Andhra Pradesh: 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు | Tabs for students Approval in Cabinet meeting chaired by YS Jagan | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు

Published Thu, Sep 8 2022 3:17 AM | Last Updated on Thu, Sep 8 2022 3:13 PM

Tabs for students Approval in Cabinet meeting chaired by YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,72,472 మంది విద్యార్థులకు రూ.606.18 కోట్లతో ట్యాబ్‌లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే 50,194 మంది ఉపాధ్యాయులకు సైతం రూ.64.46 కోట్లతో ట్యాబ్‌ల పంపిణీకి పచ్చ జెండా ఊపింది. ఇందుకు సుమారు రూ.670.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

నవంబర్‌లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ప్రతి ట్యాబ్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, అదనంగా 64 జీబీ మెమొరీ కార్డ్, మూడేళ్ల వారంటీ ఇవ్వనున్నారు. మార్కెట్‌లో రూ.16,446 విలువున్న ట్యాబ్‌ను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.12,843కే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మొత్తంగా రూ.187.84 కోట్లు ఆదా అవుతోంది.

ట్యాబ్‌తో పాటు రూ.24 వేల విలువైన బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేసి ఇవ్వనుంది. మొత్తంగా ఒక్కో విద్యార్థికి రూ.36,843 లబ్ధి కల్పించనుంది. తద్వారా ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025లో పదో తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ విధానంలో రాయాలన్న లక్ష్యానికి అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో సమావేశమైనమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. 

22న వైఎస్సార్‌ చేయూత 
► ఈ నెల 22వ తేదీన వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడతలో భాగంగా రాష్ట్రంలోని సుమారు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,700 కోట్లు మొత్తాన్ని అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు.. 23వ తేదీ నుంచి 29 వరకు మండల స్థాయిలో మహిళా చేయూత పండుగ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి ఎమ్మెల్యే స్వయంగా ఈ కార్యక్రమాలకు హాజరై మహిళలకు స్వయంగా చెక్కులు అందజేస్తారు. 
► ఈ పథకం ద్వారా మహిళా సాధికారత, సంక్షేమమే లక్ష్యంగా 45 – 60 సంవత్సరాల మధ్య వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఏటా ప్రభుత్వం రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు విడతల్లో రూ.9,179.67 కోట్లు మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. మూడో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 22వ తేదీన ప్రారంభిస్తారు. 

గ్రేటర్‌ విశాఖ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం 
► పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ విశాఖ పరిధిలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్ల నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఎంఏవై– వైఎస్సార్‌ అర్బన్‌ హౌసింగ్‌ కింద విశాఖపట్నంలో ఇళ్ల కేటాయింపుల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలు లబ్ధి చేకూరనుంది. 
► ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో తాగునీటి సరఫరాకు సంబందించి రూ.8,040 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించి నాబార్డు ద్వారా రూ.4,020 కోట్లు రుణ సదుపాయం కోసం ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
► గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని, 
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరును ఆమోదించింది.

ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు పెద్దపీట
► ప్రతి ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
► విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు చట్టాల సవరణకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదన బిల్లుకు, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియమాకంలో నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ఖచ్చితంగా పాసవ్వాలన్న నిబంధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థల్లో నాణ్యతను మెరుగు పరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
► నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం. కొత్తగా ఏర్పాటు కానున్న డిగ్రీ కళాశాలలో 24 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, ఆవుట్‌ సోర్సింగ్‌ విధానంలో మరో ఆరుగురు బోధనేతర సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది.
► పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 80 మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, ఆరుగురు రెగ్యులర్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, మరో 48 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించడానికి అనుమతి.
► ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్‌ విధానంలో 25 మంది బోధనా సిబ్బంది, ఆరుగురు బోధనేతర సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియామకానికి మంత్రివర్గం ఆమోదం.
► రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో వివిధ కేడర్లలో 85 అదనపు పోస్టుల మంజూరు.
► పటిష్టమైన నిర్వహణ, పర్యవేక్షణ కోసం మున్సిపల్‌ స్కూళ్ల పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
► ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో స్టాఫింగ్‌ పేట్రన్‌ను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి,  రహదారులు– భవనాల శాఖలోని స్టేట్‌ ఆర్కిటెక్ట్‌ విభాగాన్ని బలోపేతం చేస్తూ వివిధ విభాగాల్లో 8 పోస్టుల మంజూరుకు నిర్ణయం.
► గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో హార్టికల్చర్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన
► అమరావతిలో ఫేజ్‌ –1లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు రూ.1,600 కోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ యాక్టు –2104, ఏపీఎంఆర్‌ అండ్‌ యూడీఏ యాక్ట్‌ – 2016లో సవరణలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
► గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ఎర్త్‌ వర్క్‌లకు పరిపాలనా పరమైన అనుమతులకు.. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే పైడిపాలెం ప్రాజెక్టు పరిధిలో పైడిపాలం, కుమరంపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
► శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు ప్రస్తుత పరిధిని పెంచుకోవడానికి అనుమతి. దీని ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ పోర్టు ద్వారా ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నుల కార్గో హేండిల్‌ చేసే సామర్థ్యం ఉంటుంది.
► పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం అవసరమైన రూ.1000 కోట్ల రుణాన్ని ఎస్‌ఐడీబీఐ నుంచి పొందేందుకు ప్రభుత్వం నుంచి బ్యాంక్‌ గ్యారంటీ పొడిగించేందుకు ఆమోదం లభించింది.
► పారిశ్రామికాభివృద్ధి తోడ్పాటులో భాగంగా అనంతపురం జిల్లాలో కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాయితీలు.. ఏపీఐఐసీ, కియా మధ్య జరిగిన ఒప్పందంలో భూమి కేటాయింపులకు సంబంధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలను మినహాయిస్తూ ఆమోదం తెలిపింది.
► తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్‌ బ్రాండ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం ఓబెరాయ్‌ గ్రూపునకు 30.32 ఎకరాల భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement