వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి దృశ్యం
సందర్భం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు.
కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్‌ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్‌లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు.
ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం.
ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు.
కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్‌బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు.
ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్‌లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్‌సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్‌లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు.
ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి.
ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.
డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి
Comments
Please login to add a commentAdd a comment