‘చేతి’కి చిక్కొద్దు!  | CM KCR Fires On Congress Party At Public Meeting | Sakshi
Sakshi News home page

‘చేతి’కి చిక్కొద్దు! 

Published Fri, Nov 17 2023 4:31 AM | Last Updated on Fri, Nov 17 2023 4:31 AM

CM KCR Fires On Congress Party At Public Meeting - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు అతీతంగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని ఒక దరికి తెస్తున్నామని.. ఈ సమయంలో కాంగ్రెస్‌ దుర్మార్గుల చేతికి చిక్కొద్దని, వాళ్లు వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని నాశ నం చేయొద్దనేదే తన బాధ అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.  

50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసిందో.. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చూడాలన్నారు. అభ్య ర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ తీరు ఏమిటో పరిశీలించి ఓటేయాలని కోరారు.కాంగ్రెస్‌ మాటలు నమ్మి ఆగమై ఓటేస్తే.. మన పరిస్థితి కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు మళ్లీ మొదటికి వస్తుందన్నారు. గురువారం ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్‌ రూరల్, నర్సాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. 

58 ఏళ్ల పాటు గోసపడ్డాం.. 
‘‘1956లో భయంకరమైన తప్పు చేసి కళ్లు మూసుకుని తెలంగాణను ఏపీలో కలిపారు. 58 ఏళ్ల పాటు గోసపడ్డాం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగితే 400 మందిని పిట్టల్లా కాల్చిచంపారు. 2004లో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని లబ్ధి పొంది మళ్లీ మోసం చేశారు. తిక్కపుట్టి కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగిన. 36 పార్టీలు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్‌కు గత్యంతరం లేక తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. 

ఒక పంథాలో అభివృద్ధి.. 
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. రైతుల ఆకలిచావులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పంథాలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. వందల రూపాయల్లో ఉన్న పింఛన్‌ను వేల రూపాయలకు తీసుకెళ్లాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీఎస్‌ ఐపాస్, ఐటీ పాలసీలతో దూసుకెళ్లడంతో రాష్ట్ర ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.

గతంలో రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్‌ కేంద్రాలుంటే.. ప్రస్తుతం వాటిని 103కు పెంచాం. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలోనూ లేని అద్భుత పాలసీని తీసుకున్నాం. నీటి తీరువాను రద్దు చేశాం. 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రైతుబంధుతో పెట్టుబడి సమకూర్చుతున్నాం. పంటలనూ కొనుగోలు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబం ఆగం కావద్దని రూ.5లక్షలు రైతుబీమా అందేలా చేశాం. 

ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా? 
కాంగ్రెస్‌ నాయకులు బాధ్యత లేకుండా దళారులు, పైరవీకారుల రాజ్యం కోసం ధరణిని తీసేస్తామంటున్నారు. ధరణితోనే మీ భూములు భద్రంగా ఉన్నాయి. ఇల్లు గడప దాటకుండా, ఏ ఆఫీసుకు పోకుండా మీ దగ్గరికి రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. ధరణి తీసేస్తే లంచాలు, కబ్జాలు, దళారీ వ్యవస్థ, కోర్టుల వివాదాలు పెరుగుతాయి. ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవో ఆలోచించాలి. పీసీసీ అధ్యక్షుడేమో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ వేస్ట్‌.. మూడు గంటల కరెంటు చాలు అంటున్నారు. కరెంటు కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా.. రైతుబంధు కావాల్నా, రాబందులు కావాల్నా.. ప్రజలు చర్చచేసి నిర్ణయించుకోవాలి.  

బీజేపీని చెత్తకుప్పలో పడేయాలి 
ప్రధాని మోదీకి వంద ఉత్తరాలు రాసినా తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీగానీ, ఒక్క నవోదయ స్కూల్‌గానీ ఇవ్వలేదు. తెలంగాణకు ధోకా చేసిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయద్దు. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే. మత పిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్పలో వేయాలి. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. కాంగ్రెస్‌ పార్టీ ఇన్నాళ్లూ మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో వారికోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రెసిడెన్షియల్‌ స్కూల్స్, రెసిడెన్షియల్‌ కాలేజీలను ఏర్పాటు చేశాం. కేసీఆర్‌ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్‌గానే ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

యుద్ధం చేసేవారి చేతిలో కత్తి పెట్టాలి 
మనపరంగా ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలో కత్తి పెడితేనే మనం గెలుస్తాం. కత్తి ఒకరికి ఇచ్చి వేరొకరిని యుద్ధం చేయాలంటే సాధ్యం కాదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిస్తేనే మన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటు వేరే వాళ్లకు వేసి పనిచేయాలంటే ఎట్లా చేస్తాం. ఎన్నికల సమయంలో ఆగమవకుండా మంచి ఏమిటో, చెడు ఏమిటో గుర్తించే వివేచన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 
 
అసైన్డ్‌ భూములపై హక్కులిస్తాం 
పచ్చి అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ నేతలు మొనగాళ్లు. ఎస్సీ, ఎస్టీల పరంపోగు భూములను ప్రభుత్వం గుంజుకుంటుందన్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రాష్ట్రం నుంచి గల్ఫ్‌ వలస వెళ్లిన కార్మీకులకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తాం. 
 
బూతులు కావాలా? భవిష్యత్‌ కావాలా?: హరీశ్‌రావు 
తెలంగాణలో ఎజెండా లేని ప్రతిపక్ష పార్టీలు బూతులు మాట్లాడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రతిపక్షాల బూతులు కావాలా? తెలంగాణకు బీఆర్‌ఎస్‌ సర్కారు అందించే ఉజ్వల భవిష్యత్తు కావాలా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడటం విడ్డూరమని, ప్రజలు ఉద్యమం చేస్తే, కేసీఆర్‌ నిరాహారదీక్ష చేస్తే రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. సోనియాను బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement