దాడి కోసం సాకుల వెతుకులాట | Sakshi Guest Column On USA and Iran Issues | Sakshi
Sakshi News home page

దాడి కోసం సాకుల వెతుకులాట

Published Fri, Apr 4 2025 12:19 AM | Last Updated on Fri, Apr 4 2025 12:19 AM

Sakshi Guest Column On USA and Iran Issues

అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శన (ఫైల్‌)

విశ్లేషణ

ఇరాన్‌ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్‌ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.

ఇది ఇరాన్‌ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్‌ వాదిస్తున్నది. 

చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...
వాస్తవానికి ఇరాన్‌ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్‌ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్‌ కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! 

కానీ ట్రంప్‌ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్‌ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్‌ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్‌ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్‌ స్పష్టం చేస్తున్నది.

దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్‌ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్‌ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. 

అయినప్పటికీ ఇరాన్‌ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్‌ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్‌ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. 

అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్‌ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్‌ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్‌ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. 

ఆ మార్పులో భాగంగా ఇరాన్‌ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్‌లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్‌ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్‌ రివల్యూషన్స్‌’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్‌లో లేవు.

నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్‌లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్‌ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్‌ విద్యార్థులు మా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. 

అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్‌ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!

ఇరానే ఎందుకు లక్ష్యం?
పాలస్తీనా సమస్యపై అరబ్‌ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్‌ గెలవటం, ఈజిప్టు నేత గమాల్‌ అబ్దుల్‌ నాసర్‌ మృతితో పాన్‌ అరబిజం బలహీన పడటంతో అరబ్‌ రాజ్యా లకు ఇజ్రాయెల్‌ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. 

పాలస్తీనా నాయకుడు అరాఫత్‌ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్‌ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్‌ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్‌. 

ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్‌ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్‌ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్‌ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్‌ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.

ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్‌ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్‌ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. 

అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్‌ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు.  అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement