నాడు 87 శాతం హామీలు.. వంద రోజుల్లోనే అమలు | YS Jagan Mohan Reddy who stood as a role model for the country | Sakshi
Sakshi News home page

నాడు 87 శాతం హామీలు.. వంద రోజుల్లోనే అమలు

Published Fri, Sep 20 2024 4:44 AM | Last Updated on Fri, Sep 20 2024 4:46 AM

YS Jagan Mohan Reddy who stood as a role model for the country

నాడు తొలి కేబినెట్‌లోనే అనేక నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించిన జననేత 

అప్పట్లో ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి 

2019 అక్టోబరులో వైఎస్సార్‌ రైతుభరోసా అమలు.. 

అదే నెల 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా.. 

అన్ని శాఖల్లోని పారిశుధ్య కార్మీకుల వేతనాలు రూ.18 వేలకు పెంపు.. అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తల జీతాలు కూడా.. 

డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్స్‌కు రూ.10 వేలు గౌరవ వేతనం.. ఖజానా ఖాళీగా ఉందని ఏనాడూ సాకులు చెప్పలేదు 

ఇదీ హామీలపట్ల వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే 87 శాతం హామీలను అమలుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయిన చంద్రబాబు సర్కారు... అప్పులు కూడా పుట్టకుండా తరువాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా చేసేసింది. 

అయినా సరే.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి తొలి కేబినెట్‌ సమావేశంలోనే పలు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ప్రారంభించారు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీల అమలును ఏనాడూ వాయిదా వేయకుండా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకుని వాటి అమలుకు నిరంతరం తపనపడ్డారు. 

తొలి కేబినెట్‌ భేటీలోనే అనేక హామీలకు ఆమోదం
నిజానికి.. 2019 జూన్‌ 10న జరిగిన తొలి కేబినెట్‌ భేటీలోనే పలు హామీలు అమలుకు ఆమోదముద్ర వేశారు. నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వైఎస్‌ జగన్‌ హామీల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. వంద రోజుల పాలనలోనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సామాజికన్యాయం, మహిళా సాధికారత, పాలనలో పారదర్శకతకు పలు చారిత్రక చట్టాలను చేశారు. ఇందులో సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇలా హామీల అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ తొలి వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందారు. 

ఇదీ హామీలపట్ల వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధి. అలాగే, ప్రజల వద్దకే పాలన, పథకాలు నేరుగా లబ్ధిదారులకే తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం తొలి వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి  2019 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి పారదర్శకంగా భర్తీచేశారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల సేవకు వలంటీర్లను నియమించారు.

తొలి వంద రోజుల్లో జగన్‌ అమలు చేసిన హామీలివే..
⇒ వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలకు.. డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10వేలకు పెన్షన్‌ను పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని జూన్‌ 2019కి సంబంధించిన పింఛన్‌ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేశారు.
⇒ ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి.
⇒ అక్టోబరులో వైఎస్సార్‌ రైతుభరోసా అమలు.. 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం.
⇒ అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం..
⇒ అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేలకు పెంపు.
⇒ అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలూ పెంపు.
⇒ డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్స్‌కు రూ.10 వేలు గౌరవ వేతనం
⇒ మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్‌.
⇒ వచ్చే నాలుగేళ్లలో వైఎస్సార్‌ పేరుతో 25 లక్షల ఇళ్లు నిర్మాణం.
⇒ జనవరి 26 నుంచి తెల్లకార్డు ఉన్న ప్రతీ తల్లికి అమ్మఒడి కింద రూ.15 వేలు.
⇒ సెప్టెంబరు 1 నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతీ గడపకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సరుకులతో రేషన్‌ పంపిణీ.
⇒ రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు.. అన్ని సౌకర్యాల కల్పన.
⇒ నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు.
⇒ ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు అమలు. 
⇒ జూలై 8న వైఎస్సార్‌ పుట్టిన రోజు రైతు దినోత్సవంగా నిర్వహణ.
⇒ రూ.3,000 కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి.
⇒ రైతులకు ఉచితంగా బోర్లు.. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోకి 200 రిగ్‌ల కొనుగోలు.
⇒ సున్నా వడ్డీ అమలుకు శ్రీకారం.
⇒ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.
⇒ అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు.
⇒ ఈ ఏడాది ఇళ్ల జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు.
⇒ ఆస్పత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు.
⇒ 108, 104 వాహనాల ఆధునికీకరణ
⇒ తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత.
⇒ టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు.
⇒ ప్రైవేట్‌ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు.
⇒ భూముల రీసర్వే–శాశ్వత హక్కుల కల్పనకు చట్టం.
⇒ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం.
⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.
⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.
⇒ ప్రభుత్వ నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టం.
⇒ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే చట్టం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement