సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లల్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ ఆన్‌లైన్‌లో తక్కువ ధర లభిస్తున్నా.. అధిక ధరకు కొనుగోలు చేశారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది.
ట్యాబ్ కొనుగోలులో రూ.1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ట్యాబ్ స్పెసిఫికేషన్, వారంటీ తెలియకుండా ఆన్‌లైన్ ధర రూ.11,999 ఉందని.. బల్క్‌లో కొంటే రూ.9 వేలకే వస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ ట్యాబ్స్‌ను రూ.14,250కు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనడం పూర్తిగా అవాస్తవమని ఖండించింది.
పాఠశాల విద్యాశాఖ ఇంకా ఏం తెలిపిందంటే..
► వాస్తవానికి ఆయా కంపెనీలు పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు పెడుతుంటాయని, పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్స్ అందులో ఉండవు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్‌కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని, ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుంది.
► విద్యార్థులకు ప్రధానంగా శాంసంగ్ ఏ7 లైట్ ట్యాబ్‌లు ఇవ్వగా.. దాని బ్యాటరీతో సహా 3 ఏళ్ల వారంటీ, మూడేళ్ల పాటు మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ట్యాబ్‌కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి.
► 256 జీబీ మెమరీ కార్డు గల ట్యాబ్ ధర మార్కెట్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని రూ.17,500 పైనే ఉంది. కానీ.. ప్రభుత్వం టెండర్ ద్వారా రూ.14,250 అంటే ఆన్‌లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీతో అందించాయి.
► ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులకు వారంటీగాని, సాఫ్ట్‌వేర్ సమస్యలకు కొనుగోలుదారే అదనంగా చెల్లించాలి. కానీ.. విద్యార్థులు ట్యాబ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందవచ్చు.
గతేడాది ట్యాబ్స్ కొనుగోలుపైనా ఆరోపణ
► గత సంవత్సరం ఏసర్ ట్యాబ్ ధర రూ.14 వేలు ఉంటే, దాన్ని ప్రభుత్వం రూ.17,500కి కొనుగోలు చేసిందని, దాంతో రూ.2,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు.
► వాస్తవానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేయనేలేదు. ఈ ఏడాది మాత్రమే 1.35 లక్షల ఏసర్ ట్యాబ్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో ఏసర్ ట్యాబ్‌ను రూ.14,200కు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్‌తో గల 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్‌కు మూడేళ్ల గ్యారెంటీ కూడా ఉంది.
► పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లిన తర్వాత, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1.305.74 కోట్లు అయితే.. రూ.2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారముంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment