నాడు మూతబడిన పాఠశాలలోనే.. నేడు ఇంగ్లిష్ విద్య
ఒంటిమామిడిపెల్లిలో పునఃప్రారంభించిన కడియం
ఒంటిమామిడిపెల్లి (వర్ధన్నపేట టౌన్): ఒంటిమామిడిపెల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపెల్లి గ్రామంలో ఐదేళ్ల క్రితం విద్యార్థులు లేక మూతపడ్డ ప్రాథమికోన్నత పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా పునఃప్రారంభించుకోవాలనే గ్రామస్తుల కోరిక మేరకు డిప్యూటీ సీఎం సోమవారం పాఠశాలను ప్రారంభించారు. బాలవికాస ప్రతినిధి తిరుపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి ఐక్యతగా పనిచేయడం అభినందనీయమని అన్నారు.
గ్రామస్తులంతా ఏకమై ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 320 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడం మంచి పరిణామమన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలని, ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయులు ఏడుగురిని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధుల మంజూరు, ఆరు నెలల్లోనే రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ జీఓ కాపీని తీసుకుని తాను, ఎమ్మెల్యే అరూరి రమేష్ తరగతి గదులు ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అన్నివిధాలా సహాయ సహకారాలందించి గంగదేవిపల్లి గ్రామానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు.