left alliance
-
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
జేఎన్‌యూలో వామపక్షాల విజయభేరి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ విజయం సాధించింది. జేఎన్‌యూ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్ జాయింట్ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులను ఆ కూటమి సొంతం చేసుకుంది. లెఫ్ట్ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. యునిటైడ్ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్ఇండియా స్టూడెంట్ అసోషియేషన్ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఎఐఎస్ఎఫ్) ఉన్నాయి. -
కాంగ్రెస్‌తో వామపక్షాల కూటమి?
కోల్‌కతా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై వామపక్ష పార్టీలు సీరియస్‌గా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను ఎదుర్కొనేందుకు తప్పని పరిస్థితుల్లో పొత్తుగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లు బోగట్టా. అయిష్టంగానే... 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కంచుకోట పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం లెఫ్ట్ ఫ్రంట్ మరియు సీపీఎంలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. కానీ, ఎన్నికల్లో కూటమి కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ లాభపడింది(ఎక్కువ ఓట్లు పోలయ్యాయి). దీంతో మరోసారి పొత్తు తెరపైకి రాగా.. పునరాలోచన చేసుకోవాలని వామపక్ష ఫ్రంట్(ఫార్వర్డ్ బ్లాక్.. ఆర్పీఎస్.. మరికొన్ని చిన్న పార్టీలు) సీపీఎంకు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారంపై సీపీఎంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావటం చూశాం. అయితే బీజేపీ, టీఎంసీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని ఓ వర్గం నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై బెంగాల్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెనర్జీ మాట్లాడుతూ..‘పొత్తులో భాగంగా వామపక్షా పార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు పడుతున్నాయి. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఓట్లు పడటం లేదు. పొత్తు వల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే లబ్ధిచేకూరుతోంది’ అని అన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలదేనని ఆయన స్పష్టం చేశారు. -
జేఎన్‌యూ వామపక్షమే!
- విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ విజయం - నాలుగు పదవులూ కైవసం - ఢిల్లీ వర్సిటీలో పట్టు నిలుపుకున్న ఏబీవీపీ న్యూఢిల్లీ: జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో నాలుగు సీట్లనూ వామపక్ష కూటమి(ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ) గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం నాటి ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్ నమోదవగా..ఫలితాలను శనివారం వెల్లడించారు. అధ్యక్షుడిగా.. ఏఐఎస్ఏ(సీపీఐ-ఎంఎల్ అనుబంధ) విద్యార్థి మోహిత్ పాండే ఎన్నికయ్యారు. ఆయన సమీప ప్రత్యర్థి అయిన ‘బాప్సా’ అభ్యర్థి రాహుల్‌పై 409 ఓట్ల తేడాతో గెలిచారు. ఏబీవీపీ అభ్యర్థి శివశక్తినాథ్ బక్షీకి 694 ఓట్లొచ్చాయి. వామపక్ష కూటమి అభ్యర్థులు అమల్ పిప్లీ ఉపాధ్యక్షుడిగా, శతపుత్ర చక్రవర్తి ప్రధాన కార్యదర్శిగా, తాబేజ్ హుసేన్ సంయుక్త కార్యదర్శిగా గెలిచారు. 31 కౌన్సిలర్ సీట్లలోనూ 30 సీట్లు ఈ కూటమి ఖాతాలోకే చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఘటన తర్వాత కన్హయ్యకుమార్ అరెస్టుతో జేఎన్‌యూ రాజకీయాలపై, ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ హవా ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది. నాలుగు స్థానాలకు గానూ మూడింటిని గెలుచుకుంది. అధ్యక్షుడిగా ఏబీవీపీ నేత అమిత్ తన్వార్, ప్రియాంక ఉపాధ్యక్షురాలిగా, కార్యదర్శిగా అంకిత్ సింగ్ గెలిచారు. ఎన్ఎస్యూఐకి చెందిన మోహిత్ సంయుక్త కార్యదర్శిగా గెలిచాడు. 2014, 2015 ఎన్నికల్లో నాలుగు స్థానాలనూ ఏబీవీపీ గెలుచుకుంది. డీయూలో పాగా కోసం తీవ్రంగా ప్రయత్నించిన వామపక్షాలకు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు.