ప్రజాస్వామ్యానికి ప్రశ్నించడమే రక్ష: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య సమాజ పరిరక్షణకు అధికా రంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత సమస్యలు తప్ప ఇతరులవి విస్మరించడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన రామ్‌నాథ్ గోయెంకా స్మారక ఉపన్యాసమిచ్చారు. భారత్‌లో చర్చించే వారికే తప్ప అసహనపరులకు చోటుండరాదని అన్నారు. చర్చలు, అసమ్మతి వంటివి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన పౌరులు, వ్యాపారవేత్తలు, సంస్థలు అన్నీ కూడా, ప్రశ్నించడంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే సంగతిని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
భారత నాగరికతలో బహుళత్వం, సహనం భాగంగా ఉన్నాయని, ఎన్నో తారతమ్యాలున్నా ఏళ్లుగా అవే మనల్ని ఒకటిగా నిలిపాయని అన్నారు. ప్రశ్నించే పాత్రను సంప్రదాయంగా మీడియా పోషిస్తోందని ప్రణబ్ అన్నారు. అన్యాయం, లింగ వివక్ష, కుల, సామాజిక పక్షపాతానికి లోనవుతున్న మిలియన్ల కొద్ది ప్రజలకు మీడియా బాసటగా నిలవాలని సూచించారు. చెల్లింపు వార్తలపై ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేస్తూ...తటస్థ వైఖరితో మీడియా సంస్థలు ప్రజల విశ్వాసం చూరగొనాలని తెలిపారు.