
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఉత్తమ ఇంగ్లిష్ బోధనా నైపుణ్యాలు గల ఉపాధ్యాయులను సత్కరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి అదనంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంగ్లిష్‌లో బోధనా నైపుణ్యం గల ఉపాధ్యాయులను ప్రత్యేక కేటగిరీ కింద సత్కరించనుంది.
ఇందుకోసం ప్రపంచంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే అతిపెద్ద సంస్థ.. సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్ (సెంటా) సహకారాన్ని తీసుకుంటున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. భారతదేశంలో 80 శాతం ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని అంచనా వేస్తోన్న సెంటా ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తామన్నారు.
ఈ నెల 27 వరకు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ చేపడతామని చెప్పారు. 29న ఆన్‌లైన్‌లో ప్రావీణ్య పరీక్ష నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఉత్తమ ప్రావీణ్యం గల ఉపాధ్యాయులను టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవార్డులతో సత్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment