మేల్కొంటేనే మేలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి కీలకమైంది. ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిది. మంచి పాలకులను ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటుహక్కు సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటిది. ఇంతటి ప్రాధాన్యమున్న ఓటుహక్కుపై పలువురు అశ్రద్ధ కనబరుస్తున్నారు. ఓటర్ నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యంతప్రాధాన్యమున్న దీని విలువను గుర్తించలేకపోతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.
ప్రతిఒక్కరూ ఓటు విలువను వివరించి.. దీన్ని వినియోగించుకునేలా చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరి 25నుజాతీయ ఓటరు దినోత్సవంగా ప్రకటించింది. ఆదివారం ఓటుహక్కుపై అవగా హన కల్గించేందుకు అధికారులు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓటుహక్కుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
⇒ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు నడుం కట్టాలి
⇒ యువతరం.. భావితరాలకు మార్గదర్శకం కావాలి
⇒ 18 ఏళ్లు నిండినవాళ్లంతా ఓటర్‌గా పేరు నమోదు చేసుకోండి
⇒ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమాజానికే చేటు
⇒ రండి.. ఓటుహక్కు కోసం చైతన్యవంతులు కండి
⇒ నేడు జాతీయ ఓటరు దినోత్సవం
⇒ జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
యువతరం ముందుకు రావాలి
చదువు, భవిష్యత్ కోసం నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదనే విమర్శలున్నాయి. చాలామంది యువతీయువకులు.. ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందనే భావనతో ఓటు విలును గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరుగా కూడా నమోదు చేసుకోవడంలోనూ అనాసక్తి కనబరుస్తున్నారు. యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం.ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం పలు ప్ర త్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్పెషల్ కాంపెయిన్‌ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఓటరు నమోదుకు అర్హత..
18 సంవత్సరాలు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే ఓటరు నమోదుకు అనర్హులు. అయితే ఓటరు కేవలం ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోనే ఓటుహక్కును పొందాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పొందడం చ ట్టరీత్యా నేరం.
ఎలా పొందాలంటే..
ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేయాలి. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
అభ్యంతరాలు తెలిపేందుకు..
పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్‌ఓకు అందజేయాలి. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదల్చుకుంటే ఫార్‌మ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలు ఉంటుంది.
సవరణల కోసం..
తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది.
ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు
ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలు కూడా ఉంది. నెట్‌లోనే సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్‌చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవ కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు.