p. Vijayababu
-
అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే!
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్ చేయడానికి అను మతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది’.‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు, అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్‌ని నిరోధించడం అత్యంత గర్హనీయం! ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది.’ ‘మీడియా మాత్రమే అధికార, ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రొజెక్ట్ చేయగలదు. మీడియా విధినిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన’. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే కించిత్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? అయితే ఈ మాటలు అన్నది ‘నిన్న!’ అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువు కోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట నాలుగు ప్రముఖ టీవీ చానళ్ళ (సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ)ను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు.గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ని శీతకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు (అసెంబ్లీలో వార్తలు కవర్ చేసే వారికి అడ్డంకులు లేక పోయినా) అసలు అసెంబ్లీ కవరేజ్‌నే అనుమతించలేద న్నట్టు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే ‘అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా’ అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు.పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొక సారి ఈ హక్కు స్పష్టమైంది. భారత నలభై నాల్గవ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్ర బాబు ప్రభుత్వమేనేమో?!మీడియాపై ఆంక్షలు అంటే, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే! స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్ చేసే హక్కు, సమాచా రాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ప్రెస్, మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచు రించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్ 19(1)(ఎ)లోని వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలూ, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి, ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి.‘రొమేశ్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ (1950)తో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో, ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో సుప్రీం కోర్ట్ పేజీలను, సర్క్యులేషన్‌ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలి వేయాలని పేర్కొంది. వాక్, భావప్రకటనా స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమా చారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే... ఆత్యయిక స్థితి నాటి ఆంక్షలు ఎత్తి వేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ అంక్షల ప్రభుత్వంలో భాగ స్వామి కావడం! మార్చి 21 వరకూ జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న నాలుగు టీవీ ప్రతినిధులకూ నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా!పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకుడు -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్‌ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్‌కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు సీతంపేట(విశాఖ): రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేలా ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.విజయబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది ప్రజలను వంచించడమేనన్న విషయాన్ని గమనించడం లేదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నాయకులపై వికారియస్ లయబిలిటీ(తప్పును ప్రోత్సహించే, సహకరించే వారిని శిక్షించడం) కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘సంకుచిత రాజకీయాలు- ప్రాంతీయ అసమానతలు’ అన్న అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో విజయబాబు మాట్లాడారు.ప్రాంతీయ అసమానతల వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి కె.ఎస్.చలం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వంచనకు గురవుతూ వెనుకబడిందన్నారు.