న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసింది మనుషులే అని.. దయ్యాలు కాదంటున్నది ఎన్నికల సంఘం. ఈసీ ఇంత వ్యంగ్యంగా స్పందించడానికి ఓ కారణం ఉంది. లోఎక్‌సభ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లు.. లెక్కించిన ఓట్ల మధ్య పొంతన లేదని కొందరు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఈసీ శనివారం స్పందించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మనుషులే ఓట్లు వేశారని.. దయ్యాలు కాదని వివరించింది. తాము ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన పోలింగ్ సమాచారం తాత్కాలికమైనదని ఈసీ తెలిపింది. దీనిలో మార్పులు చేయవచ్చని పేర్కొంది. ఈ గణాంకాలు పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది గణాంకాలు కాదని పేర్కొంది. 542 నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది లెక్కలను త్వరలోనే రిటర్నింగ్ అధికారులు పంపిస్తారని, వెంటనే ఆ లెక్కలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
గతంలో ఎన్నికలు జరిగినపుడు వాస్తవ ఎన్నికల సమాచారాన్ని రాబట్టడానికి కొన్ని నెలల సమయం పట్టేదని ఈసీ తెలిపింది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాస్తవ వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని పేర్కొంది. తాజా ఎన్నికల్లో సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను వినియోగించుకున్నామని ఫలితంగా లెక్కించిన ఓట్లపై తుది సమాచారాన్ని ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంచగలిగామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment