ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు
సీతంపేట(విశాఖ): రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేలా ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది ప్రజలను వంచించడమేనన్న విషయాన్ని గమనించడం లేదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నాయకులపై వికారియస్ లయబిలిటీ(తప్పును ప్రోత్సహించే, సహకరించే వారిని శిక్షించడం) కింద కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘సంకుచిత రాజకీయాలు- ప్రాంతీయ అసమానతలు’ అన్న అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో విజయబాబు మాట్లాడారు.ప్రాంతీయ అసమానతల వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి కె.ఎస్.చలం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వంచనకు గురవుతూ వెనుకబడిందన్నారు.