థితి వచ్చిందా? లేదా? జగన్‌ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడని గిట్టని వారు అంటున్నారు. కానీ మేం ప్రతి పైసా మానవ వనరుల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం.

రేపటి భవిష్యత్తు మీద ప్రతి పైసా ఖర్చు కూడా పెడుతున్నాం. పిల్లలందరికీ నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే వారి జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడు పేదరికం ఆటోమేటిక్‌గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగానే విద్యా దీవెన, విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, సీబీఎస్‌ఈ బోధన తెచ్చాం.

విద్యార్థుల సమక్షంలో బర్త్‌డే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు. విద్యార్థుల నడుమ భారీ కేక్‌ కట్‌ చేసి వారికి తినిపించారు. హ్యాపీ బర్త్‌డే మామయ్యా అంటూ విద్యార్థులు ఆయనకు ఆప్యాయంగా కేక్‌ తినిపించారు. పలువురు ప్రజాప్రతి­నిధులు, అధికారులు సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యా­శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌­చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, ధన­లక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌ గణేష్, ఎమ్మెల్సీలు వరు­దు కల్యాణి, తలశిల రఘురామ్, అనంత­బాబు, కుంభారవిబాబు, విద్యా­శాఖ ప్రిన్సి­­పల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కలెక్టర్‌ సుమిత్‌­కుమార్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement