స్కూల్‌ చుట్టూ చీరలు.. సంగ‌తేంటంటే? | Husnabad Govt School used sarees as a wall in Telangana | Sakshi
Sakshi News home page

స్కూల్‌ చుట్టూ చీరలు.. సంగ‌తేంటి సారూ!

Published Fri, Feb 7 2025 7:30 PM | Last Updated on Fri, Feb 7 2025 7:53 PM

Husnabad Govt School used sarees as a wall in Telangana

అది ప్రభుత్వ పాఠశాల.. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రహదారికి ఆనుకుని ఉండటంతో దుమ్మూధూళి అధికంగా వస్తోంది. ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు (Sarees) కట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad) మండలం జిల్లెలగడ్డ (Jilleligada) గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. దుమ్మూధూళి తరగతి గదులలోపలికి వచ్చి విద్యా బోధనకు ఇబ్బంది కలిగిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. చేసేదిలేక చీరలను అడ్డుగా కట్టించామన్నారు. కలెక్టర్‌ స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.     
– హుస్నాబాద్‌ రూరల్‌  

చక్కని ఉత్తీర్ణతకు చిరుతిండి..  
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టెన్త్‌ విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఇందులో మిల్లెట్స్, పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, మొలకలు, అరటిపండ్లు, ఉడికించిన పల్లీలు ఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గట్టెపెల్లి జెడ్పీ హైసూ్కల్‌ పదో తరగతి విద్యార్థుల స్టడీఅవర్స్‌లో స్నాక్స్‌ అందిస్తూ, పిల్లల సందేహాలు నివృత్తి చేస్తూ.. హెచ్‌ఎం అన్నపూర్ణ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.  
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి  

రేషన్‌ కోసం... 
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌ కాలనీలోని ఒక రేషన్‌ దుకాణాన్ని తెరవకముందే మధ్యాహ్నం 3 గంటల నుంచి లబ్ధిదారులు బారులు తీరారు. ఇందుకోసం వరుసలో సంచులు, బండరాళ్లను పెట్టి డీలర్‌ రాక కోసం నిరీక్షించడం కనిపించింది. 
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్‌

ఎరువు కష్టాలు రైతులకే ఎరుక 
సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో సహకార సంఘాల ఎదు ట రైతులు బారులు తీరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారిలా.. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

ఆశలు రాలిన చోట కొత్త చిగురు
పంట రాని మామిడి చెట్లను కాండం వరకు కొట్టేసినా.. చిగురిస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచెలకలో ఏళ్ల క్రితం నాటిన మామిడి తోటలో చెట్లకు కాలం చెల్లింది. పంట రాకపోవడంతో రైతు చెట్లను కాండం వరకు కొట్టేసి అధికారుల సూచనలతో కొన్ని రసాయనాలు పూశాడు. దీంతో ఇటీవల మళ్లీ కాండం పక్క నుంచి కొత్తగా చిగుళ్లు వస్తుండడంతో.. రెండు, మూడేళ్ల తర్వాత పంట మొదలయ్యే అవకాశముందని ఆశిస్తున్నారు.    
– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సాక్షి, ఖమ్మం

విస్తృతంగా పొగాకు సాగు
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కొందరు రైతులు పొగాకు పంట సాగుపై దృష్టి సారించారు. గతంలో ఒకరిద్దరు రైతులు సాగు చేయగా.. ప్రస్తుతం 50మందికి పైగానే ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులోని ఐటీసీ సంస్థ వారు రైతులకు నారు సరఫరా చేస్తున్నారు. రైతులు పంట పండించి ఆ కంపెనీకే దిగుబడిని విక్రయిస్తున్నారు. అర్వపల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు పంట సాగవుతోంది. ఈ పంటకు కోతులు, అడవి పందుల బెడద లేదు.

చ‌ద‌వండి: భ‌ద్రాద్రి సీతారామచంద్ర స్వామికి కాసుల పంట      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement