
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచస్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా వారికి ఆస్థాయి విద్యను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
ఈ ఒప్పందం ప్రకారం ఈటీఎస్ విద్యార్థులకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ ఇవ్వనుంది.ఇంగ్లిష్‌లో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 2021–22 నుంచి 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. 3–5వ తరగతి వరకు ఆంగ్లం మెరుగుదల కోసం చిత్ర నిఘంటువులు ఇస్తోంది. అంతేగాకుండా 6వ తరగతికి బదులుగా (ప్రామాణిక నిబంధనల ప్రకారం) 3వ తరగతి నుంచే ఆంగ్లం కోసం సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది.