రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు | Sakshi Guest Column On Ebrahim Raisi | Sakshi
Sakshi News home page

రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు

Published Fri, May 24 2024 5:54 AM | Last Updated on Fri, May 24 2024 5:54 AM

హఠాన్మరణం : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

హఠాన్మరణం : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

విశ్లేషణ

ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన దాడుల నేపథ్యంలో... ఇజ్రాయెల్‌తో, అమెరికాతో ఇరాన్‌కు ప్రచ్ఛన్న ఘర్షణ జరుగుతున్న తరుణంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హఠాన్మరణం ఇరాన్‌ కు అకాల ఘటనే అని చెప్పాలి. తాలిబాన్‌ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్, ఇరాన్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రచ్ఛన్న ఘర్షణలను ముందుకు తీసుకువెళుతున్న దశ ఇది. ఇరాన్‌ పట్ల భారత్‌ సానుకూల వైఖరి చేపడుతున్న ఈ దశలో.. రైసీ మరణం అనేక ప్రశ్నలు రేపుతోంది. ఆంక్షల నుండి భారతదేశాన్ని మినహాయించడానికి అమెరికన్లు గతంలో కంటే తక్కువ సుముఖతనే ప్రదర్శిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. భారత్‌ – ఇరాన్‌ సంబంధాలపై రైసీ మరణం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నది మరొక కీలకమైన ప్రశ్న.

హమాస్‌కి ధన, ఆయుధాల సరఫరాదారుగా, ప్రేరేపకురాలిగా ఇరాన్‌పై ఆరోపణలున్నాయి. ఇరాక్, సిరియా, లెబనాన్‌లో ఉంటున్న ఇరాన్‌ అనుకూల సాయుధ గ్రూపులు, ప్రత్యేకించి హిజ్బుల్లాను ఇందులో భాగస్వాములుగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై తన మొట్టమొదటి ప్రత్యక్ష క్షిపణి, డ్రోన్‌ దాడిని ఇరాన్‌ ఈ ఏప్రిల్‌ 13న ప్రారంభించింది. డమాస్కస్‌లోని ఇరాన్‌ దౌత్య భవనంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడి చేయడం ఇరాన్‌ ని రెచ్చగొట్టటం అందుకు కారణం.  పశ్చిమాసియాలో ఇరాన్‌ రహస్య కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కొంతమంది ఇరాన్‌ సైనిక కమాండర్లు ఈ దాడి ఘటనలో చనిపోయారు.

బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇరాన్‌ నుండి ఇరాక్, సిరియా, లెబనాన్‌ మీదుగా మధ్యధరా సముద్రం వరకు నడుస్తున్న షియా ప్రభావిత ప్రాంతంలో తన అణు కార్యక్రమాన్ని, వ్యూహాత్మక విస్తరణను నియంత్రించడానికి ఇరాన్‌ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అమెరికా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు జర్మనీ మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. 

అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018లో ఇరాన్‌ పై ఆంక్షలు విధిస్తూ ఆ ఒప్పందం నుండి వైదొలిగారు. అదే సమయంలో, అమెరికా అనుసరించే ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరిని మరింతగా పెంచి పోషించారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో స్థావరాల ఏర్పాటును అరికట్టడానికి లేదా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య పరిష్కారం విషయంలో ఇజ్రాయెల్‌ వైపునుంచి  నిబద్ధతను సాధించకుండా అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏకపక్షంగా జెరూసలేంకు మార్చివేశారు. 

తదుపరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ విధానాన్ని పునఃపరిశీలించడానికి ప్రయత్నించారు, కానీ మొదటగా కోవిడ్‌–19 మహమ్మారి, తరువాత ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా, ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలను ఉపయోగించి కొత్త పశ్చిమాసియా, గల్ఫ్‌ భద్రతా నమూనా అమలు గురించి అమెరికా ఊహించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి తన అనుకూల అరబ్‌ దేశాలను అమెరికా ప్రోత్సహించింది. 

ఇరాన్‌తో, పశ్చిమాసియాతో తన లోతైన రాజకీయ సంబంధాలను కొనసాగించడమే దీని లక్ష్యం. కానీ ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో, పాలస్తీనా ప్రాధాన్యాన్ని తగ్గించి వేయడాన్ని సమర్థిస్తున్న తీవ్ర మితవాద పార్టీలతో ఎదురయ్యే ప్రమాదాన్ని అమెరికా విస్మరించింది. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలలో పాలస్తీనియన్లు ప్రాముఖ్యం కోల్పోయారని నెతన్యాహు ఈ సందర్భంగా వాదించారు.

ఈ కొత్త దృక్పథం ఆధారంగా భారత్, మధ్య ప్రాచ్యం, యూరప్‌ ఆర్థిక కారిడార్‌ (ఐఎమ్‌ఈసీ) ప్రతిపాదనకు వచ్చింది. యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భారతదేశ నాయకులు న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ప్రతిపాదనను ఘనంగా ఆవిష్కరించటం కోసం సమావేశమయ్యారు. కానీ అదానీ యాజమాన్యంలోని హైఫా ఓడరేవు ల్యాండ్‌ రూట్‌  ముగింపు కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్‌ని ఈ సందర్భంగా ప్రస్తావనలోకి తీసుకోలేదు. 

పాలస్తీనా సమస్యను పరిష్కరించే విషయంలో ఇజ్రాయెల్‌ నుంచి నిబద్ధత లేకుండా, అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడాన్ని సౌదీ స్పష్టంగానే ప్రతిఘటించింది. తర్వాత ఒక సంవత్సరం లోపే, ఇరాన్‌ ప్రేరేపిత గాజా సంక్షోభం ఐఎమ్‌ఈసీ ప్రాజెక్ట్‌ను ఎత్తివేసింది. యూఏఈ, బహ్రెయిన్‌ వంటి అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన దేశాలు కూడా దేశీయ ప్రజాభిప్రాయాన్ని, అరబ్‌ ప్రజానీకం ఆగ్రహాన్ని సంతృప్తి పరచడానికి, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ బహిరంగ వైఖరిని కఠినతరం చేయవలసి వచ్చింది.

అమెరికా–ఇజ్రాయెల్‌ ప్రణాళికలను చిత్తు చేసిన ఇరాన్‌ ఈ క్రమంలో రష్యా–చైనా కూటమికి దగ్గరైంది.  రష్యాకు సాయుధ డ్రోన్‌ ల ప్రధాన సరఫరాదారుగా ఇరాన్‌ మారింది. ఈ దశలోనే రైసీ మరణం సంభవించింది. రైసీ తన నాలుగేళ్ల పదవీకాలంలో మూడో సంవత్సరంలో ఉన్నారు. ఇరాన్‌ న్యాయవ్యవస్థ మాజీ అధిపతిగా, ప్రజాస్వామ్య దేశాలలో ప్రధాన న్యాయమూర్తుల కంటే ఎక్కువ అధికారం ఉన్న పదవిలో, ఆయన రక్తపు మరకలతో కూడిన కలుషిత గతాన్ని కలిగి ఉన్నారు. 1980లలో రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షను ఆయన పర్యవేక్షించారు. 

2021లో తన ఎన్నిక సాధారణ ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల కంటే తక్కువ స్వేచ్ఛాయుతంగా జరిగింది. సాంప్రదాయికంగా సుప్రీం లీడర్, అతని సలహాదారులు అధ్యక్ష అభ్యర్థుల జాబితాను కత్తిరించడానికి గార్డియన్‌ కౌన్సిల్‌ను ఉపయోగిస్తారు. గతంలో ప్రజలకు కొంత ఎంపిక అవకాశాన్ని, ఎన్నికల స్వేచ్ఛను అందించడానికి దీన్ని తెలివిగా అమలు చేశారు. 1997లో మొహమ్మద్‌ ఖతామీ ఎన్నికైనప్పుడు, అతను వ్యవస్థానుకూలమైన, సంప్రదాయవాదులను ఓడించిన, గుర్తింపు పొందిన సంస్కరణ వాదిగా ఉండేవారు. 

పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని 2021లో నిలిపివేశారు. తరువాత, 2022 సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మహ్సా అమిని అనే యువతి మరణం, ముఖ్యంగా మహిళల నుండి విస్తృతమైన నిరసనలను రేకెత్తించింది. వ్యవస్థ నైతిక అధికారం దెబ్బతినడంతో, 2021 ఓటింగ్‌ శాతం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ నుండి 49 శాతానికి పడిపోయింది. వాస్తవానికి, ఓటర్లు 13 శాతం వ్యతిరేక ఓట్లను వేయడం ద్వారా తమ నిరసన తెలిపారు. ఇది రైసీ ప్రత్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు 50 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు జరగాలి. 

ప్రస్తుత పరిస్థితి భారతదేశం–ఇరాన్‌ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది పెద్ద ప్రశ్న. చాబహార్‌ ఓడరేవు భారత్, ఇరాన్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన చిహ్నం. ఓడరేవును అభివృద్ధి చేయడానికి ఇటీవలి పదేళ్ళ ఒప్పందం తరువాత, అమెరికా ఆంక్షల హెచ్చరికను జారీ చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రతినిధులను ముందుకు తీసుకువెళుతున్నందున, అమెరికన్లు భారతదేశానికి మినహాయింపు ఇవ్వడానికి గతంలో కంటే తక్కువ సుముఖంగా ఉండవచ్చు.

1996–2001 కాలంలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ ను నియంత్రించినప్పుడు ఇండో–ఇరానియన్‌ వ్యూహాత్మక కలయిక అత్యంత సన్నిహితంగా ఉండేది. రెండు దేశాలూ అహ్మద్‌ షా మసూద్‌ నేతృత్వంలోని ఉత్తర కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ 2003 నుండి, ఇరాన్‌ రహస్య అణు కార్యక్రమం వెల్లడి, అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, భారతదేశం అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించింది. అప్పటి నుండి, ఇరు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అనుమానం, లావాదేవీలలో సహనం మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.

రైసీ మరణం ఈ ప్రాథమిక అంశాలను మార్చదు. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలిలోని సుప్రీం లీడర్, సలహాదారులు, ముఖ్యంగా దాని సెక్రటరీ జనరల్‌ అలీ అక్బర్‌ అహ్మదీయన్‌ ఇరాన్‌ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తారు. కానీ రైసీ మరణం ఇరాన్‌ అంతర్గత రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అధికార శూన్యతను పూరించడానికి ఎవరో ఒక నేతను పైకి లేపడం ప్రారంభం కానుంది. 

కేసీ సింగ్‌ 
వ్యాసకర్త ఇరాన్‌  మాజీ రాయబారి, 
మాజీ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement