తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్‌తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే.
స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్‌గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్‌ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది.
ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి.
ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి.
భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది.
దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్‌లోనే ఉంటారు.
ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు.
అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి.
ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్‌లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ
రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్‌లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు.
ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్‌కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి.
ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి.
విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు.
శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం.
విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్‌లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు.
ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
విశ్వవిజేతల కార్ఖానా!
Published Sat, Feb 17 2024 11:57 PM | Last Updated on Sun, Feb 18 2024 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment