సీబీఎస్‌ఈకీ మంగళం! | Chandrababu govt neglected poor students education in AP | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈకీ మంగళం!

Published Sun, Sep 15 2024 5:10 AM | Last Updated on Sun, Sep 15 2024 11:26 AM

Chandrababu govt neglected poor students education in AP

పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు

తాజాగా ఈ పరీక్షలు రద్దుచేస్తూ నిర్ణయం

ఇప్పటికే ఐబీ, టోఫెల్‌ను అటకెక్కించిన కూటమి సర్కార్‌

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తిరోగమనంలో పాఠశాల విద్య

ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ‘ప్రైవేట్‌’కు వలస

విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో ఉపాధ్యాయులకు స్థానచలనం 

గ్రామీణ ప్రాంత స్కూళ్లు మూతబడే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం

మాజీ సీఎం జగన్‌పై కోపాన్ని పేద పిల్లలపై చూపుతున్న సర్కారు 

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ‘ప్రైవేటు’కు మేలు చేసేలా ప్రభుత్వ చర్యలు

ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన 

బకాయిలకు ఎసరు.. అమ్మకు వందనం ఊసూలేదు

సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్‌.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్‌ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవి­ష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్ర­బాబు ప్రభుత్వం వాటిని ఒక్కొ­క్క­టిగా అటకెక్కి­స్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవి­ష్యత్తు ఉజ్వలంగా ఉండా­లన్న సత్సంకల్పంతో విద్యా­రంగంలో జగన్‌ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్ర­బాబు సర్కారు పేద విద్యార్థుల భవి­ష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్‌ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నే­షనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్‌ఈ బోధనకూ తూచ్‌ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.

విద్యా సంవత్సరంలో మధ్యలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్‌ జగన్‌ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్‌ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 

అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన ‘టోఫెల్‌’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్‌లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్‌ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్‌ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్‌ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.

జగన్‌పై కోపంతోనే విద్యపై అక్కసు..
‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. 

ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్‌ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌పై కోపంతో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.

విద్యా సంస్కరణలకు జగన్‌ శ్రీకారం..
పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్‌ జగన్‌ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్‌ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్‌ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్‌ మీడియం అమలుచేశారు. 



విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్‌’ను సిలబస్‌లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్‌ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.

అంధకారంలోకి 84 వేల సీబీఎస్‌ఈ విద్యార్థుల భవిష్యత్తు..
నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్‌ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్‌ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. 

అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో ట్యాబ్స్‌ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్‌–పెన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.


‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..
ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్‌ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్‌ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్‌ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 

2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్‌’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్‌ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

తల్లికి వందనం ఎగనామం!
మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్‌ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.

నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్‌’ రద్దు..
ఇక పదో తరగతి, ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్‌ సర్కారు టోఫెల్‌ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్‌ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్‌ జూనియర్‌ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. 

నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్‌ జూనియర్‌ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్‌ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్‌ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.

ఐబీ శిక్షణకూ అదే గతి..
‘టోఫెల్‌ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని  ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. 

దీంతో 2025 జూన్‌ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement