ebrahim raisi
-
రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ఏముందంటే..
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బయటకు వచ్చింది. రైసీ మృతిపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ నివేదిక ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. హెలికాఫ్టర్‌పై దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. కానీ, దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాల్ని గుర్తించాల్సి ఉందని, తుది నివేదికలోనే ఆ వివరాల్ని ప్రస్తావిస్తామని ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది.ఇరాన్ విడుదల చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పరిశీలిస్తే.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా దారి తప్పలేదు. ప్రమాదం సంభవించడానికి నిమిషం కంటే ముందు కూడా.. హెలికాఫ్టర్ పైలట్, రైసీ కాన్వాయ్‌లోని మిగిలిన రెండు హెలికాప్టర్లను కూడా సంప్రదించారు. బుల్లెట్లు, ఇతర పేలుడుకు సంబంధించిన వస్తువుల జాడ శకలాల్లో కనిపించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.... ప్రతికూల వాతావరణం వల్లే ఘటనా స్థలానికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసింది. హెలికాప్టర్ సిబ్బంది, వాచ్‌టవర్ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తాం.. అని ప్రాథమిక నివేదికలో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. ఆదివారం(మే 19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్ సహా మరో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ సంతాప దినాలు పాటిస్తోంది. భారత కాలమానం ప్రకారం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. విశేషం ఏంటంటే.. మషహద్ రైసీ స్వస్థలం కూడా. -
రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడుల నేపథ్యంలో... ఇజ్రాయెల్‌తో, అమెరికాతో ఇరాన్‌కు ప్రచ్ఛన్న ఘర్షణ జరుగుతున్న తరుణంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హఠాన్మరణం ఇరాన్ కు అకాల ఘటనే అని చెప్పాలి. తాలిబాన్ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రచ్ఛన్న ఘర్షణలను ముందుకు తీసుకువెళుతున్న దశ ఇది. ఇరాన్ పట్ల భారత్ సానుకూల వైఖరి చేపడుతున్న ఈ దశలో.. రైసీ మరణం అనేక ప్రశ్నలు రేపుతోంది. ఆంక్షల నుండి భారతదేశాన్ని మినహాయించడానికి అమెరికన్లు గతంలో కంటే తక్కువ సుముఖతనే ప్రదర్శిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. భారత్ – ఇరాన్ సంబంధాలపై రైసీ మరణం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నది మరొక కీలకమైన ప్రశ్న.హమాస్‌కి ధన, ఆయుధాల సరఫరాదారుగా, ప్రేరేపకురాలిగా ఇరాన్‌పై ఆరోపణలున్నాయి. ఇరాక్, సిరియా, లెబనాన్‌లో ఉంటున్న ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపులు, ప్రత్యేకించి హిజ్బుల్లాను ఇందులో భాగస్వాములుగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై తన మొట్టమొదటి ప్రత్యక్ష క్షిపణి, డ్రోన్ దాడిని ఇరాన్ ఈ ఏప్రిల్ 13న ప్రారంభించింది. డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య భవనంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం ఇరాన్ ని రెచ్చగొట్టటం అందుకు కారణం. పశ్చిమాసియాలో ఇరాన్ రహస్య కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కొంతమంది ఇరాన్ సైనిక కమాండర్లు ఈ దాడి ఘటనలో చనిపోయారు.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇరాన్ నుండి ఇరాక్, సిరియా, లెబనాన్ మీదుగా మధ్యధరా సముద్రం వరకు నడుస్తున్న షియా ప్రభావిత ప్రాంతంలో తన అణు కార్యక్రమాన్ని, వ్యూహాత్మక విస్తరణను నియంత్రించడానికి ఇరాన్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అమెరికా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు జర్మనీ మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018లో ఇరాన్ పై ఆంక్షలు విధిస్తూ ఆ ఒప్పందం నుండి వైదొలిగారు. అదే సమయంలో, అమెరికా అనుసరించే ఇజ్రాయెల్ అనుకూల వైఖరిని మరింతగా పెంచి పోషించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో స్థావరాల ఏర్పాటును అరికట్టడానికి లేదా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య పరిష్కారం విషయంలో ఇజ్రాయెల్ వైపునుంచి నిబద్ధతను సాధించకుండా అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏకపక్షంగా జెరూసలేంకు మార్చివేశారు. తదుపరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విధానాన్ని పునఃపరిశీలించడానికి ప్రయత్నించారు, కానీ మొదటగా కోవిడ్–19 మహమ్మారి, తరువాత ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలను ఉపయోగించి కొత్త పశ్చిమాసియా, గల్ఫ్ భద్రతా నమూనా అమలు గురించి అమెరికా ఊహించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి తన అనుకూల అరబ్ దేశాలను అమెరికా ప్రోత్సహించింది. ఇరాన్‌తో, పశ్చిమాసియాతో తన లోతైన రాజకీయ సంబంధాలను కొనసాగించడమే దీని లక్ష్యం. కానీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో, పాలస్తీనా ప్రాధాన్యాన్ని తగ్గించి వేయడాన్ని సమర్థిస్తున్న తీవ్ర మితవాద పార్టీలతో ఎదురయ్యే ప్రమాదాన్ని అమెరికా విస్మరించింది. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలలో పాలస్తీనియన్లు ప్రాముఖ్యం కోల్పోయారని నెతన్యాహు ఈ సందర్భంగా వాదించారు.ఈ కొత్త దృక్పథం ఆధారంగా భారత్, మధ్య ప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎమ్ఈసీ) ప్రతిపాదనకు వచ్చింది. యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భారతదేశ నాయకులు న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ప్రతిపాదనను ఘనంగా ఆవిష్కరించటం కోసం సమావేశమయ్యారు. కానీ అదానీ యాజమాన్యంలోని హైఫా ఓడరేవు ల్యాండ్ రూట్ ముగింపు కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్‌ని ఈ సందర్భంగా ప్రస్తావనలోకి తీసుకోలేదు. పాలస్తీనా సమస్యను పరిష్కరించే విషయంలో ఇజ్రాయెల్ నుంచి నిబద్ధత లేకుండా, అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడాన్ని సౌదీ స్పష్టంగానే ప్రతిఘటించింది. తర్వాత ఒక సంవత్సరం లోపే, ఇరాన్ ప్రేరేపిత గాజా సంక్షోభం ఐఎమ్ఈసీ ప్రాజెక్ట్‌ను ఎత్తివేసింది. యూఏఈ, బహ్రెయిన్ వంటి అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన దేశాలు కూడా దేశీయ ప్రజాభిప్రాయాన్ని, అరబ్ ప్రజానీకం ఆగ్రహాన్ని సంతృప్తి పరచడానికి, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ బహిరంగ వైఖరిని కఠినతరం చేయవలసి వచ్చింది.అమెరికా–ఇజ్రాయెల్ ప్రణాళికలను చిత్తు చేసిన ఇరాన్ ఈ క్రమంలో రష్యా–చైనా కూటమికి దగ్గరైంది. రష్యాకు సాయుధ డ్రోన్ ల ప్రధాన సరఫరాదారుగా ఇరాన్ మారింది. ఈ దశలోనే రైసీ మరణం సంభవించింది. రైసీ తన నాలుగేళ్ల పదవీకాలంలో మూడో సంవత్సరంలో ఉన్నారు. ఇరాన్ న్యాయవ్యవస్థ మాజీ అధిపతిగా, ప్రజాస్వామ్య దేశాలలో ప్రధాన న్యాయమూర్తుల కంటే ఎక్కువ అధికారం ఉన్న పదవిలో, ఆయన రక్తపు మరకలతో కూడిన కలుషిత గతాన్ని కలిగి ఉన్నారు. 1980లలో రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షను ఆయన పర్యవేక్షించారు. 2021లో తన ఎన్నిక సాధారణ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల కంటే తక్కువ స్వేచ్ఛాయుతంగా జరిగింది. సాంప్రదాయికంగా సుప్రీం లీడర్, అతని సలహాదారులు అధ్యక్ష అభ్యర్థుల జాబితాను కత్తిరించడానికి గార్డియన్ కౌన్సిల్‌ను ఉపయోగిస్తారు. గతంలో ప్రజలకు కొంత ఎంపిక అవకాశాన్ని, ఎన్నికల స్వేచ్ఛను అందించడానికి దీన్ని తెలివిగా అమలు చేశారు. 1997లో మొహమ్మద్ ఖతామీ ఎన్నికైనప్పుడు, అతను వ్యవస్థానుకూలమైన, సంప్రదాయవాదులను ఓడించిన, గుర్తింపు పొందిన సంస్కరణ వాదిగా ఉండేవారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని 2021లో నిలిపివేశారు. తరువాత, 2022 సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మహ్సా అమిని అనే యువతి మరణం, ముఖ్యంగా మహిళల నుండి విస్తృతమైన నిరసనలను రేకెత్తించింది. వ్యవస్థ నైతిక అధికారం దెబ్బతినడంతో, 2021 ఓటింగ్ శాతం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ నుండి 49 శాతానికి పడిపోయింది. వాస్తవానికి, ఓటర్లు 13 శాతం వ్యతిరేక ఓట్లను వేయడం ద్వారా తమ నిరసన తెలిపారు. ఇది రైసీ ప్రత్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు 50 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు జరగాలి. ప్రస్తుత పరిస్థితి భారతదేశం–ఇరాన్ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది పెద్ద ప్రశ్న. చాబహార్ ఓడరేవు భారత్, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన చిహ్నం. ఓడరేవును అభివృద్ధి చేయడానికి ఇటీవలి పదేళ్ళ ఒప్పందం తరువాత, అమెరికా ఆంక్షల హెచ్చరికను జారీ చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమ ప్రతినిధులను ముందుకు తీసుకువెళుతున్నందున, అమెరికన్లు భారతదేశానికి మినహాయింపు ఇవ్వడానికి గతంలో కంటే తక్కువ సుముఖంగా ఉండవచ్చు.1996–2001 కాలంలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను నియంత్రించినప్పుడు ఇండో–ఇరానియన్ వ్యూహాత్మక కలయిక అత్యంత సన్నిహితంగా ఉండేది. రెండు దేశాలూ అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని ఉత్తర కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ 2003 నుండి, ఇరాన్ రహస్య అణు కార్యక్రమం వెల్లడి, అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, భారతదేశం అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించింది. అప్పటి నుండి, ఇరు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అనుమానం, లావాదేవీలలో సహనం మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.రైసీ మరణం ఈ ప్రాథమిక అంశాలను మార్చదు. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలిలోని సుప్రీం లీడర్, సలహాదారులు, ముఖ్యంగా దాని సెక్రటరీ జనరల్ అలీ అక్బర్ అహ్మదీయన్ ఇరాన్ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తారు. కానీ రైసీ మరణం ఇరాన్ అంతర్గత రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అధికార శూన్యతను పూరించడానికి ఎవరో ఒక నేతను పైకి లేపడం ప్రారంభం కానుంది. కేసీ సింగ్ వ్యాసకర్త ఇరాన్ మాజీ రాయబారి, మాజీ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
ఏం జరగనుంది?
ప్రపంచమంతటినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదం... విన్న వెంటనే రకరకాల ఆలోచనలు, అనుమానాలు తలెత్తిన అనూహ్య ఘటన... ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ, విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాయవ్య ఇరాన్లో ఆదివారం కుప్పకూలిందన్న వార్త పలు పాత, కొత్త విషయాలను ఏకకాలంలో స్ఫురణకు తెచ్చిన సంచలనం. అంతర్జాతీయ ఆంక్షలు, విమానాల నిర్వహణలో కష్టాల వల్ల ఇరాన్లో విమానయాన భద్రత దీర్ఘకాలంగా పెనుసవాలైంది. తాజా ఘటనతో ఆ సంగతి మళ్ళీ రుజువైంది. గగనయానంలో గతంలో పలువురు ప్రముఖుల దుర్మరణాల మొదలు రైసీ హయాంలో ఇరాన్ ప్రస్థానం, రానున్న కాలంలో వచ్చే మార్పుల వరకు అనేకం చర్చనీయాంశాలయ్యాయి.ఇరాన్ – ఇరాక్ యుద్ధం నాటి నుంచి తన విపరీత వర్తనతో వార్తల్లో ఉన్న సంప్రదాయవాద మతబోధకుడు రైసీ దేశాధ్యక్షపదవిని చేపట్టింది 2021లోనే! ఆయన కన్నా ముందు మితవాది అయిన హసన్ రోహానీ ఎనిమిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. చర్చల ద్వారా మార్పు తేవాలనీ, దేశాన్ని సుసంపన్నం చేయాలనీ భావించిన రోహానీకి పూర్తి భిన్నమైన వ్యక్తి రైసీ. కరడుగట్టిన ఛాందసం, హిజాబ్ «ధారణ సహా సమాజంలో కఠిన నిబంధనల అమలు, వందలాది ఉరిశిక్షలతో అంతులేని అపకీర్తి సంపాదించుకున్నారు. నిజానికి, అమెరికా సహా ప్రపంచ దేశాలతో అణు ఒప్పందంపై 2015లో రోహానీ సంతకం చేశారు. కానీ, ఆనక అమెరికా అధ్యక్షపీఠమెక్కిన ట్రంప్ మాటతప్పి, 2018లో ఇరాన్‌పై మళ్ళీ ఆంక్షలు విధించేసరికి దేశంలో చెల్లని కాసయ్యారు.ఫలితంగా మితవాదుల్ని తోసిపుచ్చి, ఛాందసులు పట్టు బిగించారు. మానవ హక్కుల సంఘాలు సహా అందరూ వ్యతిరేకించడంతో అంతకు ముందు ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు 2021లో రైసీ పీఠమెక్కారు. దేశాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కొద్ది కాలమే! ఆయన హయాంలో పొరుగున ఉన్న అరబ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో, పాశ్చాత్య ప్రపంచంతో ఘర్షణలు మరింత పెరిగాయి. ప్రాణాలు తీసిన హెలికాప్టర్ చాలా పాతదంటున్నారు. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల కారణంగా కొత్త ఛాపర్లు, విమానాలను ఇరాన్ సమకూర్చుకోలేకపోయిందట. అమెరికా మాటెలా ఉన్నా... చైనా, రష్యాలతో సాయిలా ఫాయిలాగా ఉంటున్న దేశానికి, అందులోనూ అసంఖ్యాకంగా డ్రోన్లు సహా అపమిత ఆయుధ సంపత్తి గల దేశానికి పాత ప్రయాణ సాధనాలే గతి అయ్యాయంటే ఆశ్చ ర్యమే. ఏమైనా, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు హమాస్, హెజ్బుల్లా లాంటి వాటికి కొండంత అండగా నిలిచి రైసీ అక్షరాలా అమెరికాకు కంటిలో నలుసయ్యారు. అందుకే, హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలు వినవచ్చాయి. ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలు... ఆ అను మానాలకు బలమిచ్చాయి. తమపై దాడి చేసిన హమాస్‌కు పెద్ద అండ ఇరాన్ గనక తెగబడి ఇజ్రా యెల్ గుట్టుగా హత్య చేయించి ఉండవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పైగా, గాజా చర్యల్లో ఇజ్రాయెల్‌ను బాహాటంగా సమర్థిస్తూ, దానితో వ్యూహాత్మక సహకారమున్న అజర్‌బైజాన్‌కు రైసీ వెళ్ళి వస్తున్నప్పుడే ఘటన జరగడం గమనార్హం. అయితే అనుమానాలకు తగిన ఆధారాలు కానీ, కనీసం ఇరాన్ నుంచి ఆరోపణలు కానీ... ఏవీ ఇప్పటి దాకా బయటకు రాలేదు. ఫలితంగా, దురదృష్టకర ప్రమాదంలోనే ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారని ప్రస్తుతానికి భావించాలి.ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపి, నిజానిజాలను సమగ్రంగా బయటపెట్టాల్సిన బాధ్యత ఇరాన్‌దే! ఏమైనా, అమెరికా ఆంక్షలు, ఆర్థికరంగంలో ఇక్కట్లు, సమాజంలో అసంతృప్తి, నెత్తిన పశ్చిమాసియా కుంపటితో అస్తుబిస్తు అవుతున్న వేళ ఈ దుర్ఘటన ఆ దేశానికి అశనిపాతం. ఇక, ప్రస్తుతానికి దేశ ఉపాధ్యక్షుడికి తాత్కాలిక అధ్యక్ష హోదా ఇచ్చారు. యాభై రోజుల సంతాప దినాల తర్వాత ఇరాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో అధినాయకుడి (అలీ ఖమేనీ)దే ఆఖరు మాట. అయినా అధ్యక్ష పదవి సైతం కీలకమే! దేశీయ, ప్రాంతీయ అనిశ్చితులు ఎన్నో ఉన్నా, రైసీ దుర్మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ రాజకీయాల్లో, విధానాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయనీ అనుకోలేం. హెలికాప్టర్ ప్రమాదఘటన ఇరాన్‌కు తీరని విషాదమే తప్ప, రాజకీయ సంక్షోభం కాదని విశ్లేషకులూ తేల్చేస్తున్నారు. అధినాయకుడైన ఖమేనీకి ఆశ్రితుడిగా, ఆయన మాటను ధిక్కరించే ఆలోచనైనా లేని అధ్యక్షుడిగా, ఎనభై అయిదేళ్ళ వయసు మీద పడ్డ ఆయనకు అరవయ్యో పడిలోని వారసుడిగా అందరూ భావించిన రైసీ హఠాన్మరణంతో ఒక అధ్యాయమైతే ముగిసింది. ఇరాన్ చరిత్రలో కొత్త అధ్యాయం ఏమిటి, వారసుడెవరన్నది చర్చ. ఈ వారసత్వ రాజకీయాల కొత్త కూర్పులో ఖమేనీ కుమారుడు సయ్యిద్ మొజ్తబా హుసేనీ పైకి వస్తారని ఓ అంచనా. ఇస్లామిక్ ధర్మశాస్త్ర పాలన (వెలాయత్ ఎ ఫకీ) పేరిట మతాచార్యులకు పెద్ద అయిన షియా ధర్మశాస్త్రవేత్త అధినాయకుడిగా కొనసాగే పద్ధతి 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్లో వచ్చింది. అధినాయకుడు, ఆ తర్వాతే దేశాధ్యక్షుడు వగైరా అన్న విధానంపై విమర్శలు, చట్ట బద్ధతపై ప్రశ్నలు, అధికారానికి అనేక సవాళ్ళు వచ్చినా ఇన్నేళ్ళుగా అది కొనసాగింది. 1989 నుంచి ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్ నడిచింది. కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, దీర్ఘకాలంగా అణిచిపెడుతున్నప్పటికీ పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి లాంటివి ఈ ఇస్లామిక్ దేశం ముందున్న పెనుసవాళ్ళు. వాటిని అధినాయకత్వం ఎలా దీటుగా ఎదుర్కొంటుందో కచ్చితంగా ఆసక్తికరం. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
దుబాయ్: ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వతసానువుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రాణాలు కోల్పోయా రు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ (60), ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహ్మతీ, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్‌పై గత నెలలో ఇరాన్ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరువకముందే రైసీ హఠాన్మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. అయితే రైసీ మరణోదంతంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ సోమవారం స్పష్టంచేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షొయిగు మాట ఇచ్చారు. రైసీ మరణం నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించారు. ఉపవిదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అధ్యక్షుడి మరణవార్త తెలిసి ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదల య్యాయి. ఐదు రోజులు సంతాపదినాలుగా పాటించనున్నారు. లెబనాన్, సిరియా సైతం మూ డ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. భార త్ సైతం ఒక రోజు(మంగళవారం)ను సంతాప దినంగా ప్రకటించింది. రైసీ, ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువును మష్హాద్ నగరంలో చేసే అవకాశం ఉంది.జాడ చెప్పిన తుర్కియే అత్యాధునిక డ్రోన్భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీప్రాంతం కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసినా గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియే తమ అత్యాధునిక నిఘా డ్రోన్‌ను రంగంలోకి దింపింది. అది అడవిలో ఉష్ణాగ్రతల్లో మార్పుల ఆధారంగా సరిహద్దుకు 20 కి.మీ.ల దూరంలోని పచ్చని అటవీప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. ఆ తర్వాతే రైసీ మరణవార్తను ధ్రువీకరించారు. సంతాపాల వెల్లువరైసీ మరణవార్త తెల్సి చాలా ప్రపంచదేశాలు తమ సంతాప సందేశాలను పంపించాయి. ప్రధాని మోదీ సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ‘‘ రైసీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్–ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషి చిరస్మరణీయం. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. లెబనాన్, సిరియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా, టర్కీ, రష్యా, మలేసియా, హౌతీ, ఖతార్, ఇరాక్, పాకిస్తాన్, అజర్బైజాన్, పోలండ్, యూఏఈ, వెనిజులా దేశాలు, యూరోపియన్ యూనియన్, ఐక్యరా జ్యసమితి, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంతాపం తెలిపాయి. గొప్ప సోదరుడిని కోల్పోయామని లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా, హమాస్‌తో పాటు హౌతీ తిరుగుబాటుదారులు సంతాపం ప్రకటించారు.నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు?తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్ కేవలం 50 రోజులు కొనసాగనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటుచేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఖైదీల సామూహిక ఉరి ఉదంతంలో ప్రమేయంమతబోధకుల కుటుంబంలో మస్హద్ నగరంలో 1960 డిసెంబర్ 14న రైసీ జన్మించారు. మోతాహరీ యూనివర్సిటీలో న్యాయవిద్యను చదివారు. 15 ఏళ్ల వయసులోనే ‘ఖ్వామ్’లో మతవిద్యను నేర్చుకున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవకాలంలో పశ్చిమదేశాల మద్దతున్న ఇరాన్ పాలకుడు షాకు వ్యతిరేకంగా ఆయాతొల్లా రుహొల్లా ఖొమేనీ చేసిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 21 ఏళ్లకే కరాజ్ నగర ప్రాసిక్యూటర్‌గా, పాతికేళ్లకే టెహ్రాన్ డెప్యూటీ ప్రాసిక్యూటర్‌గా పనిచే శారు. అటార్నీ జనరల్ స్థాయికి ఎది గారు. తదనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. అయితే 1988 ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వేలాదిమంది రాజకీయ ఖైదీలను దేశవ్యాప్తంగా సామూహికంగా ఉరితీసిన ఉదంతంలో రైసీ ముఖ్యపాత్ర పోషించారని అమెరికా, ఇతర దేశాలు ఆరోపించాయి. రైసీ 2017లో హసన్ రౌహానీతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2021లో మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమైన ప్రత్యర్థి నేతలందర్నీ అనర్హులు గా ప్రకటించడంతో రైసీ గెలుపు సులువైంది. ఛాందసవాద మత సంప్రదాయాల పేరిట భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళా, మానవ హక్కులను కాలరాశారని ఆయనపై మాయని మచ్చ పడింది. ఈయన మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన కఠిన హిజాబ్ చట్టాన్ని అమలుచేస్తూ నైతిక పోలీసులు 2022లో మహ్సా అమిని అనే మహిళను కొట్టిచంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ భవిష్యత్ రాజకీయ వారసునిగా రైసీ పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. హసన్ రౌహానీ కాలంలో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని రైసీ మరింత పెంచి అంతర్జాతీయ ఆంక్షలకు గురయ్యారు. పాత, కొత్త ఆంక్షల కారణంగానే కొత్త హెలికాప్టర్లు కొనలేక పాత హెలికాప్టర్ల విడిభాగాలు దొరక్క, మరమ్మతులు చేయలేక చివరకు అదే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. రైసీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మరోవైపు సంబరాలు!అతివాద రైసీ మరణవార్త తెల్సి ఇరాన్లో ఓవైపు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ‘టెహ్రాన్ నరహంతకుడు’ అంతమయ్యాడని వేలాది మంది బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఇరానీయన్లు వేడుకలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు పేల్చుతున్న మీమ్స్, జోక్స్‌కు కొదవే లేదు. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుణ్ణు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’’ అని అమెరికాలో ఉన్న ఇరాన్ పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్ వ్యాఖ్యానించారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం. -
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.కాగా తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.#Iranian President #Ibrahim #Raisai's last trip, the video of the aerial tour of the dam before the helicopter Crashh!!#Iran pic.twitter.com/fUTlBqpKW7— Imran Pazir (@imranpazir1) May 20, 2024తరువాతి అధ్యక్షుడు ఆయనే..కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్, పార్లమెంటరీ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోల్లమ్‌హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్-ఇరాన్ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…— Narendra Modi (@narendramodi) May 20, 2024 ‘ఈ మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం.-భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్Deeply shocked to hear of the passing away of Iran’s President Dr Ebrahim Raisi and Foreign Minister H. Amir-Abdollahian in the helicopter crash. Recall my many meetings with them, most recently in January 2024. Our condolences to their families. We stand with the people of…— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 20, 2024 కాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్-212 ఆదివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ ధ్రువీకరించింది.రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియాన్ (60), తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్- అజర్‌బైజా ప్రావిన్స్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం బయలుదేరిన దాదాపు 30 నిమిషాలకే అడవుల్లో కుప్పకూలింది.మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణవార్త పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ హమాస్‌కు మద్దతుగా ఉంది. గత నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుపడిన విషయం తెలిసిందే. -
కుప్పకూలిన హెలికాఫ్టర్ ఇరాన్ అధ్యక్షుడు మృతి
-
హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
టెహ్రాన్: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్-ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. హెలికాఫ్టర్ పూర్తిగా కాలి ధ్వంసం అయినట్లు ప్రకటించాయి. క్రాష్ సైట్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ రెడ్ క్రెసెంట్ చీఫ్ పిర్హోస్సేన్ కూలివండ్ ప్రకటించారు.Imagens adicionais de drone mostrando uma imagem mais nítida do local da queda do falecido presidente do Irã, o helicóptero de Ebrahim Raisi, que caiu ontem no noroeste do Irã, resultando na morte de todos os passageiros. #EbrahimRaisí pic.twitter.com/TPUrzL2oGz— 💢 𝑨𝒏𝒕𝒐𝒏𝒆𝒍𝒍𝒊 𝑹𝒐𝒅𝒓𝒊𝒈𝒖𝒆𝒔 💢 (@antonellibjj) May 20, 2024అంతకు ముందు టర్కీకి చెందిన డ్రోన్లు.. హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇరాన్ బలగాలకు సాయం అందించాయి.ఆదివారం అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్‌తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్‌లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే హెలికాఫ్టర్ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వయత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. -
రైసీ క్షేమమేనా?.. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్స్.. క్షణక్షణం ఉత్కంఠ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీని రక్షణ బలగాలు గుర్తించాయి. ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. టర్కిష్ టెక్నాలజీ ఆధారిత డ్రోన్‌తో సెర్చ్ ఆపరేషన్‌ను ఇరాన్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి.. పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరాన్ త్రివిధ దళాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాత్రి సైతం నైట్ విజన్ హెలికాఫ్టర్లతో సోదాలు జరిగాయి. వాతావరణం వర్షం కారణంగా సహకరించకపోవడంతో గగన తల సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో బలగాలు గ్రౌండ్ లెవల్లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY— AA Canlı (@AACanli) May 19, 2024ఇంకోవైపు.. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించేలా కనిపించడం లేదు.ఆదివారం ఓ అధికారిక కార్యక్రమంలో ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. ఇరాన్-అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను.. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ ఆర్థిక మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ప్రమాదాన్ని ధృవీకరించకుండా వస్తోంది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్‌కు ప్రమాదం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవాడనికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు. అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. భారీ పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని ఇరాన్ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయిటెహ్రాన్ టైమ్స్ ప్రకారం.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. -
‘గీత’ దాటితే శిక్ష తప్పదు.. హిజాబ్ అల్లర్లపై అధ్యక్షుడి ‘రెడ్ లైన్’
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు కదంతొక్కటంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. మరోవైపు.. నిరసనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం తలెత్తిన గందరగోళ పరిస్థితులను తప్పుపట్టారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని రైసీ హెచ్చరించారు. ‘పౌరుల రక్షణే ఇరాన్ ప్రజల రెడ్ లైన్. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరికీ అధికారం లేదు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం‘ అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందని.. ఫోరెన్సిక్, నిపుణుల బృందం నివేదిక త్వరలోనే వస్తుందని తెలిపారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే 22 ఏళ్ల యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. అమీని మరణించిన మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి -
హిజాబ్ వేస్కోను.. ఇరాన్ అధ్యక్షుడికి జర్నలిస్ట్ ఝలక్
న్యూయార్క్: ఇరాన్లో హిజాబ్ హీట్ కొనసాగుతున్నవేళ.. మరో ‘అంతర్జాతీయ’ పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత్రికేయ దిగ్గజం క్రిస్టియానే అమన్‌పౌర్(64).. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసికి ఝలక్ ఇచ్చారు. సీఎన్ఎన్ ఛానెల్ తరపున ఆమె, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే.. హిజాబ్ ధరించాలన్న షరతుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధ్యక్షుడు రైసి. అమన్‌పౌర్ పుట్టింది లండన్‌లోనే అయినా ఆమె తండ్రి మొహమ్మద్ తఘీ ఇరాన్వాసి. పైగా పదకొండేళ్లవరకు అమన్, టెహ్రాన్‌లోనే పెరిగారు. ప్రస్తుతం CNNకు చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్‌గా పని చేస్తున్నారామె. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసి న్యూయార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. అమన్‌పౌర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే.. ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అధ్యక్షుడు రైసి సిబ్బంది వచ్చి.. హిజాబ్ ధరించాలంటూ అమన్‌పౌర్‌కు సూచించారు. ‘‘గతంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతు విధించడం చూడలేదు. కాబట్టి, నేను అంగీకరించను’’ అని ఆమె తేల్చి చెప్పింది. అయితే ఇరాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా(హిజాబ్ వ్యతిరేక నిరసనలు)ధరించాలని, కనీసం తలను కప్పేస్తూ ఏదైనా గుడ్డ చుట్టుకోవాలని రైసీ అనుచరుడొకరు ఆమెకు సూచించాడు. అయినప్పటికీ ఆమె ససేమీరా అనడంతో సిబ్బంది వెనుదిరిగారు. కాసేపటికే.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అధ్యక్షుడు రైసి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమె ట్విటర్లో తన నిరసన వ్యక్తం చేశారు. తన ఎదురుగా ఖాళీ చెయిర్‌ను చూపిస్తూ.. ఇంటర్వ్యూ తాలుకా సెట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరిస్తూ.. అధ్యక్షుడు రైసి తీరును తప్పుబట్టారు. And so we walked away. The interview didn’t happen. As protests continue in Iran and people are being killed, it would have been an important moment to speak with President Raisi. 7/7 pic.twitter.com/kMFyQY99Zh — Christiane Amanpour (@amanpour) September 22, 2022 President Raisi “has a history of blood of his hands,” says @hdagres. “There’s a rise in repression in Iran in recent months… [But] Iranians are fed up with the Islamic Republic and as long as things stay as they are, these protests are going to be continuing for years to come.” pic.twitter.com/vy6FpsPpmc — Christiane Amanpour (@amanpour) September 22, 2022 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ నెల మొదటి వారంలో 22 ఏళ్ల వయసున్న మహ్సా అమిని హిజాబ్ అనే యువతిని హిజాబ్ ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేయగా.. కస్టడీలోనే ఆమె కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు గుప్పుమన్నాయి. మహిళలు జుట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇక ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో 31 మంది మృతి చెందినట్లు అనధికార సమాచారం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలను ‘గందరగోళ చర్య’గా అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛా హక్కు ఇరాన్‌లోనూ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న అల్లర్లను మాత్రం అంగీకరించబోమని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: హూ ఈజ్ హుస్సేన్?.. గిన్నిస్ రికార్డు