జయహో.. జనతంత్ర భారత్‌ | Celebration Of India's Democracy | Sakshi
Sakshi News home page

జయహో.. జనతంత్ర భారత్‌

Published Mon, Mar 11 2019 3:36 AM | Last Updated on Mon, Mar 11 2019 7:23 PM

Celebration Of India's Democracy - Sakshi

ఓట్ల పండుగ వచ్చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక సంబరానికి తెర లేచింది. రాజకీయ పార్టీల హడావుడి, నాటకీయ పరిణామాలు, రంగురంగుల జెండాలు, హోరెత్తించే ప్రచారాలు..ఒక్కటేమిటి? పెద్ద పండగకు ఉండాల్సిన అన్ని హంగులూ ఈ ఎన్నికల పండగ సంతరించుకుంటుంది. ప్రపంచంలో మరే దేశంతోనూ పోల్చడానికి వీల్లేని విధంగా మన పార్లమెంటు ఎన్నికలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలు పోతున్నాయి. భూగోళంపై అతిపెద్ద ఎన్నికల సంబరం భారతదేశ ఎన్నికలే అన్న సత్యాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా సాగుతూ వచ్చిన ఎన్నికల ప్రక్రియ పదిహేడో లోక్‌సభ నిర్మాణం కోసం మరో అడుగు వేయబోతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో తొంభై కోట్ల మంది ఓటర్లు తమ నేతలను ఎన్నుకోవడానికి రంగం సిద్ధమయింది.  

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగ నిర్మాతలు వేసిన బలమైన పునాది ఎన్నో ఆటుపోటులను, ఆటంకాలను తట్టుకుని నిలబడింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వచ్చింది.భారత దేశంతో పాటు, ఆ తరువాత స్వాతంత్య్రం పొందిన దేశాలెన్నో ఇంకా అనేక ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటే భారత దేశం మాత్రం తన ప్రజాస్వామిక వ్యవస్థను రోజురోజుకూ పరిపుష్టం చేసుకుని, అనేక దేశాలకు పాఠాలు నేర్పుతోంది. ఆసియాలో మయన్మార్, నేపాల్‌ దగ్గర నుంచి ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి దేశాలు ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడానికి భారత్‌ ఊతం ఇస్తోంది. అరబ్‌ విప్లవం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు సాగుతున్న అనేక దేశాలు భారత ప్రజాస్వామిక పురోభివృద్ధి వైపు చూస్తున్నాయి.

పునాది మొదటి ఎన్నికలు
తొలి ఎన్నికల నుంచే నిర్దిష్టమైన అవగాహనతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో కదం కదం కలిపి ముందడుగు వేసిన భారతావని ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసం చేసింది. తొలి ప్రయత్నంలోనే వయసు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు వేసే బృహత్తర అస్త్రం అందజేసింది. 1951లో జరిగిన తొలి ఎన్నికలతో మొదలైన ఎన్నికల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్‌ నుంచి 1952 ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు  కొనసాగింది.

అప్పటి నుంచి 2014 వరకు మొత్తం పదహారు సార్లు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసన సభలకు కూడా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంత వరకు దేశంలోని 29 రాష్ట్రాల్లో మొత్తం 357 సార్లు శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఒక్కోసారి అత్యంత ప్రముఖులను కూడా ఓడించి ఇంటి దారి పట్టించారు. మరికొన్ని సార్లు అనామకులకు కూడా అఖండ విజయం కట్టబెట్టారు. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో జరిగిన యుద్ధాలతోనూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగలేదు.

రాజ్యాంగమే మార్గదర్శి
మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మూలం రాజ్యాంగం. అంబేడ్కర్‌ వంటి వందల మంది మేథావులు నెలల తరబడి మేథోమథనం చేసి రూపొందించిన రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు నుంచి గ్రామ స్థాయి వరకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారాన్ని అట్టడుగు స్థాయి వరకు వికేంద్రీకరించింది. సమాజంలో అణగారిన వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అశకాశం కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి అవసరమైన చర్యలు ఎప్పటి కప్పుడు తీసుకుంటోంది.

ప్రపంచానికే ఆదర్శం
ప్రజాస్వామ్య భారతంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బృహత్తర ప్రక్రియ. దాదాపు 130 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ఓటర్లు...29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 543 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయ ప్రయాసలు, మానవ వనరులతో కూడుకొన్నది. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు అమలయ్యాయి. మొదటి ఎన్నికల సమయంలో దేశ జనాభా 36 కోట్లు. వారిలో 17.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అప్పట్లో పార్లమెంటులో 489 సీట్లు ఉండేవి. కాలక్రమంలో దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగడంతో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో అవసరమైన మార్పులు చేస్తూ వస్తోంది. ఎలాంటి బేధం చూపకుండా నిర్దిష్ట వయస్సు వచ్చిన వారందరికీ ఒకే సారి ఓటు హక్కు కల్పించింది ప్రపంచంలో ఒక్క భారత దేశమే. చాలా దేశాలు మొదట ధనికులకు, తర్వాత విద్యావంతులకు ఇలా దశల వారీగా పౌరులకు ఓటు హక్కు కల్పించాయి. ఆయా దేశాల్లో మహిళలకయితే దశాబ్దాలు పోరాడితే కాని ఓటు హక్కు రాలేదు.

ప్రజలందరికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకించడం భారత్‌లోనే జరిగింది.73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపచేశారు. పరాయివాళ్లకి ముఖం చూపించడానికి ఇష్టపడని, తమ పేరు చెప్పడానికి ముందుకురాని మహిళలను ఓటర్ల జాబితాలో చేర్చడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ప్రవేశపెట్టడం వరకు ఈ 70 ఏళ్లలో పటిష్టమైన దేశ ప్రజాస్వామిక సౌధాన్ని నిర్మిస్తూ వస్తున్నాం.

అతి కొన్ని సందర్భాల్లో మినహాయించి, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి పార్లమెంటుకు, శాసన సభలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారత దేశం ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఓటరు నమోదు నుంచి మొదలు పెట్టి ఎన్నికల అక్రమాలను గుర్తించడం, సకాలంలో నివారించడం, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించడం ,ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తతతో నిబద్ధతతో వ్యవహరించడం ఎన్నికల సంఘం సామర్థ్యానికి నిదర్శనం.

పొరుగు దేశాల పాట్లు
మనతో పాటే స్వాతంత్య్రం పొందిన పాకిస్తాన్‌ అనతి కాలంలోనే ప్రజాస్వామ్యం నుంచి సైనిక పాలనకు మళ్లిపోయింది. ప్రజాస్వామ్యం అక్కడ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అలాగే, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో కూడా ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగడం లేదు. మన దేశంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

అదీ ప్రజాస్వామ్యమంటే...
1999లో వాజపేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతోనే పడిపోవడం మన ప్రజాస్వామ్య చరిత్రలోనే గుర్తుంచుకోదగిన ఘట్టం. వాజ్‌పేయి ప్రభుత్వంపై 1999, ఏప్రిల్‌ 17న పార్లమెంటులో అవిశ్వాస పరీక్ష జరిగింది. మైనారిటీలో ఉన్న వాజపేయి సర్కారుకు మద్దతిస్తామని బీఎస్పీ ఎంపీలు హామీ ఇచ్చారు. తీరా సభలో ఓటు వేసే సమయంలో బీఎస్పీ అధినేత మాయావతి తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. అందరితో పాటు ఒరిస్సాకు చెందిన గిరిధర్‌ గొమాంగో కూడా వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, రెండు నెలల ముందే ఆయన ఒడిశా సీఎంగా  ఎంపికయ్యారు.

అందువల్ల ఆయన ఓటు చెల్లదని ప్రభుత్వం వాదించింది. సీఎం అయినా కూడా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని, దాంతో సాంకేతికంగా ఆయన ఎంపీగానే ఉన్నట్టేనని అందువల్ల ఆయన ఓటు చెల్లుతుందని స్పీకర్‌ స్పష్టం చేశారు. గొమాంగో ఓటుతోనే వాజ్‌పేయి సర్కారు ఓడిపోయింది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయిన తర్వాత ప్రధాని వాజ్‌పేయి చేసిన ప్రసంగం హుందాగా సాగింది. ప్రతిపక్షాలు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము పూర్తిగా మద్దతునిస్తామని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నాలేకపోయినా తమ పార్టీ దేశసేవకి అంకితమై ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విపక్షాలను ఆయన అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement