పిల్లలకూ ‘టోఫెల్‌’.. సీఎం జగన్‌ మరో వరం | CM YS Jagan another gift for Andhra Pradesh Govt School Students | Sakshi
Sakshi News home page

పిల్లలకూ ‘టోఫెల్‌’.. సీఎం జగన్‌ మరో వరం

Published Tue, Apr 11 2023 2:11 AM | Last Updated on Tue, Apr 11 2023 2:40 PM

CM YS Jagan another gift for Andhra Pradesh Govt School Students - Sakshi

సాక్షి, అమరావతి: ఇంగ్లిష్‌ మీడియం నుంచి బై లింగ్యువల్‌ (ద్వి భాషా) పాఠ్యపుస్తకాల దాకా.. టంచన్‌గా ఫీజుల నుంచి నాణ్యమైన మధ్యాహ్న భోజనం వరకూ ప్రతి అంశంపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ పిల్లలకు అత్యుత్తమ బోధన అందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా మరో కీలక సూచన చేశారు. అంతర్జా­తీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్ది పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్న నాటి నుంచే టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ యాజ్‌ ఏ  ఫారిన్‌ లాంగ్వేజ్‌) పరీక్షకు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామర్ధ్యాలు అలవడేలా తగిన శిక్షణ ఇచ్చి టోఫెల్‌ పరీక్షలకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దీని ద్వారా 3 నుంచి 5 తరగతి విద్యార్థులకు ప్రైమరీ స్థాయిలో, 6 నుంచి 9 తరగతుల వారికి జూనియర్‌ స్థాయిలో టోఫెల్‌ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ప్రైమరీ స్థాయిలో వినడం, చదవడంలో నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. జూనియర్‌ స్థాయిలో వీటికి అదనంగా మాట్లాడటంలో నైపుణ్యాలను కూడా పరీక్షిస్తారు.

ఈ పరీక్షల కోసం విద్యార్థులు, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ – కంటెంట్‌ను రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. విద్యార్ధుల చదువులకు అన్ని దశల్లో అండగా ఉంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత విద్యవరకు ఎక్కడా చదువులు ఆర్థికంగా భారం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.

ఏ ఒక్క విద్యార్థీ, ఏ కారణంతోనూ చదువులకు దూరం కాకుండా, డ్రాపౌట్లు అనే ప్రసక్తే లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో విద్యాశాఖను సమన్వయం చేశామన్నారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, టీచర్లు వారితో మాట్లాడి బడికి పంపేలా పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
 
నిరంతరం ట్రాకింగ్‌ 
విద్యార్థులు ప్రతి రోజూ తరగతులకు హాజరై అభ్యసన ప్రక్రియ అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేలా చూడడం, నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా బోధనాభ్యసన ప్రక్రియలను ట్రాకింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది. దీన్ని మరింత  సమర్థంగా వినియోగించుకోవాలి. పిల్లలు పాఠశాలలకు గైర్హాజరైన పక్షంలో తల్లిదండ్రులకు వెంటనే మెసేజ్‌ వెళుతోంది. దీంతో తమ పిల్లలు సక్రమంగా స్కూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోగలుగుతున్నారు.

వలంటీర్‌ నుంచి సచివాలయ సిబ్బంది, టీచర్లు తల్లిదండ్రులను కలుసుకుంటూ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రతి ఒక్క విద్యార్థికీ నాణ్యమైన చదువులు అందేలా ఎక్కడా రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక స్థోమత లేనందున పిల్లలను చదించుకోలేకపోతున్నామనే పరిస్థితి తలెత్తకుండా అర్హత కలిగిన ప్రతి తల్లికీ పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడి అందిస్తున్నాం.

ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడిని వర్తింపచేశాం. ఆ తర్వాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నాం. తల్లిదండ్రులపై నయాపైసా కూడా ఫీజుల భారం లేకుండా ప్రభుత్వమే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తోంది. విద్యార్ధుల వసతి, రవాణా, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20వేల వరకు ఇస్తున్నాం. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రతి విద్యార్ధికీ ఈ తోడ్పాటు అందేలా ట్రాక్‌ చేస్తున్నాం. డ్రాపౌట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థంగా పర్యవేక్షణ కొనసాగించాలి’ అని సమీక్షలో సీఎం జగన్‌ సూచించారు.

విద్యాకానుక కిట్లు..
జగనన్న విద్యాకానుక 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని వస్తువులను ముందుగానే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించగా మే 15 నాటికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

నైపుణ్యాలు పెంపొందించేలా సబ్జెక్టు టీచర్లు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మూడో తరగతి నుంచే అలవడాల్సిన నైపుణ్యాలు, సామరŠాధ్యలను మెరుగుపర్చేందుకు సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తెచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. దీనివల్ల పాఠశాల దశనుంచే పిల్లలకు ప్రతి సబ్జెక్టులో పట్టు లభించి చక్కటి పునాది ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా సబ్జెక్టు టీచర్లకు మెరుగైన బోధన పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సుల నిర్వహణకు అధికారులు ప్రతిపాదించగా సీఎం అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేలా కోర్సు ఉంటుందని, వచ్చే రెండేళ్ల పాటు  సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందని అధికారులు వివరించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణ  తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా బోధనా నైపుణ్యాలు మరింత మెరుగుపడి పిల్లలకు ఎంతో ప్రయోజనం  చేకూరుతుందని, అత్యున్నత ప్రమాణాలు సాధించగలుగుతామని సీఎం పేర్కొన్నారు.

ప్రతి పాఠశాలలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని ఆదేశించారు. ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాటే రాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యాబోధనకు సంబంధించి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్‌ నాటికి నాడు – నేడు తొలిదశ పూర్తైన స్కూళ్లలో తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తిస్థాయిలో చేయాలన్నారు. ఇప్పటికే వెయ్యి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్‌ అయ్యాయని, మిగిలిన వాటికి కూడా అఫిలియేషన్‌ పొందేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ట్యాబ్‌లకు తక్షణమే మరమ్మతులు
8వ తరగతి  విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, వినియోగస్తున్న తీరుపై సీఎం సమీక్షించి కొన్ని సూచనలు జారీచేశారు. ట్యాబ్‌లకు మరమ్మతులు అవసరమైతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాబ్‌లకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబరును స్కూల్‌లో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్‌వోపీ రూపొందించి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్య తలెత్తితే రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నట్లు వివరించారు.

ప్రశాంతంగా టెన్త్‌ పరీక్షలు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం ద్వారా పదో తరగతి పరీక్షలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా లీకేజీలు, మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సజావుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్‌ జోన్స్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ ఇవ్వడం ద్వారా లీకేజీలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకోవడంతో సజావుగా ముగిశాయన్నారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసులు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్‌ దీవాన్‌రెడ్డి, నాడు – నేడు టెక్నికల్‌ డైరెక్టర్‌ మనోహర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

స్కూల్‌ పిల్లలకు ‘టోఫెల్‌’ పరీక్షలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామరŠాధ్యలు అలవడేలా తగిన శిక్షణ ఇచ్చి టోఫెల్‌ పరీక్షలకు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 3 నుంచి 5 తరగతి ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ ప్రైమరీ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ అందించాలన్నారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మొత్తం మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష ఉంటుంది. జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ – కంటెంట్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement