English education
-
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్‌లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్‌పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్‌పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్‌లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
‘ఇంగ్లిష్’ ప్రావీణ్య ఉపాధ్యాయులకు అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఉత్తమ ఇంగ్లిష్ బోధనా నైపుణ్యాలు గల ఉపాధ్యాయులను సత్కరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి అదనంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంగ్లిష్‌లో బోధనా నైపుణ్యం గల ఉపాధ్యాయులను ప్రత్యేక కేటగిరీ కింద సత్కరించనుంది. ఇందుకోసం ప్రపంచంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే అతిపెద్ద సంస్థ.. సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్ (సెంటా) సహకారాన్ని తీసుకుంటున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. భారతదేశంలో 80 శాతం ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని అంచనా వేస్తోన్న సెంటా ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తామన్నారు. ఈ నెల 27 వరకు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ చేపడతామని చెప్పారు. 29న ఆన్లైన్లో ప్రావీణ్య పరీక్ష నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఉత్తమ ప్రావీణ్యం గల ఉపాధ్యాయులను టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవార్డులతో సత్కరిస్తామన్నారు. -
ధారాళంగా ఇంగ్లిష్.. ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగవుతున్న చదువులు
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, ప్రోత్సాహ కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు, ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం బోధనతో ఇంగ్లిష్‌లో విద్యార్థులు బాగా రాణిస్తున్నట్లు గణాంకాల సాక్షిగా వెల్లడైంది. పునాది స్థాయి నుంచి నాణ్యమైన బోధన ద్వారా విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫౌండేషనల్ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చారు. మనబడి నాడు – నేడు ద్వారా చక్కటి వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. తల్లిదండ్రులకు చదువులు భారం కాకుండా జగనన్న విద్యాకానుక ద్వారా ఆదుకుంటున్నారు. గోరుముద్ద ద్వారా రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందజేస్తూ పిల్లల ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. చిక్కీలు, గుడ్లు లాంటి బలవర్థకమైన ఆహారాన్ని సమకూరుస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు బడులు మూతబడ్డ సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్, ఇతర మార్గాల ద్వారాపాఠాలను బోధించేలా చర్యలు తీసుకున్నారు. మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.54,910.88 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో చదువులు గాడిన పడ్డాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్తో.. గత ఏడాది డిసెంబర్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కుల అధారంగా ఇంగ్లీషు, మేథమెటిక్స్‌లో 5, 8, 10 తరగతుల విద్యార్థుల పరిజ్ఞానాన్ని పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది. ఇంగ్లీషు సబ్జెక్టులో మూడు తరగతుల్లోనూ విద్యార్థులు మంచి పురోగతిలో ఉన్నారు. గణితంలో 8, 9 తరగతుల్లో ఒకింత వెనుకబాటు ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఏ, బీ+, బీ గ్రేడుల్లో నిలిచారు. 8, 10వ తరగతుల్లో లెక్కల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. పదో తరగతి గణితంలో 10 శాతం మందికిపైగా విద్యార్థులు ఏ+ గ్రేడులో నిలిచారు. పల్నాడు, గుంటూరు జిల్లాలు మరింత మెరుగు పడాల్సి ఉంది. ఐదో తరగతి ఇంగ్లీషులో ‘సి’ గ్రేడ్ మినహాయించి ఇతర గ్రేడ్లు సాధించిన వారు 76.16 శాతం మంది ఉండగా 8వ తరగతిలో 73.54 శాతం, 10వ తరగతిలో 79.56 శాతం మంది విద్యార్థులున్నారు. ఇక 5వ తరగతి గణితంలో ‘సి’ కాకుండా ఇతర గ్రేడ్లను 84.24 శాతం మంది సాధించారు. సామర్థ్యాల మదింపు, స్లిప్ టెస్ట్.. 50 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 30 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రకారం కేటాయిస్తారు. మిగిలిన 20 మార్కులకు స్లిప్ టెస్ట్ నిర్వహించారు. గతంలో దీన్ని ఉపాధ్యాయులే నిర్వహించగా ఈదఫా పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ద్వారా 20 మార్కులకు ప్రశ్నపత్రాన్ని రూపొందించి ఆయా స్కూళ్లకు పంపిణీ చేసింది. స్లిప్ టెస్టు మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని విశ్లేషించారు. 19–20 మార్కుల పరిధిని ఏ+ గ్రేడ్‌గా వర్గీకరించారు. 15–18 మార్కుల పరిధిని ఏ గ్రేడ్‌గా, 11–14 మార్కుల పరిధిని బీ+ గ్రేడ్‌గా, 9–10 మార్కుల పరిధిని బీ గ్రేడ్‌గా, 9 కన్నా తక్కువ మార్కులను సీ గ్రేడ్‌గా పరిగణించారు. ఐదు జిల్లాలు ఇంకాస్త మెరుగుపడాలి.. టెన్త్ విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఇంగ్లీషులో మెరుగు పడాల్సిన ఐదు జిల్లాల్లో పల్నాడు, అల్లూరి, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలున్నాయి. గణితంలో పల్నాడు, గుంటూరు, కాకినాడ, ఏలూరు, అనంతపురం జిల్లాలు వెనుక వరుసలో నిలిచాయి. 8వ తరగతి ఇంగ్లీషులో పల్నాడు, అల్లూరి, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలు, మేథ్స్‌లో గుంటూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి. 5వ తరగతి ఇంగ్లీషులో అల్లూరి, పల్నాడు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, మేథ్స్‌లో కర్నూలు, అల్లూరి, పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు మెరుగు పడాల్సి ఉందని విశ్లేషణలో తేలింది. మూడున్నరేళ్లలో రూ.54,910.88 కోట్లు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో విద్యారంగం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.54,910.88 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి నాడు – నేడు, గోరుముద్ద, 4 – 10వ తరగతి చదివే 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్ పాఠ్యాంశాలు, 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు, ఇంగ్లీషు మాధ్యమం, సీబీఎస్ఈ విధానం లాంటి కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా విద్యార్ధులకు అందించిన ట్యాబ్‌లు ప్రయోజనకరంగా మారాయి. ఇంటిదగ్గర ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు పాఠాలు చదువుకొనేందుకు మార్గం సుగమమైంది. లెక్కలంటే భయం పోగొట్టేలా.. ప్రాథమిక పాఠశాలల నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరింది. సీఎం జగన్ నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులందరికీ ఆంగ్ల మాధ్యమం అందుబాటులో రావడమే కాకుండా నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. డిసెంబర్లో జరిగిన ఫార్మేటివ్ పరీక్షల్లో ఆంగ్లం సబ్జెక్టులో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించడమే ఇందుకు తార్కాణం. గణితమంటే భయాన్ని పోగొట్టి మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి న్యూమరసీని పెంపొందించాలి. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టారు. గణితం బోధనను నిత్య జీవితానికి అనుసంధానించడం ద్వారా విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టవచ్చు. 8వ తరగతి విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) పకడ్బందీగా అమలు చేయాలి. బైజూస్ విజువల్ కంటెంట్ సులభంగా గణిత సమస్యల అవగాహనకు తోడ్పడుతుంది. విద్యార్థులకు అందించే ఫ్లాష్ కార్డ్స్, ప్రాక్టీస్ టెస్టుల ద్వారా గణితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. – మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ హైస్కూలు, సంబేపల్లి, అన్నమయ్య జిల్లా -
YSR Pre Primary Schools: బాల బడికి సొంత ఒడి
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు’గా మార్చి.. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆంగ్ల విద్యనూ అందిస్తోంది. ఈ ‘బాల బడులు’ కొత్త రూపు సంతరించుకుంటుండటంతో చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా అక్షరాలు దిద్దుకోవడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది. – కర్నూలు (రాజ్‌విహార్) రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 8,047 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 4,706 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.14 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో రూ.10.20 లక్షలతో భవన నిర్మాణ పనులు, రూ.2.80 లక్షలతో విద్యుత్, నీటి సౌకర్యం, ఫర్నిచర్, రూ.99 వేలతో టాయిలెట్లు, ఇంటర్నల్ పనులు చేయనున్నారు. అలాగే 3,341 కేంద్రాలను ఆధునికీకరిస్తారు. వీటిలో భవనాల అప్‌గ్రేడేషన్‌తో పాటు మౌలిక సదుపాయాలు, విద్యాబోధనకు అవసరమైన వసతులు కల్పిస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో కేంద్రానికి రూ.50 వేల నుంచి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. పనుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థకు.. అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే పనులను గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యతపై ప్రశ్నించేందుకు వీలుగా బాలల తల్లులనూ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ప్రతి అంగన్వాడీకి ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేస్తోంది. కన్వీనర్‌గా సూపర్వైజర్, సభ్యులుగా అంగన్వాడీ టీచర్, గ్రామ/వార్డు మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసున్న చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. ఈ కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి.. ఇద్దరికి చెక్ పవర్ ఇస్తారు. వీరి ద్వారానే అవసరమైన నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రారంభమైన ఆంగ్ల బోధన అంగన్వాడీల్లో 3నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచే ఇంగ్లిష్ బోధిస్తున్నారు. పిల్లల్లో ఆసక్తి పెంచేలా ఆట వస్తువులు, బొమ్మలతో చదువు నేర్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ రూపొందించడంతో పాటు సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3–6 ఏళ్ల మధ్య వయసున్న 10,88,461 మంది చిన్నారులు ఏబీసీడీలు దిద్దుతున్నారు. చిన్నారుల్లో నూతనోత్తేజం ఐదేళ్లలోపు చిన్నారులకు గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ సమయంలో విద్యాపరమైన, మంచి విషయాలను చక్కగా గ్రహిస్తారు. అందుకే వాళ్లకు నాణ్యమైన ఆహారంతో పాటు మంచి విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. అందుకు తగ్గట్టుగా సిబ్బందికి అందరికీ శిక్షణ ఇచ్చాం. – కృతికా శుక్లా, స్టేట్ డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆడిస్తూ.. పాడిస్తూ.. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారిని ఆడిస్తూ, పాడిస్తూ విద్య నేర్పిస్తున్నాం. మాకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే పిల్లలకు ఇంగ్లిష్ నేర్పిస్తున్నాం. పిల్లల్లో ఆసక్తి కలిగేలా వస్తువులు, బొమ్మలతో బోధిస్తున్నాం. – శ్రీదేవి, అంగన్వాడీ టీచర్, కర్నూలు భవనాలు నిర్మిస్తే కొత్త లుక్ అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దీనివల్ల సౌకర్యాలు ఏర్పడి కొత్త లుక్ వస్తుంది. అలాగే ఇంగ్లిష్ బోధించడం వల్ల పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుంది. – తరంగిణి, చిన్నారి తల్లి, కర్నూలు -
ఆంగ్ల బోధనపై ‘కన్నా’ వ్యాఖ్యలను ఖండించిన సీపీఐ
సాక్షి, అమరావతి: ఆంగ్లభాషలో బోధన..మత మార్పిడిలను ప్రోత్సహించేదిగా ఉందన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత మార్పిడిలను ప్రోత్సహించేదైతే మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారని ప్రశ్నించారు. తెలుగుతో సమాంతరంగా ఆంగ్లభాషలో బోధనను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. చదవండి: అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్ -
‘ఆంగ్లం’ బోధించలేం!
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ విద్య ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఓ పక్క కృషి చేస్తుంటే.. మరో పక్క ఉన్న సక్సెస్ స్కూల్లో ఆంగ్లం బోధించలేమంటూ ఉపాధ్యాయులు తేల్చిచెబుతున్నారు. డబుల్ ప్యాట్రన్ లేకపోయినా ఇన్నాళ్లూ పాఠశాలను నెట్టుకొచ్చాం.. ఇక మా వల్లకాదని చేతులెత్తేశారు ఏదుట్ల పాఠశాల ఉపాధ్యాయులు. - గోపాల్పేట మండలంలో రెండు సక్సెస్ స్కూళ్లు ఉండగా ఏదుట్ల హైస్కూల్లో ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం అడ్మిషన్లు తీసుకోవడానికి ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతు న్న ఆంగ్ల బోధనను ఉన్నపలంగా నిలిపివేస్తే మా పిల్లల భవిష్యత్ ఏం కావాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం సక్సెస్ స్కూ ల్లో తె లుగు, ఇంగ్లిష్ మీడియంలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఇంగ్లిష్‌లోనే 122 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్తగా 6వ తరగతిలో ప్రవేశం కోసం 54 మంది విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇందులో స గం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చేరడానికే ఇష్టపడుతున్నారు. అ యితే ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తే తమపై అదనపు భారం పడుతుందని ఉపాధ్యాయులు ఇందుకు ఇష్టపడడం లేదు. వచ్చిన విద్యార్థులను తె లుగు మీడియంలో చేర్చుకోవడానికి సిద్ధమవగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. మేం ఒప్పుకోం : గ్రామస్తులు ఎప్పటిలాగే సక్సెస్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాల్సిందేనని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ నారాయణయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పలుమార్లు ఉపాధ్యాయులను నిలదీశారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులను ఎందుకు చేర్చుకోవడం లేదని జీహెచ్ఎం సీఎస్ రాజును ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యేతోపాటు ఎంఈఓలకు వినతిపత్రాలు కూడా అందించారు. ఇన్నాళ్లు బాగానే బోధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మాలాంటి పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో వేలల్లో ఫీజులు చెల్లించి ఇంగ్లీష్ చదుకోలేరని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు తమపై అదనపు భారం పడుతుందని ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి కనబరచడంలేదు. డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులుకాని, విద్యావలంటీర్లను గాని ఏర్పాటు చేస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి సాధ్యమవుతుంది. - రాజు, జీహెచ్ఎం, ఏదుట్ల పాఠశాల నా పరిధిలో లేదు ఏదుట్ల సెక్సెస్ హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగాలంటే ఉపాధ్యాయులు అవసరం. వారి నియామకం నా పరిధిలో లేదు. గ్రామస్తులు సహకరించి ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించడానికి ఆర్థికంగా సహకరిస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగే వీలుంది. - సరస్వతీబాయి, ఎంఈఓ, గోపాల్పేట -
నాడు మూతబడిన పాఠశాలలోనే.. నేడు ఇంగ్లిష్ విద్య
ఒంటిమామిడిపెల్లిలో పునఃప్రారంభించిన కడియం ఒంటిమామిడిపెల్లి (వర్ధన్నపేట టౌన్): ఒంటిమామిడిపెల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపెల్లి గ్రామంలో ఐదేళ్ల క్రితం విద్యార్థులు లేక మూతపడ్డ ప్రాథమికోన్నత పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా పునఃప్రారంభించుకోవాలనే గ్రామస్తుల కోరిక మేరకు డిప్యూటీ సీఎం సోమవారం పాఠశాలను ప్రారంభించారు. బాలవికాస ప్రతినిధి తిరుపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి ఐక్యతగా పనిచేయడం అభినందనీయమని అన్నారు. గ్రామస్తులంతా ఏకమై ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 320 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడం మంచి పరిణామమన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలని, ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయులు ఏడుగురిని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధుల మంజూరు, ఆరు నెలల్లోనే రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ జీఓ కాపీని తీసుకుని తాను, ఎమ్మెల్యే అరూరి రమేష్ తరగతి గదులు ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అన్నివిధాలా సహాయ సహకారాలందించి గంగదేవిపల్లి గ్రామానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. -
ఆంగ్ల విద్యలో ప్రగతి అభినందనీయం
గీసుకొండ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘వంద రోజుల్లో ఆంగ్ల విద్య’ అభినందనీయమని డీఈఓ విజయ్‌కుమార్ అన్నారు. కొమ్మా ల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల ఆంగ్ల విద్య పురోగతిని శుక్రవారం ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రాథమిక స్థారుులో ఎల్టా మాడ్యుల్ ప్రకారం ఉపాధ్యాయులు ఆంగ్ల విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. దీంతో భాషపై వారు పట్టు సాధిస్తారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక రాయితీలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జనార్దన్‌రెడ్డి, ఎల్టా అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి, పోగ్రాం ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, ఆర్పీలు రవికుమార్, వంశీమోహన్, లక్ష్మణ్, సత్యం, 13 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.