
కలెక్టర్ ఆదేశంతో ఆర్డీవో దర్యాప్తు
కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించరాదన్న నిబంధనలున్నా సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కంగ్టి మండలం గిరిజన బాలుర రెసిడెన్షియల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థులతో అల్పాహారాన్ని వండించిన విషయం గురువారం బయటకు వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ విజయ్‌ను వివరణ కోరగా.. అల్పాహారం తయారీలో విద్యార్థుల సహా యం తీసుకొంటామని స్పష్టం చేశారు.
ఈ విషయం మీడియా ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరడంతో.. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో కళాశాలను సందర్శించి విద్యార్థులు, సిబ్బందిని అడిగి విషయాలు తెలుసు కున్నారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ నజీమోద్దిన్, డీటీ జుబేర్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ తాజోద్దిన్ ఉన్నారు.
వడ వద్దన్నందుకు చితకబాదాడు
కొందుర్గు: కడుపునొప్పిగా ఉందని, వడ తింటే పడటం లేదని చెప్పినా వినకుండా తినాల్సిందేనంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వీపుపై వాతలు తేలేలా కొట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంగా వడ వడ్డించారు. కడుపునొప్పితో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సందీప్ వడ తినడానికి ఇష్టపడలేదు. దీంతో వడ వద్దంటావా అంటూ ప్రిన్సిపల్ మహ్మద్ కుర్షీద్ విద్యార్థి వీపుపై వాతలు వచ్చేలా కర్రతో చితకబాదారు.
అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ హాల్‌లోకి వెళ్లిన ప్రిన్సిపాల్.. అక్కడ విద్యార్థులు కూరగాయల తొక్కలు కింద పడేయడాన్ని గమనించారు. వాటిని తిరిగి ప్లేట్లలో వేయించి విద్యార్థులతోనే తినిపించారు. కాగా, తమ అబ్బాయిని కొట్టిన విషయం తెలుసుకున్న సందీప్ తల్లిదండ్రులు మహేశ్వరి, యాదయ్య ప్రిన్సిపల్‌తో గొడవకు దిగారు. దీంతో తప్పయిందని ఆయన అంగీకరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ఈ విద్యాసంస్థను తనిఖీ చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం.

ఏక్ నిరంజన్
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకు ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని సాలేవాడ ప్రాథమిక పాఠశాలనే నిదర్శనం. ఈ బడిలో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఉదయం 10 గంటలకు పాఠశాలను ‘సాక్షి’ సందర్శించిన సమయంలో కేవలం ఒకే ఒక విద్యార్థి ఉండగా టీచర్ ఆ విద్యార్థికి బోధిస్తుండటం గమనార్హం.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
‘పీఎం ఇంటర్న్‌షిప్’ దరఖాస్తుకు మార్చి 10 గడువు
సాక్షి, హైదరాబాద్: భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (Prime Minister Internship Scheme) కింద మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరిశ్రమల శాఖ సంచాలకుడు జి.మల్సూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు 12 నెలలకు రూ.6 వేలు ఒకేసారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలని, వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ‘పీఎంఇంటర్న్‌షిప్.ఎంసీఏ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment