జేఎన్‌యూ వామపక్షమే!
- విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ-ఏఐఎస్‌ఏ విజయం
- నాలుగు పదవులూ కైవసం
- ఢిల్లీ వర్సిటీలో పట్టు నిలుపుకున్న ఏబీవీపీ
న్యూఢిల్లీ: జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో నాలుగు సీట్లనూ వామపక్ష కూటమి(ఎస్‌ఎఫ్‌ఐ-ఏఐఎస్‌ఏ) గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం నాటి ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్ నమోదవగా..ఫలితాలను శనివారం వెల్లడించారు. అధ్యక్షుడిగా.. ఏఐఎస్‌ఏ(సీపీఐ-ఎంఎల్ అనుబంధ) విద్యార్థి మోహిత్ పాండే ఎన్నికయ్యారు. ఆయన సమీప ప్రత్యర్థి అయిన ‘బాప్సా’ అభ్యర్థి రాహుల్‌పై 409 ఓట్ల తేడాతో గెలిచారు. ఏబీవీపీ అభ్యర్థి శివశక్తినాథ్ బక్షీకి 694 ఓట్లొచ్చాయి. వామపక్ష కూటమి అభ్యర్థులు అమల్ పిప్లీ ఉపాధ్యక్షుడిగా, శతపుత్ర చక్రవర్తి ప్రధాన కార్యదర్శిగా, తాబేజ్ హుసేన్ సంయుక్త కార్యదర్శిగా గెలిచారు. 31 కౌన్సిలర్ సీట్లలోనూ 30 సీట్లు ఈ కూటమి ఖాతాలోకే చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఘటన తర్వాత కన్హయ్యకుమార్ అరెస్టుతో జేఎన్‌యూ రాజకీయాలపై, ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ హవా
ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది. నాలుగు స్థానాలకు గానూ మూడింటిని గెలుచుకుంది. అధ్యక్షుడిగా ఏబీవీపీ నేత అమిత్ తన్వార్, ప్రియాంక ఉపాధ్యక్షురాలిగా, కార్యదర్శిగా అంకిత్ సింగ్ గెలిచారు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన మోహిత్ సంయుక్త కార్యదర్శిగా గెలిచాడు. 2014, 2015 ఎన్నికల్లో నాలుగు స్థానాలనూ ఏబీవీపీ గెలుచుకుంది. డీయూలో పాగా కోసం తీవ్రంగా ప్రయత్నించిన వామపక్షాలకు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు.