సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, ప్రోత్సాహ కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు, ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం బోధనతో ఇంగ్లిష్‌లో విద్యార్థులు బాగా రాణిస్తున్నట్లు గణాంకాల సాక్షిగా వెల్లడైంది. పునాది స్థాయి నుంచి నాణ్యమైన బోధన ద్వారా విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫౌండేషనల్ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చారు.
మనబడి నాడు – నేడు ద్వారా చక్కటి వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. తల్లిదండ్రులకు చదువులు భారం కాకుండా జగనన్న విద్యాకానుక ద్వారా ఆదుకుంటున్నారు. గోరుముద్ద ద్వారా రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందజేస్తూ పిల్లల ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. చిక్కీలు, గుడ్లు లాంటి బలవర్థకమైన ఆహారాన్ని సమకూరుస్తున్నారు.
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు బడులు మూతబడ్డ సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్, ఇతర మార్గాల ద్వారాపాఠాలను బోధించేలా చర్యలు తీసుకున్నారు. మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.54,910.88 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో చదువులు గాడిన పడ్డాయి.
ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌తో..
గత ఏడాది డిసెంబర్‌లో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కుల అధారంగా ఇంగ్లీషు, మేథమెటిక్స్‌లో 5, 8, 10 తరగతుల విద్యార్థుల పరిజ్ఞానాన్ని పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది. ఇంగ్లీషు సబ్జెక్టులో మూడు తరగతుల్లోనూ విద్యార్థులు మంచి పురోగతిలో ఉన్నారు. గణితంలో 8, 9 తరగతుల్లో ఒకింత వెనుకబాటు ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఏ, బీ+, బీ గ్రేడుల్లో నిలిచారు. 8, 10వ తరగతుల్లో లెక్కల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.
పదో తరగతి గణితంలో 10 శాతం మందికిపైగా విద్యార్థులు ఏ+ గ్రేడులో నిలిచారు. పల్నాడు, గుంటూరు జిల్లాలు మరింత మెరుగు పడాల్సి ఉంది. ఐదో తరగతి ఇంగ్లీషులో ‘సి’ గ్రేడ్ మినహాయించి ఇతర గ్రేడ్లు సాధించిన వారు 76.16 శాతం మంది ఉండగా 8వ తరగతిలో 73.54 శాతం, 10వ తరగతిలో 79.56 శాతం మంది విద్యార్థులున్నారు. ఇక 5వ తరగతి గణితంలో ‘సి’ కాకుండా ఇతర గ్రేడ్లను 84.24 శాతం మంది సాధించారు.
సామర్థ్యాల మదింపు, స్లిప్ టెస్ట్..
50 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 30 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రకారం కేటాయిస్తారు. మిగిలిన 20 మార్కులకు స్లిప్ టెస్ట్ నిర్వహించారు. గతంలో దీన్ని ఉపాధ్యాయులే నిర్వహించగా ఈదఫా పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ద్వారా 20 మార్కులకు ప్రశ్నపత్రాన్ని రూపొందించి ఆయా స్కూళ్లకు పంపిణీ చేసింది. స్లిప్ టెస్టు మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని విశ్లేషించారు. 19–20 మార్కుల పరిధిని ఏ+ గ్రేడ్‌గా వర్గీకరించారు. 15–18 మార్కుల పరిధిని ఏ గ్రేడ్‌గా, 11–14 మార్కుల పరిధిని బీ+ గ్రేడ్‌గా, 9–10 మార్కుల పరిధిని బీ గ్రేడ్‌గా, 9 కన్నా తక్కువ మార్కులను సీ గ్రేడ్‌గా పరిగణించారు.
ఐదు జిల్లాలు ఇంకాస్త మెరుగుపడాలి..
టెన్త్ విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఇంగ్లీషులో మెరుగు పడాల్సిన ఐదు జిల్లాల్లో పల్నాడు, అల్లూరి, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలున్నాయి. గణితంలో పల్నాడు, గుంటూరు, కాకినాడ, ఏలూరు, అనంతపురం జిల్లాలు వెనుక వరుసలో నిలిచాయి. 8వ తరగతి ఇంగ్లీషులో పల్నాడు, అల్లూరి, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలు, మేథ్స్‌లో గుంటూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి. 5వ తరగతి ఇంగ్లీషులో అల్లూరి, పల్నాడు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, మేథ్స్‌లో కర్నూలు, అల్లూరి, పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు మెరుగు పడాల్సి ఉందని విశ్లేషణలో తేలింది.
మూడున్నరేళ్లలో రూ.54,910.88 కోట్లు
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో విద్యారంగం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.54,910.88 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి నాడు – నేడు, గోరుముద్ద, 4 – 10వ తరగతి చదివే 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్ పాఠ్యాంశాలు, 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు, ఇంగ్లీషు మాధ్యమం, సీబీఎస్‌ఈ విధానం లాంటి కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా విద్యార్ధులకు అందించిన ట్యాబ్‌లు ప్రయోజనకరంగా మారాయి. ఇంటిదగ్గర ఆఫ్‌లైన్లో విద్యార్ధులు పాఠాలు చదువుకొనేందుకు మార్గం సుగమమైంది.
లెక్కలంటే భయం పోగొట్టేలా..
ప్రాథమిక పాఠశాలల నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరింది. సీఎం జగన్ నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులందరికీ ఆంగ్ల మాధ్యమం అందుబాటులో రావడమే కాకుండా నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. డిసెంబర్‌లో జరిగిన ఫార్మేటివ్ పరీక్షల్లో ఆంగ్లం సబ్జెక్టులో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించడమే ఇందుకు తార్కాణం. గణితమంటే భయాన్ని పోగొట్టి మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి న్యూమరసీని పెంపొందించాలి.
ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టారు. గణితం బోధనను నిత్య జీవితానికి అనుసంధానించడం ద్వారా విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టవచ్చు. 8వ తరగతి విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (లిప్) పకడ్బందీగా అమలు చేయాలి. బైజూస్ విజువల్ కంటెంట్ సులభంగా గణిత సమస్యల అవగాహనకు తోడ్పడుతుంది. విద్యార్థులకు అందించే ఫ్లాష్ కార్డ్స్, ప్రాక్టీస్ టెస్టుల ద్వారా గణితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
– మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ హైస్కూలు, సంబేపల్లి, అన్నమయ్య జిల్లా
ధారాళంగా ఇంగ్లిష్.. ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగవుతున్న చదువులు
Published Wed, Jan 18 2023 1:51 AM | Last Updated on Wed, Jan 18 2023 2:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment