అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే! | Sakshi Guest Column On Chandrababu Govt not allowing Media in Assembly | Sakshi
Sakshi News home page

అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే!

Published Tue, Feb 25 2025 5:01 AM | Last Updated on Tue, Feb 25 2025 11:03 AM

Sakshi Guest Column On Chandrababu Govt not allowing Media in Assembly

అభిప్రాయం

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్‌ చేయడానికి అను మతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది’.

‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు, అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్‌ని నిరోధించడం అత్యంత గర్హనీయం! ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది.’ ‘మీడియా మాత్రమే అధికార, ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రొజెక్ట్‌ చేయగలదు. 

మీడియా విధినిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన’. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌ రెడ్డి అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే కించిత్‌ ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? అయితే ఈ మాటలు అన్నది ‘నిన్న!’ అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువు కోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట నాలుగు ప్రముఖ టీవీ చానళ్ళ (సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, 10టీవీ)ను అసెంబ్లీ సమావేశాలు కవర్‌ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు.

గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ని శీతకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు (అసెంబ్లీలో వార్తలు కవర్‌ చేసే వారికి అడ్డంకులు లేక పోయినా)  అసలు అసెంబ్లీ కవరేజ్‌నే అనుమతించలేద న్నట్టు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే ‘అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా’ అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు.

పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌) చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొక సారి ఈ హక్కు స్పష్టమైంది. భారత నలభై నాల్గవ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్ర బాబు ప్రభుత్వమేనేమో?!

సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ



మీడియాపై ఆంక్షలు అంటే, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే! స్పీకర్‌ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. 

  భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్‌ చేసే హక్కు, సమాచా రాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్‌ మీడియా, కమ్యూనికేషన్‌ రంగంలో సాంకేతిక విప్లవం పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. 

ప్రెస్, మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచు రించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు.  భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్‌ 19(1)(ఎ)లోని వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలూ, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్‌ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి, ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్‌ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి.

‘రొమేశ్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌’ (1950)తో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో, ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. ‘బెన్నెట్‌ కోల్‌మన్‌ అండ్‌ కో వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ (1972) కేసులో సుప్రీం కోర్ట్‌  పేజీలను, సర్క్యులేషన్‌ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలి వేయాలని పేర్కొంది. 

వాక్, భావప్రకటనా స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్‌ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమా చారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే... ఆత్యయిక స్థితి నాటి ఆంక్షలు ఎత్తి వేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ అంక్షల ప్రభుత్వంలో భాగ స్వామి కావడం! 

మార్చి 21 వరకూ జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న నాలుగు టీవీ ప్రతినిధులకూ నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా!

పి. విజయబాబు 
వ్యాసకర్త సీనియర్‌ పత్రికా సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement