Democratic system
-
పాతాళాన్ని తాకిన పార్లమెంట్ ప్రతిష్ఠ
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
దేశ ప్రజాస్వామ్యానికి 2024 కీలక మలుపు
న్యూఢిల్లీ: గత పదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంస్థలను నాశనం చేసేందుకు, వాటి సమగ్రతను దెబ్బతీసేందుకు మూకుమ్మడి ప్రయత్నాలు జరిగాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే, దేశ ప్రజాస్వామ్యానికి 2024 ఒక కీలకమలుపు వంటిదని ఖర్గే పేర్కొన్నారు. మన జాతి నిర్మాతలు ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం ఉంచుతూ 140 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు ఇచ్చారన్నారు. ‘ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎంతో ఉత్తమమైంది. ప్రజలు తమను ఎలా పాలించాలో తెలిపేందుకు, నాయకులను జవాబుదారీగా ఉంచేందుకు ఈ విధానంలో అవకాశం ఉందన్న మన ప్రథమ ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ఆదివారం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో ఉటంకించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని ఖర్గే పేర్కొన్నారు. -
రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్‌ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్‌లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం. ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు. కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్‌బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు. ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్‌లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్‌లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు. ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి -
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు
పట్నా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి, ప్రధాని మోదీ మహారాజు స్థానంలో ఉండాలనుకుంటున్నారని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దర్భంగాలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ పట్టించుకోరన్నది వాస్తవమన్నారు. ఎన్నికల్లో గెలవడం, అధికారం నిలుపుకోవడం మాత్రమే మోదీ లక్ష్యమని తేజస్వి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి, మహారాజుగా మారాలన్నది మోదీ కోరికని పేర్కొన్నారు. కానీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి షాక్ తప్పదని ఆయన స్పష్టం చేశారు. -
ఈ యుద్ధం ఓ వరం!
యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు. వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు. అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది. సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి. పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్‌గా మారింది. పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు. చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా? పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం. పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు. వీరి టీమ్‌లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్ కల్యాణ్. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్‌లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్‌ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది. అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం. వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్ ఏరియాలు గేమ్ ఛేంజర్స్‌గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రష్యాపై ఎందుకీ తటస్థ వైఖరి?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ అనుకూల వైఖరిని తీసుకున్న దేశాలు కూడా రష్యాకు అనుకూలంగానో, తటస్థంగానో మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు వ్యవహరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు కూడా ఇందులో ప్రభావం చూపుతున్నాయి. అయితే, అలీన దేశాలకు మానవతా సాయం అందించాలన్న పాశ్చాత్య దేశాల నిబంధనల వెలుగులో ఈ తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. చాలాదేశాలు తటస్థతను ఎంచుకోవడమే దీనికి కారణం. కొన్ని ఆధారాల ప్రకారం, రష్యాను ఖండిస్తున్న దేశాల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఉక్రెయిన్ అనుకూల వైఖరి నుండి బోట్స్ వానా రష్యా పైవు మళ్లింది. దక్షిణాఫ్రికా, తటస్థత నుంచి రష్యా అనుకూల వైఖరి చూపుతోంది. రష్యా చర్యను ఖండించిన కొలంబియా ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అదే సమయంలో, చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నాయి. ఆఫ్రికాను తీసుకుందాం. మాస్కో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆఫ్రికన్ యూనియన్ పిలుపునిస్తున్నప్పటికీ, అనేక ఆఫ్రికా ఖండ దేశాలు తటస్థంగానే ఉంటున్నాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి వామపక్ష అనుకూల ప్రభుత్వాల సంప్రదాయ ఫలితమేనని కొందరు పరిశీలకులు వాదిస్తు న్నారు. ఆఫ్రికా దేశాల అయిష్టతకు మూలం తమ అంతర్గత వ్యవహారాల్లో కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు బహిరంగంగా పాశ్చాత్య దేశాలు పాటించిన జోక్యందారీ చరిత్రలో ఉందని మరికొందరు చెబుతున్నారు. రష్యాను ఖండించడానికి అయిష్టత చూపడం అనేది ఆఫ్రికాను దాటిపోయింది. రష్యా బేషరతుగా, తక్షణం ఉక్రెయిన్ నుంచి వెళ్లి పోవాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని 2023 ఫిబ్రవరిలో లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలావరకు బలపర్చాయి. ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలను బ్రెజిల్ బలపర్చినప్పటికీ, అది రష్యాను నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో బొలీవియా, క్యూబా, ఎల్ సాల్వడార్, వెనిజులా దేశాల వైఖరిని చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా తిప్పి కొట్టాలని అవి సూచించాయి. పైగా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాలు ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేయాలన్న పిలుపును తిరస్కరించాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించాలని జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మెక్సికో ప్రశ్నించింది. ఆసియాలోనూ ఇదే రకమైన విభజనలు కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా బహిరంగంగానే రష్యాను ఖండించాయి. కానీ ఆగ్నే యాసియా దేశాల కూటమి సామూహికంగా ఈ ఖండన చేయలేదు. ఇక చైనా విషయానికొస్తే – రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరుపుతూనే, ఐక్యరాజ్యసమితిలో పెరుగుతున్న తన ప్రాభవం ద్వారా సమతుల్యత సాధించేలా వ్యవహరిస్తోంది. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉక్రెయిన్ ఘర్షణపై జరిగిన ఓటింగుకు గైర్హాజరైంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు ఘర్షణతో పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. అందువల్ల సోవియట్ యూనియన్, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధికి వెలుపల విదేశీ విధానంలో స్వయంప్రతిపత్తిని ఈ దేశాలు పొందగలిగాయి. యూరోపియన్ యూనియన్ వైఖరిని బలపర్చడంలో ఇతర దేశాల అయిష్టత అనేది విదేశీ విధాన స్వతంత్ర కాక్షకూ, పొరుగు దేశంతో విరోధం పెట్టుకోవడానికి అయిష్టతకూ సంబంధించినదిగా ఉంటోందని యూరోపియన్ యూనియన్ ఆంక్షల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ దేశాలకూ, రష్యాకూ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి అలీన విధానం ఆయా దేశాలకు ఉపకరిస్తోంది. ఈ కారణం వల్లే, అనేక ప్రజాస్వామిక దేశాలు తటస్థ వైఖరికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ‘ఇరుపక్షాలతో మాట్లాడండి’ అనడంలో దీన్నే మనం చూడవచ్చు. రష్యాను ఖండించ డానికి వ్యతిరేకంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకోవడంలో నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు పెరిగిన రష్యా చమురు ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రష్యా, భారత్ ఒకే విధమైన వ్యూహాత్మక, రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించాయని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 2000 సంవత్సరంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో బహుళ ధ్రువ గ్లోబల్ వ్యవస్థను నిర్మించాలన్నది రష్యా ఉద్దేశంగా ఉండింది. అమెరికాను భాగస్వామిగా చేసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతదేశాన్ని రష్యా అభ్యర్థించేది. అలాగే భారతీయ అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా మద్దతునిచ్చింది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా బలపరుస్తూ వచ్చింది. భారత్ ఆయుధ వాణిజ్యంలో రష్యా కీలక భాగస్వామిగా ఉండ టాన్ని రష్యా కొనసాగించింది. 1992 నుంచి 2021 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 65 శాతం వరకు రష్యా సరఫరా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి, భారత్‌కు చౌక ధరకు చమురు అందించే కీలకమైన సరఫరాదారుగా రష్యా మారి పోయింది. 2021లో రష్యా నుంచి రోజుకు 50 వేల బ్యారెల్స్‌ను భారత్ కొనుగోలు చేయగా, 2022 జూన్ నాటికి అది రోజుకు పది లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రయోజనాలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉన్న బ్రెజిల్ అత్యధిక ఎరువుల వినియోగదారు కూడా. 2021లో రష్యా నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకున్న దిగుమతుల విలువ 5.58 బిలియన్ డాలర్లు కాగా, వాటిలో 64 శాతం వాటా ఎరు వులదే. తమ రెండు దేశాల మధ్య ఇంధన సంబంధాలను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా గ్యాస్ సంస్థ గాజ్ప్రోమ్ బ్రెజిల్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుందని 2023 ఫిబ్రవరిలో బ్రెజిల్ ప్రక టించింది. 2023 మార్చి నాటికి బ్రెజిల్‌కు రష్యా డీజిల్ ఎగుమతులు కొత్త రికార్డులను చేరుకున్నాయి. అదే సమయంలో రష్యన్ చమురు ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు కూడా పతాక స్థాయిని చేరుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సంద ర్భంలో– రష్యా, చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నౌకా విన్యా సాలను చేపట్టింది. నౌకాదళ నిధుల లేమితో ఉన్న దక్షిణాఫ్రికా ఈ విన్యాసాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆఫ్రికా ఖండానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలుస్తోంది. అణుశక్తిని కూడా రష్యా సరఫరా చేస్తోంది. ఆఫ్రికా ఖండానికి 30 శాతం వరకు గోధుమ వంటి ధాన్యాలను కూడా రష్యా సరఫరా చేస్తోంది. రష్యా ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఆఫ్రికా ఖండానికి చేరుతున్నాయి. మరొక ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, అలీన విధానం ఇప్పటికీ పాపులర్ ఎంపికగా కొనసాగుతోందని ఉక్రెయిన్ యుద్ధం ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ముఖ్యమైన రాజకీయ ఉనికిగా అలీన విధానం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇతర ఉదంతాలను చూస్తే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో హయాంలో ఇది మారినప్పటికీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బ్రెజిల్ వంటి దేశాల సంప్రదాయ విధానంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి అలీన దేశాల్లో చాలావాటికి ప్రత్యక్ష మదుపులు, అభివృద్ధి, మానవతా సహాయాన్ని అందించడం అనే పాశ్చాత్య నిబంధనల వెలుగులో చూస్తే ఇది విరుద్ధ ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. జోస్ కబల్లెరో వ్యాసకర్త సీనియర్ ఆర్థికవేత్త (‘ద కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!
న్యాయస్థానాల తీర్పుల్ని తప్పుపట్టకూడదని ఎక్కడా శాసనం లేదని బ్రిటిష్ రాణి న్యాయశాస్త్ర సలహాదారు డేవిడ్ పానిక్ అంటారు. న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదని కొందరు ఇచ్చే సలహాలను వీళ్లు కొట్టేస్తారు. న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవడానికి విధిగా ప్రయత్నించాలని చెబుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకపోవడం తెలివి తక్కువ పని. వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకులుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వామికం. ఏ వ్యవస్థ అయినా విమర్శకు అతీతం కాదు. ముఖ్యంగా ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని భావించేవాళ్లు ఉన్నప్పుడు! ‘‘మావోయిస్టు కుట్ర కేసు పేరిట వికలాం గుడైన ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, ఆయనతోపాటు నిందితులైన ఇతరులను జైలు నుంచి విడుదల చేస్తూ, వారిపై మోపిన కుట్ర కేసును కొట్టివేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు కాకుండా సుప్రీంకోర్టు నిల్పివేసిన పద్ధతి చాలా అసాధారణం. పరస్పర విరుద్ధంగా వెలువడిన ఈ రెండు కోర్టుల తీర్పులు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాయిబాబా ప్రభృతులపైన మోపిన కేసును బొంబాయి హైకోర్టు– కేసు సామర్థ్యాన్ని బట్టి కాక, సాంకేతిక కారణాలపైన కొట్టివేసి ఉండ వచ్చు. కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీలును అనుమ తించేప్పుడు సుప్రీంకోర్టు కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన అప్పీలును తక్షణమే పరిశీలించాలన్న కోర్కెను తీర్చడానికే సుప్రీం కోర్టు అసాధారణమైన ఉత్సాహాన్ని కనబరిచింది. ఫలితంగా సుప్రీం కోర్టు... ధర్మాసనం ఏర్పాటు చేసింది. కానీ, సాయిబాబా ప్రభృతులను విడుదల చేయడానికి గల కారణాలను ఎంతో వివరంగా పేర్కొన్న బొంబాయి హైకోర్టు తీర్పును కేవలం సమర్థించడానికి సుప్రీం బెంచ్ అంత వేగంగా ఉత్సాహం కనబరిచి ఉండగలిగేదా అన్నది అనుమానిం చాల్సిన విషయం.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (17 అక్టోబర్ 2022) మన పాలకులుగానీ, కొందరు న్యాయమూర్తులుగానీ ఎలా వ్యవహ రిస్తున్నారంటే– ‘మనిషికి మెదడు ఉండటమే ప్రమాదకరం’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆలోచించే మెదడుంటే ప్రమాదకరమైన తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని కొందరు న్యాయ మూర్తులు నిర్ణయించినట్టు కనబడుతోంది. మెదడు ఎందుకు, ఎలా ప్రమాదకరమైనదో బ్రిటిష్ రాణి క్యాబినెట్‌కు ప్రత్యేక న్యాయశాస్త్ర సలహాదారుడిగా వ్యవహరించిన డేవిడ్ పానిక్ కోర్టుల గురించి వ్యంగ్యంగా ఓ కథ చెప్పాడు: దారిన పోయే ఒక దానయ్య దారిన పోయేవాళ్లంతా కంగారు పడేంతగా, పెద్దగా భయంకరంగా తుమ్ము తుమ్మాడట. దానిపైన కొందరు దగ్గర్లో ఉన్న కోర్టులో ఫిర్యాదు చేస్తే, ఆ కోర్టు వారు ఆ వ్యక్తి రెండు ముక్కుల్లో ఏ వైపు నుంచి తుమ్మాడో తేల్చమన్నారట! అలా ఉంటాయి కొన్ని కోర్టు తీర్పులని చెప్పడానికే డేవిడ్ పానిక్ ఈ స్టోరీ చెప్పాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పుల్ని తప్పుపట్టకూడ దని ఎక్కడా శాసనం లేదని చెబుతూ డేవిడ్ పానిక్, జడ్జి జెరోమి ఫ్రాంక్ ఇలా స్పష్టం చేశారు: ‘‘న్యాయస్థానం వ్యవహరించే తీరు తెన్నుల్ని గురించిన వాస్తవాలను వెల్లడించడం తగదనీ, పైగా ప్రమాదకరం కాబట్టి న్యాయస్థానాలను గురించి ప్రస్తావించడం తగదనీ కొందరు రాజకీయవేత్తలు, కొందరు న్యాయశాస్త్రవేత్తలు సలహాలిస్తుంటారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో జరిగే పనుల తీరు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పక పోవడం తెలివి తక్కువ పని. మనిషి రూపొందించి నిర్మించిన వ్యవస్థల పనితీరులో లోటుపాట్లను గమనించలేనంత అమాయకు లుగా, చిన్నపిల్లలుగా ప్రజాబాహుళ్యాన్ని భావించడం అప్రజాస్వా మికం. మన న్యాయవ్యవస్థ నడవడికలోని లోపాలను తొలగించుకోవ డానికి విధిగా ప్రయత్నించాలి. అందుకనే న్యాయస్థానంలో కూర్చొన దగిన సుశిక్షితులైన జడ్జీలను మాత్రమే అనుమతించాలి. వారి ప్రవ ర్తనను స్వేచ్ఛగా విమర్శించే హక్కు ప్రజలకుండాలి. వారి ప్రవర్తన జ్యుడీషియల్ పర్ఫామెన్స్ కమిషన్ విచారణకు సిద్ధమై ఉండాలి.’’ అందుకే స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో ఉద్దండపిండాలైన ఉన్నత న్యాయశాస్త్ర కోవిదుల్లో, ఉత్తమ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయమూర్తి స్థానంలో ఉన్నవాడికి సామాజిక న్యాయంపట్ల అవగాహన, అనురక్తి, ప్రేమానురాగాలు విధిగా ఉండా లనీ... ఈ విషయంలో ఏ కోర్టు బెంచ్గానీ, బార్ అసోసియేషన్ గానీ నా ఆదర్శం నుంచి, లక్ష్యం నుంచి నన్ను మరల్చజాలవనీ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ సత్యానికి ప్రతిబింబంగానే ఫ్రెంచి తాత్త్వికులలో, వామపక్ష ప్రతినిధుల్లో ఒకరైన థోరే ఒక సందర్భంలో మాట్లాడుతూ– వ్యక్తుల్ని అన్యాయంగా, అక్రమంగా జైళ్లలో నిర్బంధించగల ప్రభుత్వం ఉన్న చోట న్యాయంగా వ్యవహరించే వ్యక్తి స్థానం కూడా జైల్లోనే అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఆయనను ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించే నాటికే ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడైన ఎమర్సన్ కూడా జైల్లో మగ్గుతున్నాడు. థోరేను అకస్మాత్తుగా చూసి, ‘అదేమి టయ్యా, నువ్వు కూడా జైల్లోనే ఉన్నావా?’ అని ఆశ్చర్యం వెలిబు చ్చాడు ఎమర్సన్. ‘అవును, ఎవరినైనా ప్రభుత్వం అక్రమంగా జైల్లోకి నెట్టే కాలంలో న్యాయం పలికే ఏ మనిషి స్థానమైనా జైలే సుమా’ అన్నాడు థోరే! అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ ‘అన్యాయంగా జైళ్లలో నిర్బంధితులైన వారిని ప్రస్తావిస్తూ... ఉద్రేకంగా అక్రమ కేసులలో నిర్బంధితులైనవారికీ, వారి హక్కుల రక్షణకు పూచీ పడుతున్న రాజ్యాంగానికీ మధ్య ఇనుప తెర అనేది లేదనీ, ఉండదనీ గమనిం చా’లని పదేపదే చెప్పేవారు. కానీ, ఇప్పటికొచ్చేసరికి అసలు ‘మనిషి (పౌరుడి) మెదడు’ మీదనే కత్తి ఎక్కుపెట్టడం జరుగుతోంది. అందుకే మహాకవి శ్రీశ్రీ అదే ‘మెదడు’ గురించిన విశ్వజనీనమైన సత్యాన్ని ఎలా మానవాళి ముందు ఆవిష్కరించాడో చూడండి: ‘‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పనిచేస్తే విశ్వరహఃపేటికావిపాటనం జరగక తప్పదు.’’ ‘మెదడు’ను పనిచెయ్యనివ్వాలి గదా? మరి దాని ఉనికినే ప్రమాదకరంగా భావించి ప్రజల ‘మెదళ్ల’నే కట్టడి చేయాలన్న తపనకు కొందరు తెరలేపడం ప్రమాదకరం. న్యాయస్థానాల గౌరవం మసకబారకుండా జాగ్రత్తపడటం కోసం జస్టిస్ లోకూర్ లాంటి వారు తమకు తాత్కాలిక పాలక శక్తులు ఎర చూపిన ప్రమోషన్లకు లొంగి పోలేదు. తమ ఉనికి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పాలకులు ప్రవేశపెట్టిన తప్పుడు చట్టాలు యువకుల జీవశక్తిని నులిమివేస్తు న్నాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో వీస్తున్న ఆహ్వా నించదగిన నిర్ణయాలు, పరిణామాల వాతావరణంలోనైనా అలాం టివి వైదొలగి పోవాలని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటారు. ఈ తప్పుడు కేసుల తతంగం అంతా జరుగుతూన్న సందర్భం గానే– ప్రపంచంలో ఆకలిదప్పులతో కునారిల్లిపోతున్న 121 దేశాలతో కూడిన జాబితాలో భారతదేశం 107వ స్థానంలో నమోదు కావటం మనకు సిగ్గుచేటుగా లేదా? అయినా దేశ పాలకులకు ‘చీమ కుట్టి నట్టు’గా కూడా లేదు. ఈ సందర్భంగా కవి కంచాన భుజంగరావు అమృతోత్సవాల సందర్భంగా వినిపిస్తున్న సందేశాన్ని విందాం: ‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి సూర్యోదయం ఒక సహజమైన ఆశ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా కాకపోతే 27,375 ఉదయాలు ఎదురుచూపులుగా కరిగిపోవడమేమిటన్నదే ఇప్పుడు తాజా ప్రశ్న. దొరల బూట్లలో కాలుపెట్టినప్పుడే అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది ఇప్పుడు కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వరులు) నీడ దేశాన్ని కమ్మేసింది. పెట్టుబడి ఒక్కటే ఇప్పుడు వీసా లేకుండా దేశాలు తిరిగేస్తుంది ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ వేరెవరికైనా ఉందా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
జయహో.. జనతంత్ర భారత్
ఓట్ల పండుగ వచ్చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక సంబరానికి తెర లేచింది. రాజకీయ పార్టీల హడావుడి, నాటకీయ పరిణామాలు, రంగురంగుల జెండాలు, హోరెత్తించే ప్రచారాలు..ఒక్కటేమిటి? పెద్ద పండగకు ఉండాల్సిన అన్ని హంగులూ ఈ ఎన్నికల పండగ సంతరించుకుంటుంది. ప్రపంచంలో మరే దేశంతోనూ పోల్చడానికి వీల్లేని విధంగా మన పార్లమెంటు ఎన్నికలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలు పోతున్నాయి. భూగోళంపై అతిపెద్ద ఎన్నికల సంబరం భారతదేశ ఎన్నికలే అన్న సత్యాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా సాగుతూ వచ్చిన ఎన్నికల ప్రక్రియ పదిహేడో లోక్‌సభ నిర్మాణం కోసం మరో అడుగు వేయబోతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో తొంభై కోట్ల మంది ఓటర్లు తమ నేతలను ఎన్నుకోవడానికి రంగం సిద్ధమయింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగ నిర్మాతలు వేసిన బలమైన పునాది ఎన్నో ఆటుపోటులను, ఆటంకాలను తట్టుకుని నిలబడింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వచ్చింది.భారత దేశంతో పాటు, ఆ తరువాత స్వాతంత్య్రం పొందిన దేశాలెన్నో ఇంకా అనేక ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటే భారత దేశం మాత్రం తన ప్రజాస్వామిక వ్యవస్థను రోజురోజుకూ పరిపుష్టం చేసుకుని, అనేక దేశాలకు పాఠాలు నేర్పుతోంది. ఆసియాలో మయన్మార్, నేపాల్ దగ్గర నుంచి ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి దేశాలు ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడానికి భారత్ ఊతం ఇస్తోంది. అరబ్ విప్లవం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు సాగుతున్న అనేక దేశాలు భారత ప్రజాస్వామిక పురోభివృద్ధి వైపు చూస్తున్నాయి. పునాది మొదటి ఎన్నికలు తొలి ఎన్నికల నుంచే నిర్దిష్టమైన అవగాహనతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో కదం కదం కలిపి ముందడుగు వేసిన భారతావని ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసం చేసింది. తొలి ప్రయత్నంలోనే వయసు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు వేసే బృహత్తర అస్త్రం అందజేసింది. 1951లో జరిగిన తొలి ఎన్నికలతో మొదలైన ఎన్నికల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు కొనసాగింది. అప్పటి నుంచి 2014 వరకు మొత్తం పదహారు సార్లు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసన సభలకు కూడా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంత వరకు దేశంలోని 29 రాష్ట్రాల్లో మొత్తం 357 సార్లు శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఒక్కోసారి అత్యంత ప్రముఖులను కూడా ఓడించి ఇంటి దారి పట్టించారు. మరికొన్ని సార్లు అనామకులకు కూడా అఖండ విజయం కట్టబెట్టారు. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో జరిగిన యుద్ధాలతోనూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగలేదు. రాజ్యాంగమే మార్గదర్శి మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మూలం రాజ్యాంగం. అంబేడ్కర్ వంటి వందల మంది మేథావులు నెలల తరబడి మేథోమథనం చేసి రూపొందించిన రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు నుంచి గ్రామ స్థాయి వరకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారాన్ని అట్టడుగు స్థాయి వరకు వికేంద్రీకరించింది. సమాజంలో అణగారిన వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అశకాశం కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి అవసరమైన చర్యలు ఎప్పటి కప్పుడు తీసుకుంటోంది. ప్రపంచానికే ఆదర్శం ప్రజాస్వామ్య భారతంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బృహత్తర ప్రక్రియ. దాదాపు 130 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ఓటర్లు...29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 543 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయ ప్రయాసలు, మానవ వనరులతో కూడుకొన్నది. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు అమలయ్యాయి. మొదటి ఎన్నికల సమయంలో దేశ జనాభా 36 కోట్లు. వారిలో 17.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో పార్లమెంటులో 489 సీట్లు ఉండేవి. కాలక్రమంలో దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగడంతో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో అవసరమైన మార్పులు చేస్తూ వస్తోంది. ఎలాంటి బేధం చూపకుండా నిర్దిష్ట వయస్సు వచ్చిన వారందరికీ ఒకే సారి ఓటు హక్కు కల్పించింది ప్రపంచంలో ఒక్క భారత దేశమే. చాలా దేశాలు మొదట ధనికులకు, తర్వాత విద్యావంతులకు ఇలా దశల వారీగా పౌరులకు ఓటు హక్కు కల్పించాయి. ఆయా దేశాల్లో మహిళలకయితే దశాబ్దాలు పోరాడితే కాని ఓటు హక్కు రాలేదు. ప్రజలందరికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకించడం భారత్‌లోనే జరిగింది.73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపచేశారు. పరాయివాళ్లకి ముఖం చూపించడానికి ఇష్టపడని, తమ పేరు చెప్పడానికి ముందుకురాని మహిళలను ఓటర్ల జాబితాలో చేర్చడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టడం వరకు ఈ 70 ఏళ్లలో పటిష్టమైన దేశ ప్రజాస్వామిక సౌధాన్ని నిర్మిస్తూ వస్తున్నాం. అతి కొన్ని సందర్భాల్లో మినహాయించి, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి పార్లమెంటుకు, శాసన సభలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారత దేశం ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఓటరు నమోదు నుంచి మొదలు పెట్టి ఎన్నికల అక్రమాలను గుర్తించడం, సకాలంలో నివారించడం, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించడం ,ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తతతో నిబద్ధతతో వ్యవహరించడం ఎన్నికల సంఘం సామర్థ్యానికి నిదర్శనం. పొరుగు దేశాల పాట్లు మనతో పాటే స్వాతంత్య్రం పొందిన పాకిస్తాన్ అనతి కాలంలోనే ప్రజాస్వామ్యం నుంచి సైనిక పాలనకు మళ్లిపోయింది. ప్రజాస్వామ్యం అక్కడ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అలాగే, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో కూడా ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగడం లేదు. మన దేశంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అదీ ప్రజాస్వామ్యమంటే... 1999లో వాజపేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతోనే పడిపోవడం మన ప్రజాస్వామ్య చరిత్రలోనే గుర్తుంచుకోదగిన ఘట్టం. వాజ్‌పేయి ప్రభుత్వంపై 1999, ఏప్రిల్ 17న పార్లమెంటులో అవిశ్వాస పరీక్ష జరిగింది. మైనారిటీలో ఉన్న వాజపేయి సర్కారుకు మద్దతిస్తామని బీఎస్పీ ఎంపీలు హామీ ఇచ్చారు. తీరా సభలో ఓటు వేసే సమయంలో బీఎస్పీ అధినేత మాయావతి తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. అందరితో పాటు ఒరిస్సాకు చెందిన గిరిధర్ గొమాంగో కూడా వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, రెండు నెలల ముందే ఆయన ఒడిశా సీఎంగా ఎంపికయ్యారు. అందువల్ల ఆయన ఓటు చెల్లదని ప్రభుత్వం వాదించింది. సీఎం అయినా కూడా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని, దాంతో సాంకేతికంగా ఆయన ఎంపీగానే ఉన్నట్టేనని అందువల్ల ఆయన ఓటు చెల్లుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. గొమాంగో ఓటుతోనే వాజ్‌పేయి సర్కారు ఓడిపోయింది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయిన తర్వాత ప్రధాని వాజ్‌పేయి చేసిన ప్రసంగం హుందాగా సాగింది. ప్రతిపక్షాలు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము పూర్తిగా మద్దతునిస్తామని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నాలేకపోయినా తమ పార్టీ దేశసేవకి అంకితమై ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విపక్షాలను ఆయన అభినందించారు. -
ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన నాలుగు ప్రధాన అంగాలూ గడచిన ఏడు దశాబ్దాల్లో భ్రష్టు పట్టాయని, ఇందుకు దేశంలో సంభవిస్తున్న అనేక పరిణామాలు నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘బులేనా’(వ్యంగ్య వ్యాఖ్యలు) పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టులో తనకు ప్రమేయం ఉన్న ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. ‘మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో కుంభకోణం జరిగినట్టు నిర్థారించి సీబీఐ కేసు పెట్టింది. ఈ స్కాంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఒడిశా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఒకరిని అరెస్టు చేసింది. ఈ విషయంలో నిజం నిగ్గు తేల్చాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణ ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి నేరం చేసి ఉంటే ఆయనకు అంటిన బురద మొత్తం న్యాయవ్యవస్థకూ అంటుకుంటుంది. కనుక ఈ విషయంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని నేను భావించాను. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉదయం ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముఖ్యమైన కేసులో ఉండటంతో ఈ అంశం సీజేఐ తర్వాత అత్యధిక సీనియారిటీ కలిగిన నా ముందుకు వచ్చింది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆరోపణలను విచారించాలని నిర్ణయించాను’అని చలమేశ్వర్ చెప్పారు. అయితే సీజేఐకి తన నిర్ణయం అభ్యంతరకరంగా తోచి దాన్ని పక్కన పెట్టి.. వేరే బెంచ్ ఏర్పాటు చేశారని, అయితే అందులో తన పేరు లేదని చెబుతూ ‘జస్టిస్ చలమేశ్వర్‌ను తొలగించిన చీఫ్ జస్టిస్’అంటూ ఓ తెలుగు పత్రిక (సాక్షి కాదు) శీర్షిక పెట్టిందని అన్నారు. న్యాయస్థానాల పనితీరు గురించి అవగాహన లేకుండా వార్త రాయడం జర్నలిజంలో లోపిస్తున్న నిష్ఠకూ, ప్రబలుతున్న సంచలనాత్మకతకూ నిదర్శనమని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ‘కొంత కాలం కిందట ఓ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు 60 పేజీల లేఖ రాశారు. ఆ లేఖ చాలా రోజులు వెలుగు చూడలేదు. ఆయన భార్య ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్ఠి పెట్టి లేఖ ప్రతులను పంచారు. ఇంతవరకూ ఆ లేఖను ఒక్క పత్రికగానీ, జాతీయ స్థాయి టీవీ చానళ్లుగానీ ప్రస్తావించలేదు. దేశంలో మీడియా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది’అని విమర్శించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రాజకీయ పార్టీ స్పందించలేదని, అన్ని వ్యవస్థలూ దిగజారాయనడానికి ఇది నిదర్శనమని, ఈ పరిస్థితి దేశానికి క్షేమకరం కాదని హెచ్చరించారు. పత్రికలు, టీవీ చానళ్లకు లేని స్వేచ్ఛ ఇంటర్నెట్కు ఉందని, ఐటీ చట్టం సెక్షన్ 66(ఎ) చెల్లదంటూ తానూ, జస్టిస్ నారీమన్ కలసి తీర్పు ఇచ్చామని, 22 ఏళ్ల తన అనుభవంలో సంతృప్తినిచ్చిన తీర్పుల్లో అది ఒకటని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు వరదాచారి, ఉడయవర్లు, రామచంద్రమూర్తి, శ్రీరమణ పుస్తకం గురించి, రచయిత గురించి మాట్లాడారు. పుస్తకం వెలుగు చూడటానికి దోహదం చేసినవారందరికీ పొత్తూరి ధన్యవాదాలు చెప్పారు. రోడ్డుపై నడుచుకుంటూ పుస్తకావిష్కరణ సభకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను చవి చూశారు. ‘బులేనా’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జస్టిస్ చలమేశ్వర్ ఉదయం 11 గంటల సమయంలో ప్రెస్‌క్లబ్ సమీపానికి చేరుకున్నారు. అయితే నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్, పంజగుట్ట సర్కిల్ మధ్యలో సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పుస్తకావిష్కరణ గడువు దగ్గర పడటంతో వాహనం నుంచి దిగి రోడ్డుపై నడుచుకుంటూ ఆయన ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. -
ప్రజాస్వామ్యానికి ప్రశ్నించడమే రక్ష: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య సమాజ పరిరక్షణకు అధికా రంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత సమస్యలు తప్ప ఇతరులవి విస్మరించడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన రామ్‌నాథ్ గోయెంకా స్మారక ఉపన్యాసమిచ్చారు. భారత్‌లో చర్చించే వారికే తప్ప అసహనపరులకు చోటుండరాదని అన్నారు. చర్చలు, అసమ్మతి వంటివి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన పౌరులు, వ్యాపారవేత్తలు, సంస్థలు అన్నీ కూడా, ప్రశ్నించడంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే సంగతిని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. భారత నాగరికతలో బహుళత్వం, సహనం భాగంగా ఉన్నాయని, ఎన్నో తారతమ్యాలున్నా ఏళ్లుగా అవే మనల్ని ఒకటిగా నిలిపాయని అన్నారు. ప్రశ్నించే పాత్రను సంప్రదాయంగా మీడియా పోషిస్తోందని ప్రణబ్ అన్నారు. అన్యాయం, లింగ వివక్ష, కుల, సామాజిక పక్షపాతానికి లోనవుతున్న మిలియన్ల కొద్ది ప్రజలకు మీడియా బాసటగా నిలవాలని సూచించారు. చెల్లింపు వార్తలపై ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేస్తూ...తటస్థ వైఖరితో మీడియా సంస్థలు ప్రజల విశ్వాసం చూరగొనాలని తెలిపారు. -
ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు సీతంపేట(విశాఖ): రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేలా ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది ప్రజలను వంచించడమేనన్న విషయాన్ని గమనించడం లేదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నాయకులపై వికారియస్ లయబిలిటీ(తప్పును ప్రోత్సహించే, సహకరించే వారిని శిక్షించడం) కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘సంకుచిత రాజకీయాలు- ప్రాంతీయ అసమానతలు’ అన్న అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో విజయబాబు మాట్లాడారు.ప్రాంతీయ అసమానతల వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి కె.ఎస్.చలం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వంచనకు గురవుతూ వెనుకబడిందన్నారు. -
రాజకీయ ప్రమేయం అవసరం
అధికార యంత్రాంగంపై ప్రధాని మోదీ {పజాస్వామ్యంలో అది అనివార్యం రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉంది అధికారులు ఒక బృందంగా పనిచేయాలి సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధాని ఉద్బోధ న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగంలో రాజకీయ ప్రమేయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రాజకీయ ప్రమేయాన్ని సుపరిపాలనకు ఆటంకాలుగా చూడరాదని అధికారులకు సూచించారు. రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉందని.. జోక్యం వల్ల వ్యవస్థ నాశనమయితే.. ప్రమేయం అవసరమూ, అనివార్యమూ అని ఆయన పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం, రాజకీయ ప్రమేయం చేయీ చేయీ కలిపి ప్రయాణిస్తాయి. ఈ దేశాన్ని మనం నడపాలంటే మనకు రాజకీయ జోక్యం అవసరం లేదు. కానీ రాజకీయ ప్రమేయం అవసరం, అనివార్యం. లేదంటే ప్రజాస్వామ్యం పనిచేయదు’’ అని చెప్పారు. ‘‘చట్టసభల సభ్యులను ప్రజలు ఎన్నుకొంటారు కాబట్టి.. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రమేయం అవసరం. అధికార వ్యవస్థ నుంచి అవరోధాలు, కష్టాలు అనే పదాలను తొలగించాల్సిన అవసరముంది’’ అన్నా రు. సుపరిపాలనకు అకౌంటబిలిటీ (జవాబుదారీతనం), రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత) అనే ‘ఆర్ట్’ అవసరమన్నారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉందని.. దానిని గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మొబైల్ పాలన చూసే రోజు ఎంతో దూరంలో లేదంటూ.. అధికార యంత్రాంగంలో సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలకు ఊతమివ్వాల్సిన అవసరముందని చెప్పారు. దేశాన్ని ఏకీకరణ చేసిన తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ కృషిని గుర్తు చేస్తూ.. ఈనాడు సామాజిక, ఆర్థిక ఏకీకరణ అవసరమని పేర్కొన్నారు. అధికారులు విడివిడిగా పనిచేసే పద్ధతిని విడనాడి.. ఒక బృందంలా పనిచేయాలని కోరారు. సివిల్ సర్వీసెస్ విభాగాలన్నీ సంస్థాగత సమాచారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు.. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకుంటున్న యువతతో సమయం గడపాలని.. ప్రభుత్వానికి ఉత్తమ నైపుణ్యం గలవారు లభించేలా చూడాలని సూచించారు. ఏడాదికి ఒకసారైనా కాలేజీ విద్యార్థులతో ముచ్చటించాలని చెప్పారు. ఈ సందర్భంగా 2012-13, 2013-14 సంవత్సరాలకు ప్రభుత్వ పరిపాలనలో ఉత్తమ ప్రతిభా అవార్డులను ప్రధాని ఆయా అధికారులకు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విలక్షణ సేవ చేసినందుకు గౌరవం పొందిన అధికారులకు అభినందనలు తెలుపుతూ.. అవార్డు పొందిన వారి నుంచి తెలుసుకోవాల్సింది, వారిని అనుకరించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ - టుమారో ఈజ్ హియర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రోబోల్లా బతకొద్దు.. కుటుంబంతో గడపండి... అధికారులు జీవిత ప్రాముఖ్యతకు విలువనివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. లేదంటే ఏదో ఒక ఫైలులో ఒక పేజీ లాగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఆందోళనలతో నిండిపోయిన జీవితం ఏదీ సాధించలేదు.. ప్రత్యేకించి మీరు దేశాన్ని నడపాల్సి ఉన్నపుడు! మీరు చక్కగా సమయపాలన చేస్తారు. కానీ.. మీ కుటుంబంతో మీరు నాణ్యమైన సమయం గడుపుతున్నారా? దయచేసి దీని గురించి ఆలోచించండి. రోబోల లాగా జీవించవద్దు.. మీ కుటుంబాలతో నాణ్యమైన సమయం గడపండి. మన జీవితాలు రోబోలుగా మారితే.. అది మొత్తం ప్రభుత్వంపైనా, వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. మీ జీవితాలు ఒక ఫైలు లాగా మారకూడదు. ఒక ప్రభుత్వం ఉంటే.. ఫైళ్లు ఉంటాయి. మరో ప్రత్యామ్నాయం లేదు. అది (ఫైలు) మీ రెండో అర్ధాంగి. మీరు జీవితం గురించి పట్టించుకోకపోతే.. అది ఫైళ్లలో చిక్కుకుపోతుంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉత్తేజంగా ఉండాలంటూ.. ‘‘మీరు అలా ఎందుకు కూర్చున్నారు? అంత సీరియస్‌గా ఉండాలా? ప్రపంచ భారాన్ని మోస్తున్నట్లు? నేను మిమ్మల్నేం కొత్త పని చేయమని అడగబోవట్లేదు...’’ అంటూ మోదీ చతురోక్తులు వేయటంతో అధికారులంతా నవ్వేశారు. అలాగే.. ‘‘మీరు బాగా చదువుతారు. ప్రపంచంలో ఉత్తములైన వారు రాసిన పుస్తకాలు చాలా చదివి ఉంటారు. ప్రాథమికంగా మీ స్వభావమే అది. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. కాలేజీలో ‘యూనియన్ బాజీ’లు (యూనియన్ పోటీలు) చేసే వారు ఇక్కడికి రారు. పుస్తకాల్లో కూరుకుపోయిన వాళ్లు ఇక్కడికి వస్తారు’’ అని వ్యాఖ్యానించటంతో అధికారులు ఘొల్లుమన్నారు. -
మేల్కొంటేనే మేలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి కీలకమైంది. ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిది. మంచి పాలకులను ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటుహక్కు సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటిది. ఇంతటి ప్రాధాన్యమున్న ఓటుహక్కుపై పలువురు అశ్రద్ధ కనబరుస్తున్నారు. ఓటర్ నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యంతప్రాధాన్యమున్న దీని విలువను గుర్తించలేకపోతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రతిఒక్కరూ ఓటు విలువను వివరించి.. దీన్ని వినియోగించుకునేలా చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరి 25నుజాతీయ ఓటరు దినోత్సవంగా ప్రకటించింది. ఆదివారం ఓటుహక్కుపై అవగా హన కల్గించేందుకు అధికారులు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓటుహక్కుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు నడుం కట్టాలి ⇒ యువతరం.. భావితరాలకు మార్గదర్శకం కావాలి ⇒ 18 ఏళ్లు నిండినవాళ్లంతా ఓటర్‌గా పేరు నమోదు చేసుకోండి ⇒ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమాజానికే చేటు ⇒ రండి.. ఓటుహక్కు కోసం చైతన్యవంతులు కండి ⇒ నేడు జాతీయ ఓటరు దినోత్సవం ⇒ జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు యువతరం ముందుకు రావాలి చదువు, భవిష్యత్ కోసం నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదనే విమర్శలున్నాయి. చాలామంది యువతీయువకులు.. ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందనే భావనతో ఓటు విలును గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరుగా కూడా నమోదు చేసుకోవడంలోనూ అనాసక్తి కనబరుస్తున్నారు. యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం.ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం పలు ప్ర త్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్పెషల్ కాంపెయిన్ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటరు నమోదుకు అర్హత.. 18 సంవత్సరాలు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే ఓటరు నమోదుకు అనర్హులు. అయితే ఓటరు కేవలం ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోనే ఓటుహక్కును పొందాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పొందడం చ ట్టరీత్యా నేరం. ఎలా పొందాలంటే.. ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాలి. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలిపేందుకు.. పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్ఓకు అందజేయాలి. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదల్చుకుంటే ఫార్మ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలు ఉంటుంది. సవరణల కోసం.. తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు ఆన్లైన్లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలు కూడా ఉంది. నెట్లోనే సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్‌చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవ కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. -
స్వయం నియంత్రణ ముఖ్యం
మీడియాకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన బెంగళూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మాధ్యమాలు స్వ యం నియంత్రణను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. గ్లోబల్ క మ్యూనికేషన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గురువారమిక్కడ నిర్వహించిన ‘మాధ్యమ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారా లు’ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. మీడియా చేసే విమర్శలను ప్రభుత్వం పూర్తిగా సకారాత్మకంగా స్వీకరిస్తుందని అన్నారు. మీడియాకు సై తం తనదైన స్వాతంత్య్రం ఉండాలని తాను కూడా నమ్ముతానని, అయి తే అదే సందర్భంలో మీడియా సైతం వాస్తవ అంశాలను ప్రజలకు చెప్పేందుకే ఎక్కువ ఆ సక్తి చూపాల్సిన అవస రం ఉందని పేర్కొన్నారు. ఇక పత్రికలతో పోలి స్తే ఎలక్ట్రానిక్ మీడియా తన బ్రేకింగ్ న్యూస్‌లతో సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సైతం మీడియా పట్ల తన మార్గనిర్దేశకాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కార్యక్రమంలో ప్రసార భారతి అధ్యక్షుడు సూర్యప్రకాష్, మంత్రి రోషన్‌బేగ్ పాల్గొన్నారు. శెట్టర్‌పై విరుచుకుపడ్డ సిద్ధు సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్‌పై విరుచుకుపడ్డారు. అత్యాచార నిందితులను ఆయన పక్కనే పెట్టుకొని ప్రభుత్వం అత్యాచారాలను సమర్థిస్తోందం టూ విమర్శ లు చేయడం పూర్తిగా హాస్యాస్పదమని అన్నారు. బీజేపీలోని హరతాళ్ హాల ప్ప, జీవరాజ్, రామదాస్ వీరంతా అత్యాచార నిందితులు కాదా అని ప్రశ్నించారు. వారిని పక్కనే పెట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చే యడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ముందుగా తమ పార్టీలోని వ్యక్తులను సరిచేసి తర్వాత మాట్లాడాలని సూచించారు. -
న్యాయపీఠానికి సమన్యాయమేది?
జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి శాసన విభాగం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ విభాగం మూడూ ముఖ్యమే. రాను రాను న్యాయ విభాగం ప్రధాన పాత్రను నిర్వహించడం మొదలు పెట్టింది. రాజ్యాంగంపైన, ఆ రాజ్యాంగబద్ధంగా చేసుకున్న చట్టాల పైన, వాటి అమలుపైన న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగాన్ని అన్వయించటం, పాలన చట్టబద్ధంగా జరుగుతు న్నదా లేదా అనే అంశాలను చూసే పని న్యాయ విభాగం కోర్టులకు అప్పగించింది. ఆ పని న్యాయమూర్తుల చేత చేయిస్తుంది. అందు వల్ల న్యాయమూర్తుల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే ఈ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎలా నియమిస్తారు? ఈ నియామకాలు, రాజ్యాంగ సూత్రాలు విలువల మీద ఆధారపడి ఉన్నట్టే రాజే న్యాయమూర్తి అయిపోయి, లేదా తన ఉద్యోగులను నియమించి న్యాయపరిపాలన చేసినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ లోనూ జరుగుతున్నదా? జడ్జీల నియామకం తీరు జడ్జీల నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉంది. 124వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని గాని హైకోర్టు జడ్జిని గాని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కొందరు జడ్జీలను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి జడ్జీల నియామకం చేస్తారు. హైకోర్టు జడ్జీలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోను, రాష్ట్ర గవర్నరుతోను సంప్రదించి రాష్ట్రపతి జడ్జీలను నియమిస్తారు. ఈ పద్ధతి 1982 వరకు సాఫీగానే సాగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తితో, మరికొందరు న్యాయమూర్తులతో సంప్రదించి జడ్జీల నియామకం చేస్తారు. ‘సంప్రదించి’ అనే మాటను రాజ్యాంగం స్పష్టంగా వాడింది. 1982లో ఈ పద్ధతిని సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలు 4:3 మెజారిటీతో ఇంతవరకూ వస్తున్న ఆనవాయితీ, పద్ధతి రాజ్యాంగ బద్ధమే అని గుప్తా కేసులో తీర్పునిచ్చింది. అంటే జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఇచ్చింది. అయితే ఈ తీర్పు చాలా దుమారం లేపింది. జడ్జీలను నియమించే అధికా రం ప్రభుత్వానికే ఇస్తే అది తన ఇష్టమొచ్చిన వాళ్లను, అధికార పార్టీకి అనువుగా ఉండే వాళ్లను నియమిస్తుంటుంది, కాబట్టి తీర్పుల్లో పక్షపాతం చూపుతుంది, నియామకాలు న్యాయసూత్రాల ప్రకారం జరిగే అవకాశం ఉండదని వాదిం చారు. 1991లో ముగ్గురు జడ్జీల ధర్మాసనం గుప్తా కేసును పునర్విచారణ చేయవ లసిన అవసరం ఉందని, విస్తృత ధర్మాసనానికి పంపించాలి అని తీర్పునిచ్చింది. దానితో తొమ్మిది మంది జడ్జీలతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1994లో ఈ ప్రత్యేక ధర్మాసనం 5:4 మెజారిటీతో సంచలనాత్మకమైన తీర్పుని చ్చింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు, హైకోర్టులతో ‘సంప్రదించటం’ అనేది తప్పనిసరి అని చెప్పింది. ‘సంప్రదించటం’ అంటే ‘సమ్మతి’కాదు అని 1982లో సుప్రీంకోర్టు చెప్పినా 1994లో మాత్రం ‘సమ్మతి’ కిందనే జమ కట్టింది. అయితే ఒక పద్ధతి రూపొందించింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరో నలుగురు సీనియర్ జడ్జీలను కలిపి ఒక ‘కొలీజియం’ (ఒక చిన్న ఉపసంఘం లాంటిది)ను ఏర్పరచి దాని అభిప్రాయం మేరకు నియా మకాలు జరగాలని తీర్పునిచ్చింది. ఈ సంప్రదింపులలోగాని సమ్మతిలోగాని ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. జడ్జీలను ఈ కొలీజియం ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్రపతి సంతకం చేయవలసిందే. అంటే జడ్జీల నియా మకంలో ఒక కొత్త ఒరవడి పెట్టింది. ఇదే నిర్ణయాన్ని మరొకసారి 1998లో తొమ్మిది మంది జడ్జీలు ధ్రువీకరించారు. అంటే ఇప్పుడు జడ్జీలను జడ్జీలే ఎంపిక చేస్తారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవలసిందే. కొత్త పద్ధతికి ప్రయత్నం ఇటువంటి పద్ధతి ఏ దేశంలోనూ లేదు. మనం సంప్రదాయంగా స్వీకరించిన బ్రిటిష్ న్యాయవ్యవస్థలో కూడా జడ్జీలను జడ్జీలే ఎంపిక చేసుకోరు. మనం అబ్బురపడి అనుకరించటానికి ఉబలాటపడే అమెరికా న్యాయవ్యవస్థలో కూడా ఇలాంటి పద్ధతి లేదు. విచిత్రమేమంటే జడ్జీల నియామకం ప్రభుత్వం చేతు ల్లోంచి లాక్కొని, తమ చేతుల్లో పెట్టకుంటే, అది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలోని ఆర్టికల్స్ 124, 217కి పూర్తి విరుద్ధమని చెప్పటానికి ప్రభుత్వం సాహసిం చలేదు. రాజ్యాంగాన్ని అన్వయించటమే సుప్రీంకోర్టు చేయవలసిన పని గాని, దానిని మార్చే అధికారం కోర్టుకు లేదనే సాధారణ విషయం కూడా ప్రభుత్వానికి తట్టలేదు. మూడు తీర్పుల్లోను కొంత లోటు ఉన్నదని గ్రహించి ప్రభుత్వం జడ్జీల నియామకానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నది. ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ పేరు మీద 2013లో ఒక బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై న్యాయవాదుల నుంచి న్యాయ నిపు ణుల నుంచి రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచి పెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను ఏర్పాటు చేస్తారు. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు. ఆయన తర్వాత వచ్చే ఇద్దరు సీనియర్ జడ్జీలు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి మరో సభ్యుడు. మరో ఇద్దరు ‘ప్రసిద్ధ వ్యక్తులను’ భారత ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కలిసిన బృందం సిఫారసు చేస్తుంది. ఈ ఇద్దరు ప్రసిద్ధులు మూడేళ్లపాటు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రమేయం తగ్గించేందుకే ఈ ఏర్పాటుపైన కూడా వ్యతిరేకత వచ్చింది. ‘ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు’ అనగానే మళ్లీ ప్రభుత్వ పక్షాన ఉండే వారిని నియమించుకుంటారన్నది అభ్యంతరం. ఈ అభ్యంతరాలన్నీ న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్రను లేకుండా చేయటానికే! ప్రభుత్వ పాత్ర ఉన్నదంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశ ఏమీ మిగలదు. ఒకప్పుడు న్యాయవ్యవస్థ నియామకాలన్నీ అగ్రకులాలకే దక్కేవి. మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం ఉండేది కాదు. ఈ కులాల వాళ్లు తీవ్రమైన పోరాటాలు చేస్తే ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రాతినిధ్యం లేని కులాలకు కొంతలో కొంత ప్రాతినిధ్యం ఇవ్వటం మొదలు పెట్టింది. న్యాయవ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉండాలంటే అన్ని వర్గాలకూ ప్రాతి నిధ్యం ఉండాలి. ఒకప్పుడు భారతదేశంలో జడ్జీలు అందరూ అగ్రకులాలకు చెం దిన వాళ్లే, అందులో ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే. రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెడితేనే గానీ ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం జరగదని ఆందోళనచేస్తే ‘న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ ఏమిటని’ వెక్కిరిస్తున్నారు. ఏమన్నా అంటే ‘మెరిట్’ అంటారు. మెరిట్ అనేది కొన్ని కులాలకే గుత్త అని వాళ్ల ఉద్దేశం. అది సరికాదని ఎన్నోసార్లు రుజువవుతూ వచ్చింది. ప్రజాస్వామిక విలువలు ప్రవేశపెడితే నిజమైన ప్రాతినిధ్యం వస్తుందనే విషయం గుర్తించటం లేదు. అమెరికాలో ఉన్నది ఇదే ఈ విధానం అమెరికా, బ్రిటన్ దేశాలలో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడే మొచ్చింది? రాజ్యాంగ సూత్రాల ప్రకారం, భారతదేశ సామాజిక అవసరాలను బట్టి వివిధ తరగతులకు అవకాశం కల్పించవలసిన ప్రాధాన్యాన్ని గుర్తించి, న్యాయమూర్తుల నియామకాన్ని ప్రజాస్వామ్యీకరిస్తే దేశానికి శ్రేయస్కరం. ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసి సక్రమమైన పద్ధతిలో నియామక వ్యవస్థను రూపొం దిస్తే మంచి పరిణామాలు వస్తాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండే పద్ధతితో కొత్త విధానాన్ని రూపొందించి న్యాయవ్య వస్థను ఫ్యూడల్ పగ్గాలలో నుంచి విముక్తం చేయడమే ఇప్పుడు జరగవలసిన అసలు పని. -
ప్రలోభాలకు లొంగవద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దనికలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. శనివారం జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాపరి షత్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 70 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 19.72లక్షల మంది ఓటర్లు నమోదైనట్టు చెప్పా రు. జిల్లాలో ఓటరునమోదు ప్రత్యేక డ్రైవ్ ద్వారా 45వేల మంది ఓటు హక్కు పొందారని తెలి పారు. 18,19సంవత్సరాల వయసుగల యువత జిల్లాలో 40వేల మంది ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ దిశ గా రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఎస్పీఎవి.రంగనాథ్ మాట్లాడుతూ.. డబ్బు ఖర్చు లేకుండా అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అన్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మంచి వ్యక్తులు ఎన్నికయ్యే అవకాశముంటుందన్నారు. ఓటర్లు ఓటు వినియోగాన్ని హక్కుగా మాత్రమే కాకుండా బాధ్యతగా కూడా భావించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ తన బాధ్యతను నిర్వర్తిస్తుందన్నా రు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ ప్రభావం లేకుండా చూస్తుందన్నారు. హాజరైన వారితో కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ ఓటర్లకు సన్మానం క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పదిమంది సీనియర్ సిటిజన్లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, వక్తృత్వ పోటీల విజేతలకు మెమెంటోలను కలెక్టర్, ఎస్పీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, డీఈఓ రవీంద్రనాథ్, డీడీ ఎస్డబ్ల్యూ లక్ష్మిదేవి, డీపీఆర్ఓ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రదర్శన, మానవహారం జాతీయ ఓటరుదినోత్సవం సందర్భంగా నగరం లో భారీ ప్రదర్శన జరిగింది. తొలుత, ఈ ప్రదర్శనను పెవిలియన్ గ్రౌండ్లో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ ప్రారంభించారు. పెవిలి యన్ గ్రౌండ్ నుంచి మయూరిసెంటర్, బస్టాం డ్, వైరారోడ్, జడ్పీసెంటర్ కు ప్రదర్శన సాగింది. అక్కడప్రదర్శకులు మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సందేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ చదివి వినిపించారు. ఓటర్ల ప్రతిజ్ఞ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాపరిషత్ ఆవరణలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెడతాం. మతం, జాతి,కులం, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేశారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులను ఇక్కడి సిబ్బంది స్వీకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లలో బీఎల్ఓలు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత కీలకం. నవ సమాజ నిర్మాణానికి పునాది. సమర్థ పాలనకు ఆయువు. తమను పాలించే పాలకులను నిర్ణయించడానికి, మంచివారిని ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటు సామాన్యుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం లాంటిది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు ఓటు విలువను చెప్పకనే చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన, విలువైన ఓటు పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దేశ భవిత తమ చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు విలువను వివరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ అందిస్తున్న ప్రత్యేక కథనం. చదువు, భవిష్యత్తు నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు. చాలా మంది ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందిలే అనే భావనతో ఓటు విలువను గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరు గా నమోదు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. యువతరం సంఖ్య గణనీ యంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. స్పెషల్ క్యాంపెయిన్ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు చే పట్టింది. ఓటరు నమోదుకు అర్హత ఏమిటంటే.. 2014 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే అనర్హులు. ఓటు హక్కు పొందాలంటే.. ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిసి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ ను నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలియజేయాలంటే.. ఓ పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్ఓకు అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదలచుకుంటే ఫార్మ్ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలుంటుంది. సవరణల కోసం... తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. చిరునామా మార్పు కోసం ఫార్మ 8ఏ పూరించి సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఓటరు నియామకం... పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసే వీలు లేని వారు ప్రోక్సీ ఓటరు (ప్రత్యామ్నాయ ఓటరు) ను ఫార్మ్ 13ఎఫ్ ద్వారా ఏర్పాటు చేసుకోవ చ్చు. అవసరం లేదనుకున్న సమయంలో ఫా ర్మ్ 13జి ద్వారా దానిని రద్దు చేసుకొని ఓటు వేసే అవకాశాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు... ఓటరు నమోదుకు ఆన్లైన్లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలుంది. నెట్లోనే సంబంధిత వివరాలు అన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవా కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చు.