న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment