పరిగి ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం. తాండూరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వికారాబాద్: ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా ఆగం చేసే పనులు జరుగుతాయని.. ఒక్కసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే ఐదేళ్లపాటు బాధపడాల్సి వస్తుందని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, నడవడికను చూసి ఓటు వేయాలని సూచించారు. రాయి ఏదో, రత్నమేదో గుర్తించాలన్నారు.
నాడు ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 58 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే గోసపడతామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి, మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్లు అరిగోసపడ్డాం. అదే బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. హోరాహోరీ పోరాటం చేసి, కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనబడుతోంది. మేం పేదల గురించి ఆలోచించినం. పింఛన్లను రూ.2వేలకు పెంచుకున్నం.
రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు ఇస్తున్నం. రైతుల పంట మొత్తాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఎవరైనా రైతు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు వస్తున్నాయి. కంటి వెలుగుతో రాష్ట్రంలో మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించినం. గర్భిణులు, బాలింతల కోసం అమ్మ ఒడి వాహనాలు పెట్టాం.
వారివి బాధ్యతలేని మాటలు
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్, దుబారా అంటున్నారు. రైతుబంధు దుబారానా? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటలు కరెంటు వృధా, 3 గంటల కరెంట్ చాలంటున్నారు. వారివి బాధ్యతలేని మాటలు. 3 గంటల కరెంటు కావాలా? 24 గంటలు కావాలా? రైతులు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తివేస్తామంటున్నారు. ధరణి లేకుంటే రైతుబంధు పంపిణీ ఎట్లా? ధరణి స్థానంలో భూమాత తెస్తరంట.. అది భూమాత కాదు.. భూమేత. ధరణిని తీసేయడం రైతులకు జీవన్మరణ సమస్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యం వస్తది.
గొడవల్లేకుండా పాలన సాగించాం
గత కాంగ్రెస్ హయాంలో అన్ని ఘర్షణలే. ఎన్నో అల్లర్లు, కర్ఫ్యూలు చూసినం. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క లొల్లి కూడా లేకుండా ప్రశాంతంగా పాలన సాగింది. హైదరాబాద్‌లో ఒక్క గొడవ జరిగిందా? కర్ఫ్యూ అనే మాటే రాలేదు. ముస్లింలు, హిందువులు నాకు రెండు కళ్లలాంటి వారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణలో సెక్యూలరిజం ఉంటుంది.
కాంగ్రెస్‌కు దిక్కూదివాణం లేదు
కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. ఆ పార్టీకి దిక్కుదివాణం లేదు. 20 సీట్లు కూడా రావు. అందులోనూ 15 మంది సీఎం అభ్యర్థులే. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అది నియోజకవర్గంతోపాటు రాష్ట్ర భవిష్యత్, తలరాతను మార్చుతుంది. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ఆగమైతది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ సభ సందర్భంగా కేసీఆర్ కాసేపు ఉర్దూలో ప్రసంగించారు. ఉమ్మడి పాలమూరు సభల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ కేశవరావు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment