పశ్చిమాసియా చిచ్చుకు బాధ్యులెవరు? | Sakshi Guest Column On West Asia Israel Iran war | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా చిచ్చుకు బాధ్యులెవరు?

Published Fri, Oct 4 2024 4:22 AM | Last Updated on Fri, Oct 4 2024 4:22 AM

Sakshi Guest Column On West Asia Israel Iran war

విశ్లేషణ

లెబనాన్‌పై దాడి, హెజ్బొల్లా అధినేత సయ్యద్‌ హసన్‌ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో ఇరాన్‌ విరుచుకు పడింది. వాటిలో అనేకాన్ని ఇజ్రాయెల్‌ కూల్చివేయగలిగిందిగానీ వాళ్ల నగరాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇదే కొనసాగితే దారుణ విధ్వంసం తప్పదు. ఇప్పటికైనా దౌత్య యత్నాలు సాగుతాయా అన్నది ప్రశ్న. యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాదమనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది. అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది.

ఇరాన్‌ ఈ నెల ఒకటవ తేదీ రాత్రి ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో దాడి చేసింది. అవి అగ్ని బాణాల వలె ఇజ్రాయెల్‌ పైకి దూసుకుపోయి కురుస్తుండటం ఆ రోజు రాత్రి ఆకాశంలో కనిపించి ప్రపంచమంతా ఊపిరి బిగ బట్టింది. ఇక రానున్న రోజులలో ఏమి కావచ్చునన్నది అందరి ఆందో ళన, భయం. ఇందుకు దోహదం చేసిన పరిణామాలు గత కొద్ది రోజు లలో చోటు చేసుకున్నాయి. హెజ్బొల్లా అధినేత సయ్యద్‌ హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ హత్య చేసింది. 

లెబనాన్‌పై దాడులు ప్రారంభించింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ మంగళవారం నాడు ఒక వీడియో విడుదల చేస్తూ నేరుగా ఇరాన్‌ను ఉద్దేశించి రెండు కీలకమైన మాటలు అన్నారు. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ బలానికి అతీతమై నది కాదన్నది మొదటిది. 

ఇరానియన్‌ నాయకుల వల్లనే అక్కడి ప్రజలు పేదరికానికి, ఇతర సమస్యలకు గురవుతున్నారనీ, వారు లేకుంటే ఇరాన్‌ బాగా అభివృద్ధి చెందుతుందనీ, వారికి తమ నాయ కుల సమస్య త్వరలో తీరిపోతుందన్నదీ రెండవది. హెజ్బొల్లా అధినేత హత్య నేపథ్యంలో ఇటువంటి హెచ్చరికలతో ఇరాన్‌ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని వెంటనే తాము సురక్షితమనుకునే రహస్య స్థావరానికి తరలించారు.

త్వరత్వరగా చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి జరిపింది. ఇరాన్‌ వందలాది మిసైళ్లలో అనేకాన్ని ఇజ్రాయెల్‌తో అమెరికా నౌకా దళాలు కూల్చివేశాయి గానీ, మరెన్నో ఇజ్రాయెలీ నగరాలను, సైనిక స్థావరా లను ధ్వంసం చేశాయి కూడా. ఇది ఇంతటితో ఆగుతుందా, లేక యుద్ధం పెచ్చరిల్లుతుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రధానంగా ఇజ్రాయెల్‌ చర్యలపై ఆధారపడి ఉంటుంది. 

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాక్చీ మాత్రం మంగళవారం రాత్రే ఒక ప్రకటన చేస్తూ, తమవైపు చర్యలు ప్రస్తుతానికి ఇంతటితో ఆపుతున్నామనీ, ఇజ్రాయెల్‌ వైఖరిని బట్టి తదుపరి చర్యలుంటాయనీ అన్నారు. మరొకవైపు ఇజ్రా యెల్‌ ప్రధాని, సైన్యాధిపతి తాము ప్రతీకారం తీర్చుకొనగల మన్నారు. లోగడ హమాస్‌ నాయకుడు ఇస్మాయెల్‌ హానియేను తమ దేశంలోనే హత్య చేసినందుకు, అదే విధంగా తమ అగ్రశ్రేణి సైనిక బ్రిగేడియర్‌ జనరల్‌ అబ్బాస్‌ నిల్ఫరోషాన్‌ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిసైళ్లతో దాడి జరిపి, అది తమ హెచ్చరిక అని ప్రకటించింది. 

అపుడు కూడా ఇజ్రాయెల్‌ ప్రతీ కార ప్రకటనలు చేసింది. కానీ బయటి రాజ్యాలు ఇజ్రాయెల్‌ వైపు కొన్ని, ఇరాన్‌ వైపు కొన్ని దౌత్య యత్నాలు చేయటంతో అది అంత టితో నిలిచిపోయింది. ఇపుడు తిరిగి అటువంటి స్థితే తలెత్తుతున్నది. అయితే ఈసారి కూడా దౌత్య యత్నాలు సాగుతాయా లేక పరిస్థితి విషమిస్తుందా అన్నది ప్రశ్న. గతానికి, ఇప్పటికి కొన్ని తేడాలు ఉన్నా యన్నది గమనించవలసిన విషయం. పోయినసారివలె గాక ఇపుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలుపెట్టింది. 

ఇరాన్‌ అధినేతలను హత్య చేయగలమనే నర్మగర్భమైన హెచ్చరికలు చేసింది. పశ్చిమ దేశాల నౌకా బలాలు మధ్యధరాలో ప్రవేశించటమేగాక, ఇరాన్‌ మిసైళ్లను ఎదుర్కొనే రూపంలో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొ న్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతును మరొకమారు ప్రకటించారు. ఇవీ తేడాలు. కనుక, రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు. లేదా జరగక పోవచ్చు. అన్ని వివాదాలకు, ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానిదే ఏదీ ఆగబోదన్నది మౌలిక విషయం. 

ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయా లున్నాయి. మొదటిది–గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం. హమాస్‌ దళాలు గత అక్టోబర్‌లో తమ భూభాగంపై దాడి జరిపి సుమారు 1,200 మంది పౌరులను హత్య చేశారన్న దాన్ని సాకుగా చేసుకుని ఇప్పటికే ఇజ్రాయెల్‌ 42,000 మంది పాలస్తీనియన్లను గాజాలో చంపివేసింది. గాజాకు సంబంధించి మరొక స్థాయిలో ఇజ్రాయెల్‌ చెప్తున్నది, అక్కడ తమ సైనిక నియంత్రణ ఇక శాశ్వతంగా ఉంటుంది. 

పాలస్తీనియన్లే పాలించినా పర్యవేక్షణ తమదవుతుంది. ఐక్యరాజ్య సమితి సైతం వ్యతిరేకిస్తున్నా, అసలు వెస్ట్‌ బ్యాంక్‌ మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగమే, తమదే అనటం రెండవది! పాలస్తీనియన్లకు మద్దతుగా హెజ్బొల్లాతో పాటు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌ తదితర దేశాల మిలిటెంట్లు ఎన్ని నష్టాలనైనా ఎదుర్కొంటూ నిలవడమన్నది మూడవ ముఖ్యమైన విషయం. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం నాల్గవ ముఖ్య విషయం. 

ఇక చివరిది ఇరాన్‌. వారి సైనిక బలం సంఖ్య రీత్యా ఇజ్రాయెల్‌ను మించినదే అయినా, వైమానిక బలం, సాంకేతిక శక్తి అందుకు సాటిరావు. పైగా, ఉక్రెయిన్‌లో వలెనే ఇక్కడ కూడా మొత్తం అమెరికా కూటమి తమ ఆయుధ శక్తి, ధన బలంతో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. రెండు దేశాల మధ్య భూతల యుద్ధం జరిగితే ఇరాన్‌ది పైచేయి కావచ్చునేమోగానీ, మధ్యలో సిరియా, జోర్డాన్, ఇరాక్‌ భూభాగాలు ఉన్నందున అది వీలయ్యేది కాదు. అందువల్ల క్షిపణులు, యుద్ధ విమానాలపై ఆధారపడాలి.

అంతమాత్రాన ఇజ్రాయెల్‌ గెలిచి తీరుతుందని కాదు. ఫలితం ఎట్లున్నా... ఇరాన్‌తో పాటు పాలస్తీనియన్లు, హెజ్బొల్లా, హౌతీలు, లెబనాన్‌తో పాటు ఇరాకీ మిలిటెంట్లు ఒకేసారి విరుచుకుపడితే ఇజ్రా యెల్‌కు తీవ్ర నష్టాలు తప్పవు. పైగా, ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా ప్రపంచమంతటి నుంచి ముస్లిం యువకులు వేలాదిగా వెళ్లి పాల్గొనటాన్ని చూశాము. దీనంతటి పర్యవసానం యుద్ధం పూర్తి స్థాయికి పరిణమించటం.

అట్లా జరగకుండా ఉండాలంటే ఏకైక మార్గం దౌత్య యత్నాలు! అయితే, అమెరికా కూటమి బాహాటంగా ఇజ్రాయెల్‌తో నిలవటం, గాజా యుద్ధాన్ని ఆపించక పోవటమేగాక ఐక్యరాజ్యసమితిని, ప్రపంచాభిప్రాయాన్ని తోసిరాజంటోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో ముడిపడి వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు అటువంటివి. 

సుమారు 120 సంవత్సరాల క్రితం మొదలై, 80 ఏళ్ల నుంచి క్రమంగా జటిలంగా మారుతూ, మరొక 20 ఏళ్లకు కొరకరానికొయ్య అయిపోయిన ఈ సమస్యకు మొట్టమొదటి నుంచి కూడా ఏకైక కారణం వారి ప్రయోజనాలే. 1948కి ముందు అసలు లేనే లేని ఇజ్రాయెల్‌ సృష్టిని, యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో ఆమోదించి పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాద మనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది.

అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది.  పశ్చిమం చిచ్చును సృష్టించింది. దీన్ని ఇన్ని దశాబ్దాలుగా సాగిస్తున్నది వారు మాత్రమేనని మరొకసారి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా గాజా మారణహోమం నుంచి మొదలుకొని జరుగుతున్నదేమిటో ఇజ్రా యెల్, అమెరికాలు గుర్తించక తప్పదు. వారు తమ ఆయుధ బలంతో పైచేయి సాధిస్తుండవచ్చుగాక. కానీ, ప్రపంచం దృష్టిలోనే గాక అంత ర్జాతీయ సంస్థల ఎదుట గతంలో ఎన్నడూ లేనంతగా ఏకాకు లయ్యారు. 

వియత్నాం యుద్ధం తర్వాత అంతటి వ్యతిరేకతను, ఏహ్యతను తిరిగి 50 ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అపుడు జరిగిన అమెరికా క్యాంపస్‌ ప్రదర్శనలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనంతటి నుంచి ఇజ్రాయెల్, అమెరికాలు పాఠాలు నేర్చుకుంటే వారికే మంచిది. చరిత్రలో అనేక సామ్రాజ్యాలు బలంతో విర్రవీగి నేల కూలాయి. అమెరికా సైతం నెమ్మదిగా అదే దిశలో పయనిస్తున్నదని పలువురు పాశ్చాత్య మేధావులే హెచ్చరిస్తున్నారు కూడా!

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement