ఒక్కో ఓటునూ ఒడిసిపట్టండి  | CM KCR in teleconference with key leaders of BRS | Sakshi
Sakshi News home page

ఒక్కో ఓటునూ ఒడిసిపట్టండి 

Published Sun, Nov 26 2023 4:37 AM | Last Updated on Sun, Nov 26 2023 4:38 AM

CM KCR in teleconference with key leaders of BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్‌ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆదేశించారు. పార్టీ కేడర్‌ ప్రతీ గడపకూ వెళ్లాలని, బీఆర్‌ఎస్‌కే ఓటేసేలా ప్రయత్నం చేయా లని సూచించారు. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులపై కేసీఆర్‌ శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, ఇన్‌చార్జులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలువురితో ఫోన్లలో మాట్లాడారు. 

సభ రద్దవడంతో.. 
శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరగాల్సిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో.. కేసీఆర్‌ రోజంతా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమీక్షలు నిర్వహించారు. సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు, వివిధ మార్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించారు. నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల పనితీరు, ఇతర పార్టీల స్థితిగతులపై పార్టీ నేతలతో చర్చించారు. గెలుపు అవకాశాల ఆధారంగా నియోజకవర్గాలను కేటగిరీలుగా వర్గీకరించి, మెరుగుపడాల్సిన నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు దిశానిర్దేశం చేశారు.

తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులకు ప్రత్యేక సూచనలు చేశారు. పార్టీ గెలుపోటములపై మౌఖిక ప్రచారాలతో గందరగోళానికి గురికావద్దని నేతలకు కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాజా సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. మూడోసారీ అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. 

క్షేత్రస్థాయి పరిస్థితిపై పోస్ట్‌మార్టం 
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌ 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. పరేడ్‌ మైదానంలో సభ రద్దయిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మేడ్చల్‌ లేక మల్కాజ్‌గిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించాలని శనివారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్షాల పోల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.  

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు చేస్తున్న విమర్శలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరుపైనా సూచనలిచ్చారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుల రోడ్‌షోలకు వస్తున్న స్పందన, మేనిఫెస్టోలోని అంశాలు ఎంతమేర ప్రజల్లోకి వెళ్లాయన్న దానిపై ఆరా తీశారు. ప్రధాని మోదీ వరుసగా మూడో రోజులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాలపై ఎంతమేర ప్రభావం ఉంటుందనే కోణంలో సర్వే, కన్సల్టెన్సీ సంస్థల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement