బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం | Sakshi Guest Column On Poor Students Education in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం

Published Tue, Dec 31 2024 12:10 AM | Last Updated on Tue, Dec 31 2024 2:00 PM

Sakshi Guest Column On Poor Students Education in Chandrababu Govt

సందర్భం

విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కళ్లు తెరుస్తున్న ప్రజల మీద వ్యతిరేకత మంచిదా? తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు; మరి తెలుగులో ఐఏఎస్, ఐపీఎస్‌ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్‌ అయ్యారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మొదలైన విద్యా విప్లవాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంగ్లిష్‌ విద్యను కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం (English Medium) బతకదు.

విజయవాడలో డిసెంబర్‌ 28, 29 తేదీల్లో రెండ్రోజులు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ జరిగాయి. ఆ సభల్లో దేశానికి చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసి రిటైరైన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారు (NV Ramana) వైకాపా ప్రభుత్వం ఇంగ్లిష్‌ విద్యను రాష్ట్రమంతటా ప్రవేశపెడుతూ తెచ్చిన జీవో నంబర్‌ 85 రద్దు చేయాలనీ, మొత్తం ఏపీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థను మళ్ళీ పాత తెలుగు మీడియంలోకి మార్చాలనీ సూచించారు. ఆయన సూచనను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఒక కోర్టు ఆర్డరుగా పరిగణించి ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్లీ తెలుగు మీడియంలోకి మార్చే పెను ప్రమాదం లేకపోలేదు.

జస్టిస్‌ రమణగారు కోర్టుల్లో కేవలం ఇంగ్లిష్‌లో వాదించినవారు. జడ్జిగా తీర్పులన్నీ ఇంగ్లిష్‌ భాషలో రాసినవారు. ఆయనది ధనవంతమైన రైతు కుటుంబం కనుక తెలుగు మీడియం స్కూల్‌ విద్య నుండి వచ్చి కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించి జ్యుడీషియల్‌ సిస్టమ్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. కానీ గ్రామీణ కూలినాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అలా ఎదగడం సాధ్యమా? జడ్జిగారు తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు.

జస్టిస్‌ రమణగారు వకీలు నుండి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎదిగిన జ్యుడీషియల్‌ సిస్టమ్‌లోనే చూద్దాం. తెలంగాణ హైకోర్టు నుండి కింది కోర్టుల వరకు నేను కోర్టు రూముల్లో నిలబడి చూశాను. గ్రామాల నుండి తెలుగు మీడియంలో చదువుకొని, కష్టపడి లా డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లిష్‌లో వాదించే భాష లేక ఎంత డిప్రెషన్‌కు గురౌతున్నారో నేను చూశాను. వారితో మాట్లాడాను. వారికి వకీలు నుండి జడ్జిగా పై కోర్టుల్లో ఎదగడానికి రాజకీయ సపోర్టు, కమ్యూనిటీ బలం లేదు. 

ఇంగ్లిష్‌ రాని, వాదించ లేని బాధతో ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. ఇదే కోర్టులో ఇప్పుడు నేషనల్‌ లా స్కూల్స్‌ నుండి వస్తున్న యువ లాయర్లు చట్టంలో పట్టున్నా, లేకున్నా ఇంగ్లిష్‌ బలంతో కేసులు గెలుస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీల్లో లా గ్రాడ్యుయేట్స్‌ను రిక్రూట్స్‌ చేసుకునేటప్పుడు ఏ కంపెనీల్లో తెలుగులో ఇంటర్వ్యూ జరుగుతుందో సిస్టమ్‌ గురించి తెలిసిన జస్టిస్‌ రమణగారిని చెప్పమనండి! దేశ సంపద ఇప్పుడు ఈ కంపెనీల్లో పోగుపడి లేదా? అందులో తెలుగు భాషతో ఉద్యోగా లొస్తాయా?

నేషనల్‌ సివిల్‌ సర్వీస్‌లో ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలోనే ఇస్తున్నారు కదా! ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అంటున్న ఈ తెలుగు భాషకు, సివిల్‌ సర్వీస్‌లో ప్రశ్నపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్‌ అయ్యారు? తెలుగుపై ఇంత ప్రేమ ఉన్న జస్టిస్‌ రమణగారు సుప్రీం కోర్టులో ఒక ‘పిల్‌’ వేయించి యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు అన్ని రాష్ట్ర భాషల్లో ఉండాలని ఒక జడ్జిమెంట్‌ ఇచ్చి ఉంటే ప్రాంతీయ భాషల్లో చదువుకునే మొదటితరం అమ్మాయిలు, అబ్బాయిలు కొంతైనా మేలు పొందేవారు. 

అదే సుప్రీం కోర్టు ప్రైవేట్‌ రంగంలో స్కూల్‌ విద్య, ప్రభుత్వ రంగంలో స్కూలు విద్య దేశం మొత్తంగా ఆ యా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో ఉండాలని ఎందుకు చెప్పలేదు? ప్రైవేట్‌ స్కూళ్లను కన్నడలో బోధించాలని కర్ణాటక జీవో ఇచ్చినప్పుడు సుప్రీం కోర్టే తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని చెప్పింది కదా! మరి గ్రామీణ కూలీల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ భాషల్లో చదివించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉండదా? జస్టిస్‌ రమణగారు తల్లిదండ్రుల అభిప్రాయం మళ్ళీ సేకరించండి అంటే న్యాయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేసి ఉండవచ్చు. అలా కాకుండా తెలుగులోకి మార్చాలని నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారు?

ఒకవైపు కేంద్ర ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్‌ మీడియం, మరోవైపు కార్పొరేట్‌ సంస్థలు నడిపే ఎయిర్‌ కండిషన్డ్‌ స్కూళ్ళల్లో ఇంగ్లిష్‌ మీడియం. ఆ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్‌ ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ళ నుండి ఒక బ్యాచ్‌ కూడా బయటికి రాకముందే జస్టిస్‌ రమణ గారు వారి భవిష్యత్‌ గురించిన ఈ జడ్జిమెంట్‌ ఎలా ఇచ్చారు?

చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటున్నారు. ఆయన మనుమడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్‌ ఛాంపియన్‌ కాబోతున్నాడు? 9 ఏండ్ల మనుమని కోచ్‌ ఆయనకు ఏ భాషలో మాట్లాడి కోచింగ్‌ ఇస్తున్నాడు? బీద కుటుంబాల్లోని పిల్లలు అంత ర్జాతీయ ఆటగాళ్లు కావద్దు అనే కదా ఈ ఆలోచన.

మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కండ్లు తెరుస్తున్న ప్రజల మీద ఇంత వ్యతిరేకత మంచిదా? ఈ దేశ విద్యావంతులు, అధికారాన్ని, ధనబలాన్ని అనుభవించిన మేధావులు సైతం బీద ప్రజల సమాన విద్యా హక్కు పట్ల న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఈ బీద, అణచి వేయబడ్డ జీవితాలు ఎలా మారుతాయి? మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువాదం చెయ్యబడి నోబెల్‌ ప్రైజ్‌ పొందే పుస్తకాలు రాయాలి కాని దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా!

తెలుగు నిజంగానే ‘ఈస్టర్న్‌ ఇటాలియన్‌’ భాష అయితే... నన్నయ్య, తిక్కన కాలం నుండి జస్టిస్‌ రమణ కాలం వరకు ఇటాలియన్‌ భాషనే ‘తెలుగు ఆఫ్‌ వెస్టర్న్‌ వరల్డ్‌’ అనేంతగా ఎదిగించడానికి బీద పిల్లల తల్లిదండ్రులు అడ్డువచ్చారా? ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! రవీంద్రనాథ్‌ టాగూర్‌లా బెంగాలీలో గీతాంజలి రాసి నోబెల్‌ బహుమతి తెచ్చినట్లు... తెలుగులో ఎటువంటి పుస్తకాలు రాయాలి, నోబెల్‌ బహుమతిని ఎలా తేవాలి వంటి అంశాలను చర్చిస్తే బీద ప్రజల పిల్లలు కూడా అటువంటి పుస్తకాన్ని చదివి నేర్చు కుంటారు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్‌ రమణ గారి అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూల్‌ విద్యపై చర్చ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఫోకస్‌ కూడా చంద్రబాబు ప్రభుత్వం పెట్టడం లేదు. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. క్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్ళీ పాతబాటలోకి విద్యామంత్రిగా లోకేష్‌ నెడుతున్నారు.

చ‌ద‌వండి: ఇంగ్లీష్‌ మీడియం మన పిల్లలకే.. 'పేద బిడ్డలకు తెలుగే'

ఇప్పుడు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల పేరుతో పిల్లల భవిష్యత్తుకు ముగుతాడు వెయ్యాలనే ప్రచారం మొదలైంది. ఒక్క జస్టిస్‌ రమణగారే కాదు.. మండలి బుద్ధప్రసాద్‌ ఇటువంటి ఆలోచన కలవారే. ఇప్పుడు ఇంగ్లిష్‌ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం బతకదు. ఈ విద్యా విధానాన్ని కాపాడవలసిన బాధ్యత ఒక్క వైసీపీదే కాదు... వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఇంగ్లిష్‌ విద్య పరిరక్షణ పోరాటం చేస్తే తప్ప ఈ తిరోగమన రథచక్రం ఆగదు.


- ప్రొఫెస‌ర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement